Monday, December 23, 2024

విదేశీ విద్య కోసం వెళ్లే వారిలో తెలంగాణ టాప్

- Advertisement -
- Advertisement -

పంజాబ్, మహారాష్ట్రలతో కలిసి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం
ఏటేటా పెరిగిపోతున్న విద్యార్థుల సంఖ్య
2025 నాటికి 20 లక్షలకు చేరుకునే అవకాశం
విదేశీ విద్య కోసం భారతీయులు చేసే ఖర్చు సైతం గణనీయంగా వృద్ధి
కొత్త దేశాలకూ ప్రాధాన్యత ఇస్తున్న భారతీయ విద్యార్థులు
తాజా నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్నత విద్య చదవడం కోసం విద్యార్థులు వెళ్లే రాష్ట్రాల్లో పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్రలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. అలాగే అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలతో పాటుగా విద్యార్థులు ఇప్పుడు కొత్తగా ఎంచుకునే దేశాల్లో జర్మనీ, కిర్గిజ్‌స్థాన్, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలు ఉంటున్నాయని ఓ సంస్థ తాజాగా వెల్లడించిన నివేదికను బట్టి తెలుస్తోంది. శుక్రవారం ఓ గ్లోబల్ ఎడ్యుకేషన్ సదస్సులో ఆవిష్కరించిన ‘ బియాండ్ బెడ్స్ అండ్ బౌండరీస్: ఇండియన్ స్టూడెంట్స్ మొబిలిటీ రిపోర్ట్’లో భారతీయ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి సంబంధించి లోతయిన విశ్లేషణ ఉంది.‘ 2019లో భారత దేశంనుంచి సుమారుగా 10.9 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో తమ విద్యాభ్యాసం కొనసాగించారు. 2022లో ఈ సంఖ్య 7 శాతం పెరిగి 13.4 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం ఉన్న 15 శాతం వృద్ధి ఇలాగఏ కొనసాగించిన పక్షంలో 2025 నాటికి ఈ సంఖ్య సుమారుగా 20 లక్షలకు చేరుకుంటుంది’ అని ఆ నివేదిక పేర్కొంది.

‘విదేశాల్లో విద్య విషయంలో భారతీయులు ఎక్కువగా అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో జర్మనీ, కిర్గిజ్‌స్థాన్, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్‌లాంటి దేశాలకు కూడా వారు ప్రాధాన్యత ఇస్త్తున్నారు’ అని ఆ నివేదిక పేర్కొంది. పైచదువులకు విద్యార్థులు విదేశాలకు వెళ్లే విషయంలో దేశంలో అగ్రస్థానంలో పంజాబ్(12.5 శాతం), ఆంధ్ర/తెలంగాణ(12.5 శాతం), మహారాష్ట్ర(12.5 శాతం)తో అగ్రస్థానంలో ఉండగా గుజరాత్ (8 శాతం), ఢిల్లీ/ఎన్‌సిఆర్(8 శాతం) తమిళనాడు (8 శాతం), కర్నాటక(6 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగతా అన్ని రాష్ట్రాలు కలిపి 33 శాతం ఉన్నాయి. కాగా విదేశాల్లో చదువుల కోసం భారతీయ విద్యార్థులు చేసే ఖర్చు 2025 నాటికి 70 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కూడా ఆ నివేదిక అంచనా వేసింది. 2019లో విదేశాల్లో చదువుల కోసం భారతీయ విద్యార్థులు చేసిన ఖర్చు సుమారుగా 37 బిలియన్ డాలర్లు ఉంది. 2022లో ఈ మొత్తం 9 శాతం పెరిగి 47 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ప్రస్తుతం ఉన్న 14 శాతం వృద్ధి ఇదే విధంగా కొనసాగిన పక్షంలో ఈ మొత్తం 2025 నాటికి ఏకంగా70 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆ నివేదిక అంచనా వేసింది. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే వారికి, అలాగే అలాంటి వారికి సేవలందించే సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు తోడ్పాటునందించే మార్కెటింగ్ సంస్థలయిన యూనివర్సిటీ లివింగ్ అకాడమేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఒన్ స్టెప్ గ్లోబల్ అనే సంస్థలు ఈ నివేదికను రూపొందించాయి. కాగా తాము చదువుకోసం వెళ్లే దేశాల్లో బారతీయులు ఎదుర్కొనే వసతి లేమి లాంటి ఇబ్బందులతో పాటుగా ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు తగిన పరిష్కార మార్గాలను కూడా ఈ నివేదిక వివరంగా పేర్కొంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న వసతి సదుపాయాల ఇబ్బందులను పరిష్కరించడానికిప్రభుత్వాలు సమగ్రమైన వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News