3కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి
రైతుబంధు ద్వారా రూ.50,448కోట్లు
కెసిఆర్ సహకారంతో తెలంగాణ రైతన్నల దరహాసం
మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలు,రైతు సంక్షేమ పథకాలు, పంటల సాగులో సాధించిన ప్రగతి తదితర అంశాలను బుధవారం నాడు మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాకు వివరించారు..గడిచిన ఏడేళ్లలో తెలంగాణలో ప్రాథమిక రంగం (వ్యవసాయం) సగటు వృద్ది రేటు 15.8 శాతంగా నమోదయిందన్నారు. ఇది జాతీయ వృద్ది రేటు 8.5 శాతం కన్నా చాలా ఎక్కువ అని తెలిపారు.దేశంలో 60 లక్షల ఎకరాలలో పత్తి ఉత్పత్తి చేస్తూ నంబర్ వన్ స్థానం నిలిచామన్నారు.ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచిందన్నారు. ధాన్యం సేకరణలో కూడా రెండవ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. 201415 నాటికి రాష్ట్రంలో 24 లక్షల 29 వేల 536 టన్నుల ధాన్యం సేకరణ జరిగేదని, 2021 నాటికి కోటీ 41 లక్షల 8784 మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ రైతుల నుండి సేకరించి ఎఫ్ సీ ఐకిఇవ్వగలిగామని తెలిపారు.
2014 నాటికి సాగు విస్తీర్ణం కోటీ 34 లక్షల ఎకరాలు కాగా, 2021 నాటికి అది 2 కోట్ల 3 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. ఏటా 11.50 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయన్నారు. 2014 నాటికి ధాన్యం ఉత్పత్తి 45 లక్షల టన్నులు మాత్రమే ఉండగా 2021 నాటికి 3 కోట్ల టన్నులకు చేరిందన్నారు.తెలంగాణ ఏర్పడినప్పటి నుండి రూ.97,924 కోట్లతో 556 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగినట్టు వివరించారు.గడిచిన ఏడేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రాష్ట్రప్రభుత్వం రూ.లక్షన్నర కోట్లు ఖర్చుచేసిందని, రూ.83 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందన్నారు.ఏడేళ్లలో రూ. 28,473 కోట్లు వెచ్చించి వ్యవసాయ విద్యుత్ మౌళిక సదుపాయాలు మెరుగుపరచడం జరిగిందని తెలిపారు. ఏటా దాదాపు రూ.10,500 కోట్లు భరిస్తూ రాష్ట్రంలోని 26 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటల ఉచిత కరంటు అందిస్తున్నట్టు తెలిపారు. గత ఎనిమిది విడతలలో రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇప్పటి వరకు రూ.50,448.16 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేశారని తెలిపారు.
కెసిఆర్‌నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష
కెసిఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.ఆయన నాయకత్వంలో రా ష్ట్రం మరింత పురోగమిస్తుందన్నారు. కెసిఆర్ నూ రేళ్లు వర్ధీళ్లాలని కోరుకుంటూ రాష్ట్ర రైతాంగం పక్షాన సిఎం కెసిఆర్‌కు మంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.