సిఎం రేవంత్‌రెడ్డి, మాజీ సిఎం కెసిఆర్ సంతాపం
మన తెలంగాణ/సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు, మాజీ ఎంఎల్‌సి ఆర్.సత్యనారాయణ (60) ఆదివారం ఉదయం సంగారెడ్డిలోని తన స్వగృహంలో మృతి చెందారు. కొద్ది నెలలుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం కొంత మెరుగుపడింది. కోలుకుంటారని భావిస్తున్న సమయంలో ఆయన తుది శ్వాస విడవడంతో కుటుంబ సభ్యులు, తెలంగాణ ఉద్యమకారులు, సహచర జర్నలిస్టులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. 1965 ఆగస్టు 6వ తేదీన మెదక్ జిల్లా, వరిగుంతం గ్రామంలో జన్మించిన ఆయన అక్కడే పాఠశాల విద్య, అనంతరం మెదక్, హైదరాబాద్‌లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన ఆయన తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎంఎల్‌ఎసిగా కొద్ది కాలమే కొనసాగి, కెసిఆర్ పిలుపు మేరకు పదవీ త్యాగం చేశారు. అనంతరం టిపిఎస్‌సి సభ్యుడిగా ఆరేళ్లపాటు కొనసాగారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
సిఎం రేవంత్ రెడ్డి సంతాపం
మాజీ ఎంఎల్‌సి, సీనియర్ జర్నలిస్ట్ ఆర్.సత్యనారాయణ మృతిపట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారునిగా, ఎంఎల్‌సిగా సత్యనారాయణ చేసిన సేవలు తెలంగాణ సమాజం మరిచిపోలేనివి అని పేర్కొన్నారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులకు సిఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ ఒక నికార్సయిన ఉద్యమకారుణ్ని కోల్పోయింది : కెసిఆర్
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎంఎల్‌సి ఆర్. సత్యనారాయణ మృతి పట్ల బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సంతాపం ప్రకటించారు.తెలంగాణ ఉద్యమంలో సత్యనారాయణ చేసిన కృషిని, ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కెసిఆర్ స్మరించుకున్నారు. సీనియర్ జర్నలిస్టు గా, ఉద్యమకారునిగా సత్యనారాయణ అందించిన సేవలు, బిఆర్‌ఎస్ పార్టీ కోసం ఆయన చేసిన కృషి గొప్పవని పేర్కొన్నారు. సత్యనారాయణ మృతితో తెలంగాణ ఒక నిఖార్సయిన ఉద్యమకారున్ని కోల్పోయిందన్నారు.
ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు : కెటిఆర్
మాజీ ఎంఎల్‌సి ఆర్ సత్యనారాయణ మృతి పట్ల బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సంతాపం ప్రకటించారు. ఒక సీనియర్ జర్నలిస్టుగా, ఉద్యమకారునిగా తెలంగాణ ఉద్యమంలో సత్యనారాయణ చురుకైన పాత్ర పోషించారని, అనేక కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉండి ఉద్యమంలో పాల్గొన్నారన్నారని పేర్కొన్నారు.
సత్యనారాయణ మృతి బాధాకరం : హరీశ్ రావు
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎంఎల్‌సి సత్యనారాయణ మృతి బాధాకరం అని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యనారాయణ జర్నలిస్టుగా, పట్టభద్రుల ఎంఎల్‌సిగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా తనదైన ముద్ర వేశారని అన్నారు.