Saturday, November 23, 2024

స్వచ్ఛ భారత్‌లో మరోసారి తెలంగాణ నెంబర్‌వన్..

- Advertisement -
- Advertisement -

స్వచ్ఛ భారత్‌లో మరోసారి తెలంగాణ నెంబర్‌వన్
త్రీ స్టార్, ఫోర్ స్టార్ విభాగాల్లో మొదటి మూడింట్లో రెండు స్థానాలు తెలంగాణవే…
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2023 అవార్డులను ప్రకటించిన కేంద్రం
అక్టోబర్, డిసెంబర్ క్వార్టర్ వార్డుల్లో టాప్‌గా నిలిచిన రాష్ట్రం
అవార్డులు గెలిచిన జిల్లాలను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
సిఎం కెసిఆర్ చేపట్టిన పల్లె ప్రగతి పథకం వల్లే ఈ అవార్డులు : మంత్రి
హైదరాబాద్: స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడునెలల కోసారి ప్రకటిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డుల్లో మరోసారి తెలంగాణ తన సత్తా చాటింది. రెండు వేర్వేరు విభాగాల్లో మొదటి మూడు స్థానాల్లో రెండు స్థానాలు దక్కించుకొని దేశంలోనే నెంబర్‌వన్‌గా మరోసారి నిలిచింది. 2022 అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికానికి, స్వచ్ఛ భారత్ ఎంపిక చేసిన రెండు విభాగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. స్టార్ త్రీ విభాగంలో తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా, జగిత్యాల జిల్లాలు దేశంలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. మూడో స్థానంలో కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా నిలిచింది. అలాగే స్టార్ ఫోర్ విభాగంలో తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటిస్థానంలో, 2వ స్థానంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లా రాగా, 3వ స్థానాన్ని తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా దక్కించుకుంది.

సిఎం కెసిఆర్ వల్లే ఈ అవార్డులు
కాగా గతంలోనూ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రకటించే ప్రతి అవార్డుల్లోనూ తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో నిలుస్తూనే ఉంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అనేక అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఈ అవార్డులు రావడంలో రాష్ట్ర స్థాయిలో కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారుల నుంచి స్థానికంగా గ్రామ సిబ్బంది వరకు అందరి కృషి ఉందని వాళ్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. వరంగల్ హనుమకొండలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి దయాకర్‌రావు నిధులు ఇవ్వకున్నా, అవార్డులు ఇస్తున్న కేంద్రానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పల్లె ప్రగతి వంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సిఎం కెసిఆర్ వల్లే ఈ అవార్డులు దక్కుతున్నాయని, నిధులు, విధులు ఇచ్చి స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తున్న కెసిఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు.

ముఖరా కె గ్రామం అగ్రగామిగా….
ముఖరా కె గ్రామ సర్పంచ్ మీనాక్షికి జాతీయ అవార్డు రావడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్ఛోడ మండలం ముఖరా కె గ్రామానికి ఆ గ్రామ సర్పంచ్, ఎంపిటిసి, కార్యదర్శి, వార్డు సభ్యులు, సిబ్బంది కృషి, ప్రజల సహకారంతో అవార్డులు రావడం కొత్త కాదన్నారు. దేశంలోనే నెంబర్‌వన్ గ్రామంగా అభివృద్ధిలో నిలిచి ఆదర్శంగా ఆ గ్రామం నిలిచిందని మంత్రి తెలిపారు. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామంగా కూడా అవార్డు గెలవడం అభినందనీయమన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అన్ని అవార్డుల ప్రమాణాల్లోనూ ముఖరా కె గ్రామం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, మార్చి 4వ తేదీన భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలో మీనాక్షి అవార్డును అందుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. ముఖరా కె గ్రామం అన్ని విభాగాల్లో అగ్రగామిగా నిలవడానికి అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు, నిధులు, మార్గదర్శకాలు అందచేస్తున్న సిఎం కెసిఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News