Saturday, November 9, 2024

తెలంగాణ గర్వించదగ్గ చిత్రకారుడు

- Advertisement -
- Advertisement -

ఆరు దశాబ్దాలుగా చిత్రకళా రంగంలో అలుపెరుగని కృషి చేసిన గొప్ప చిత్రకారుడు పి. టి. రెడ్డి. మరణించే వరకు కుంచెలను విశ్రాంతి ఈయని తెలంగాణ గర్వించదగిన చిత్రకారుడు. చిత్ర, శిల్పకళలో తన జీవిత సర్వస్వం ధారపోసిన నిత్యకృషీవలు డాయన. నిత్య జీవితంలో తారసపడే అనేక సంఘటనల ఆధారంగా వేసిన చిత్రాలను, గ్రామీణ జీవితానికి అద్దంపట్టే చిత్రాలుగా రూపొందించడం ఆయన ప్రత్యేకత. ఆయనే పాకాల తిరుమల్ రెడ్డి చిత్రకళా రంగంలో పి.టి.రెడ్డిగా చిరపరిచితుడు. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన చిత్రకారుల్లో పి.టి.రెడ్డి ముఖ్యుడు. సుమారు ఏడు దశాబ్దాల క్రితం అమృతా షేర్గిల్, రవీంద్రనాథ్ ఠాగూర్లతో సమానంగా ప్రథమ శ్రేణి చిత్రకారుడుగా గుర్తింపు పొందిన పి.టి.రెడ్డి భారతీయ చిత్రకళారంగంలో ప్రథమశ్రేణి చిత్రకారుడుగానే గుర్తింపు కలిగి ఉన్నాడు.

సుమారు ఐదున్నర దశాబ్దాల కళా జీవితపు వెలుగునీడలలో తనను ప్రభావితం చేసిన అనేక సమకాలీన సంఘటనలకు తన చిత్రాలతో ప్రాణం పోసిన కళాకారుడు. అన్ని తరగతుల ప్రేక్షకుల కళాభిజ్ఞతకు అనుగుణంగా చిత్రాలను, శిల్పాలను సృజించాడు. వాటిలోని మంచి చెడులను, తారతమ్య వివక్షతో వీక్షించి, తెలుగు జీవితానికి అన్వయించే రీతిలో రంగుల మేలు కలయికతో, రమణీయతను, సృజనాత్మకతను సమానంగా మేళవించిన మేటి చిత్రకారుడు పి.టి.రెడ్డి.
ప్రత్యేక తెలంగాణ పోరాటం సుదీర్ఘంగా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన గీసిన చిత్రాలు ప్రశంసనీయమైనవి. 1942లో బొంబాయి సర్.జె.జె స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుంచి చిత్రకళల మొదటిర్యాంకుతో డిప్లొమా పొందాడు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలలోనే కాక ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, జపాన్, పశ్చిమ జర్మనీ తదితర విదేశాల్లో సైతం చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించాడు. తనతో భావ సారూప్యత కలిగిన నాటి యువ చిత్ర కారులు మాజిద్, ఎం.ఏ. భోస్లే, బాప్తిస్టా, ఎం.వి. కులకర్ణిలతో కలిసి ‘ది కాంటెంపరరీ గ్రూప్ ఆఫ్ పైంటర్స్’ అనే సంస్థను కూడా స్థాపించి నిరంతరం చిత్రకళా కార్యక్రమాలను నిర్వహించేవాడు.

పి.టి.రెడ్డి అనేక పదవులు కూడా నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ ఆస్థాన చిత్రకారుడుగా ఆయన చేసిన సేవలు చెప్పుకోదగినవి. ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ విశిష్ట సభ్యునిగా, కార్యదర్శిగా, అధ్యక్షుడిగా అనేక హోదాల్లో పని చేసాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డు లెన్నో అందుకున్నాడు. హైదరాబాదు నారాయణగూడలోని తన నివాసాన్ని ఒక పెద్ద చిత్రకళా ప్రదర్శనా నిలయంగా తీర్చిదిద్దిన కళా దర్శకుడు పి.టి.రెడ్డి. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో ప్రదర్శనలలో పి.టి.రెడ్డి చిత్రాలు చోటు చేసుకున్నాయి. వీటిలో ప్రముఖంగా బకింగ్‌హాం ప్యాలస్, లండన్, న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్, ఎంబసీ ఆఫ్ జి.డి.ఆర్., పార్లమెంట్ హౌస్ ఇంకా ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, నేషనల్ గేలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్, కేంద్ర లలిత కళా అకాడమీ న్యూఢిల్లీ, కర్నాటక, కశ్మీర్, ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీలతో పాటు జె.జె. స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ బొంబా యి, అకాడమి ఆఫ్ ఫైన్ ఆర్ట్ కలకత్తా, హైదరాబాద్ స్టేట్ మ్యూజియం, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ హైదరాబాద్, సాలార్ జంగ్ మ్యూజియం, ఆల్ ఇండియా ఫైన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ న్యూఢిల్లీ, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ బొంబాయి మరికొన్ని యునైటెడ్ కింగ్ డం, అమెరికా, యుగోస్లోవియా, పిలిపీన్స్, ఫ్రాన్స్, స్విట్జ ర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాలలో వివిధ ప్రైవేట్ వ్యక్తుల సేకరణలో కూడా ఆయన చిత్రాలు వున్నాయి.

కళ ప్రజల కోసం అని భావించి, ఎనభై ఏళ్ళ ప్రస్థానంలో అనితర సాధ్యమైన కృషి, పట్టుదలతో తెలుగు చిత్రకళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన అసమాన ప్రతిభాశాలి. 1996, అక్టోబర్ 21న మరణించాడు. పి.టి.రెడ్డి భార్య ప్రముఖ రచయిత్రి పి. యశోదా రెడ్డి. పి.టి.రెడ్డిని 1947లో ప్రేమ వివాహం చేసుకున్న ఆమె, తిరుమల్ రెడ్డి గీసిన అనేక చిత్రాలకు ఆమే స్ఫూర్తి. ఆమె కూడా కళా పిపాసి. ఆమె రకరకాల ఇత్తడి విగ్రహాలను హాబీగా సేకరించేది. పి.టి రెడ్డి సాంగత్యంతో వాటిలోని కళా నైపుణ్యాన్ని, వైభవాన్ని ఆమె గుర్తించగలిగేది. భర్త చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసినపుడు అది విజయవంతం అయ్యేందుకు దోహదపడేది.

రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News