క్యాబినేట్ సబ్ కమిటీకి నివేదిక ఇచ్చిన జస్టిస్ షమీమ్ అక్తర్
నివేదికలోని అంశాలనలు అధ్యయనం చేసిన మంత్రివర్గ ఉపసంఘం
జనగణన ప్రకారం ఎస్సీల జనాభా 61,84,319 మంది
సుమారుగా మాదిగలు 35లక్షలు, మాలలు 15 లక్షలు, ఇతర ఉపకులాలు 11లక్షలు
ఇప్పటి వరకు ఎస్సీలకు అమలు అవుతున్నది 15 శాతం రిజర్వేషన్లు
ఎస్సీ జనాభా దామాషాలో దక్కనున్న 17.43 శాతం వాటా
నివేదికపై నేడు క్యాబినేట్‌లో చర్చ, తర్వాత అసెంబ్లీలో ప్రతిపాదించే అవకాశం
మన తెలంగాణ / హైదరాబాద్ ః రాష్ట్రంలో షెడ్యూల్డు కులాలు(ఎస్సీ) వర్గీకరణకు మార్గం సుగమమం అయ్యింది. రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగి ఉన్న మాదిగలు, మాదిగ ఉపకులాలకు విద్యా, ఉద్యోగ, ఆర్ధిక, సామాజిక, రాజకీయరంగాల్లో న్యాయం జరిగేందుకు అవకాశాలున్నాయి. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్‌తో కలిసి సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో తన నివేదికను అందుబాటులో ఉన్న మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ దామోదర రాజనరసింహ, మెంబర్ పొన్నం ప్రభాకర్‌లకు అందజేశారు. నివేదికలోని అంశాలను క్యాబినేట్ సబ్ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఎస్పీ వర్గీకరణ అంశంపై మాల, మాదిగల మధ్య ఉన్న వైరుధ్యం దృష్టా మంత్రివర్గ ఉపసంఘం నివేదికలోని వివరాలను సోమవారం అధికారికంగా వెల్లడించలేదు. ముందుగా ప్రకటించిన మీడియా సమావేశాన్ని కూడా మంత్రివర్గ ఉపసంఘం రద్దుచేసుకుంది.
పెరగనున్న ఎస్సీల కోటా
రాష్ట్రంలోని షెడ్యూల్డుకులాలకు రిజర్వేషన్ల వాటా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం నాడు ప్రకటించిన జనగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ జనాభా 17.43 శాతంతో 61,84,319 మంది వరకు ఉన్నారు. ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్లు 15 శాతంగా అమలు అవుతున్నాయి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా 17.43 శాతం వరకు వారికి కోటా దక్కే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో సుమారుగా మాదిగలు 35లక్షల మంది, మాలలు 15 లక్షల మంది, ఇతర ఎస్సీ ఉపకులాలు 11లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా.
సుప్రీంకోర్టు తీర్పుతో
ఎస్సీ వర్గీకరణ అంశంపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మమైన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రెండు గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పును అమలుచేస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అంతే కాకుండా ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జస్టీస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. కమిషన్ సోమవారం తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది.