Monday, December 23, 2024

ఆదర్శప్రాయం

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఎంతో ముచ్చటపడి ముద్దుగా, వైభవోపేతంగా కట్టుకుంటున్న సచివాలయ నూతన భవనానికి భారత రాజ్యాంగ పిత బాబా సాహెబ్ బిఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనది, సమున్నతమైనది. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో దళిత జన ఉద్ధారకుడు, అణగారిన సామాజిక వర్గాల చేయూత అయిన మహా చైతన్య మూర్తికి ఇది సరైన నివాళి.

అంబేడ్కర్ పేరును న్యూఢిల్లీలో నిర్మిస్తున్న పార్లమెంటు నూతన భవనానికి పెట్టాలని కేంద్రానికి సూచిస్తూ శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిన వెంటనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ పనిని తానే చేసి చూపించారు. ఒకరికి చెప్పేముందు తాము ఆచరించాలన్న సదాశయాన్ని అమలు పరిచారు. ఇందుకు కెసిఆర్ ఎంతైనా అభినందనీయులు. తెలంగాణ ఉద్యమ సారథి, రాష్ట్ర సాధకుడు అయిన కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఎనిమిదేళ్లుగా మంచి పరిపాలనను అందిస్తున్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ వర్గాల సంక్షేమానికి అనితర ప్రాధాన్యమిస్తున్నారు. ఆర్థిక వృద్ధితో పాటు సామాజిక రంగంలోనూ విశేష, విప్లవాత్మక మార్పులను తీసుకు రాడానికి ఆయన చేస్తున్న కృషి అసాధారణమైనది.

అందుకు చిహ్నంగా సచివాలయ కొత్త భవనానికి అంబేడ్కర్ పేరు బాగా ఒప్పుతుంది.దేశంలో సర్వసమానత్వాన్ని నెలకొల్పి, తరతరాల సామాజిక, ఆర్థిక దోపిడీ కింద నలిగిపోయి దుర్భరమైన వెలికి, అణచివేతకు గురవుతున్న వర్గాలను పైకి తీసుకు రాడానికి ఉద్దేశించి తన మేధస్సును కరిగించి గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదించిన అంబేడ్కర్ విశిష్టతను వివరించనక్కర లేదు. “ఒక రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ, దానిని అమలు చేస్తున్న వారు మంచి వారు కాకపోతే అది చెడ్డదిగానే నిరూపించుకుంటుంది..

ఒక రాజ్యాంగం ఎంత చెడ్డదైనప్పటికీ, దానిని అమలు చేసే వారు మంచి వారైతే అది మంచిదిగానే రుజువు చేసుకుంటుంది” అని అంబేడ్కర్ చెప్పింది ఇప్పుడు ఎంతగా కళ్లకు కడుతున్నదో అందరికీ తెలిసిన విషయమే. హిందుత్వ అజెండాతో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ పరమాశయాలైన సెక్యులరిజాన్ని, ఫెడరల్ ప్రజాస్వామిక నియమాలను, విలువలను ఎనిమిదేళ్లుగా కసిగా కాలరాస్తున్నది. రాష్ట్రాల అధికారాలను హరిస్తున్నది. బిజెపియేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలలో ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొడుతున్నది. ప్రజల తీర్పు మీద తనకు బొత్తిగా గౌరవం లేదని చాటుతున్నది. ఇందువల్లనే బిజెపి ముక్త భారత్‌ను అవతరింపజేయడానికి దేశంలోని ప్రజాస్వామిక శక్తులన్నీ సంఘటితమవుతున్నాయి. “ఒక సమాజం ప్రగతిని అక్కడి స్త్రీలు సాధించిన ప్రగతి స్థాయిని బట్టి అంచనా వేస్తాను” అని ప్రకటించిన అంబేడ్కర్ రాజకీయ నిరంకుశత్వం కంటే సామాజిక రంగంలోని నియంతృత్వం అత్యంత దుర్మార్గమైనదన్నారు.

ప్రపంచ మేధావుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన దేశంలో ప్రత్యామ్నాయ ఆలోచనాపరుడుగా ప్రసిద్ధికెక్కారు. దేశ తొలి న్యాయ శాఖ మంత్రిగా మహిళలకు సమాన హక్కులు కల్పించడానికి చట్టం (హిందూ కోడ్ బిల్లు)తేవాలని తాను చేసిన విశేష కృషి ఫలించకపోడంతో రాజీనామా చేశారు. రాజ్యాంగం 3వ అధికరణ ద్వారా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు పెద్ద దారిని వేశారు. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతామన్న డిమాండ్ ఒక రాష్ట్ర జనాభాలోని అల్పసంఖ్యాకుల నుంచి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర శాసన సభ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా వారికి స్వరాష్ట్రాన్ని ప్రసాదించే అధికారాలను పార్లమెంటుకు కట్టబెట్టారు. ఒకే భాషా రాష్ట్రాన్ని విభజించడాన్ని గట్టిగా సమర్థించారు. ఆ విధంగా తెలంగాణకు అంబేడ్కర్ ఎంతో ఆప్తులు, ఆత్మీయులు.

ఆయన పేరును సచివాలయ భవనానికి పెట్టడం సముచితం. కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని అణగారిన వర్గాలకు పలు రకాల సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ ఆత్మగౌరవ భవనాలను నిర్మించి ఇస్తున్నది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి మొదటి నుంచి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి కృషి చేస్తున్నారు. సంక్షేమంలో వారికి గణనీయమైన వాటా కల్పిస్తున్నారు. దళిత సాధికారతను మరింత పటిష్ఠం చేసి వారు వ్యాపారాలు కూడా చేపట్టే స్థాయికి ఎదగడం కోసం ఎక్కడా లేని రీతిలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తూ సంక్షేమానికి కెసిఆర్ కొత్త నిర్వచనం ఇచ్చారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. రాష్ట్ర పరిపాలన భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని తీసుకున్న నిర్ణయం కేంద్రానికి, మిగతా రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయమైనది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News