Sunday, December 22, 2024

అస్తమించిన ఉద్యమ కెరటం

- Advertisement -
- Advertisement -

మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత జిట్టా

మనతెలంగాణ /యాదాద్రి భువనగిరి ప్రతినిధి: తెలంగాణ ఉద్యమ కెరటం, భువనగిరి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించి, విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని స్వరాష్ట్ర సాధన కోసం తనదైన శైలిలో పోరాటం సాగించిన జిట్టా బాలకృష్ణారెడ్డి నింగికెగిశారు. గత కొన్ని రోజులుగా ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్‌తో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తది శ్వాస విడిచారు.

ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ఘనత..

తెలంగాణ ఉద్యమకారుడిగా జిట్టా బాలకృష్ణారెడ్డికి మంచి పేరు ఉంది. కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా ఉండి ఉద్యమంలో కీలకంగా పని చేశారు. అయితే 2009లో పొత్తులో భాగంగా భువనగిరి టికెట్‌ను టీడీపీకి కేటాయించారు. దీంతో ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జిట్టా రెండో స్థానంలో నిలిచారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జిట్టా వైఎస్సార్ మరణంతో ఆ పార్టీకి సైతం రాజీనామా చేశారు. 2014లో భువనగిరి అసెంబ్లీకి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. వైఎస్ఆర్‌సీపీలో కొంతకాలం పనిచేసిన జిట్టా.. యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. 2018లో బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా భువనగిరి నుంచి పోటీ చేసినప్పటికీ గెలుపు అందుకోలేకపోయారు. 2022లో బీజేపీలో చేరి పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అక్కడి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో 2023 అక్టోబర్ 20న బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గడచిన అసెంబ్లీ ఎన్నికలలో సైతం ఆయన భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.

జననం..

జిట్టా బాలకృష్ణ రెడ్డి 14 డిసెంబర్ 1972న తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1987లో బీబీ నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి సెకండరీ స్కూల్, 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, 1993లో ఎల్‌బీ నగర్ నుంచి డీవీఎం డిగ్రీ అండ్ పీజీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు.

శోకసంద్రంలో భువనగిరి..

జిట్టా బాలకృష్ణారెడ్డి మరణ వార్త తెలుసుకుని భువనగిరి, ఆలేరు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ఆవేదనకు లోనయ్యారు. తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచి భువనగిరి కోటకు లైట్లు వేయడం, భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టారు. అన్ని గ్రామాల్లో యువతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పోరాటంలో ఉత్సాహపరచడం, గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, సాగు, తాగునీటి కాలువల కోసం పోరాటం చేశారు.

ఇక పోచంపల్లి ప్రాంతంలో కాలుష్య కంపెనీలపై కొట్లాడడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం లాంటి అనేక మంచి కార్యక్రమాలు చేయడంతో ఆయన లేరన్న వార్తను ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన తిరిగి కోలుకుని ఆరోగ్యంగా ప్రజల ముందుకు రావాలని ఇటీవలే ఆయన అభిమానులు భువనగిరి ఎల్లమ్మ గుడి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని నియోజకవర్గంలోని చాలా చోట్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. కానీ, ఇప్పుడు ఆయన మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

నేడు సాయంత్రం అంత్యక్రియలు..

జిట్టా బాలకృష్ణారెడ్డి అంతక్రియలు నేడు సాయంత్రం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. భువనగిరి శివారులోని మగ్దూంపల్లి దారిలో ఉన్న ఆయన వ్యవసాయ క్షేత్రం వద్ద అంత్యక్రియలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంత్యక్రియలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపిపిలు జడ్పిటిసిలు అన్ని పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News