భద్రాద్రి కొత్తగూడెం : సిఎం కెసిఆర్ తన తొమ్మిదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని హెల్త్ హబ్‌గా మార్చారని లోక్ సభలో బిఆర్‌ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య, ఆరోగ్య దినోత్సవం పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం శుభ సూచకమని పేర్కొన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్షంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వాన్ని కేంద్రం మోకాలడ్డుతుందని మండిపడ్డారు.
మోడీ ప్రభుత్వం సహకరించక పోయినా సొంత నిధులతో సిఎం కెసిఆర్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని వివరించారు. వైద్య రంగంలో స్వరాష్ట్రం దేశానికే ఆదర్శమని ప్రశంసించారు. మెరుగైన వైద్య సేవలకు గాను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పలు అవార్డులు, రివార్డులు సాధించిందని గుర్తు చేశారు. కేసిఆర్ కిట్ ద్వారా గర్భిణీ స్త్రీలకు ఎన్నో ప్రయోజనాలు అందుతున్నాయని చెప్పారు. అమ్మ ఒడి పథకం ప్రకార 300 వాహనాలు పనిచేస్తున్నాయని, ఇవి నిత్యం గర్భిణీ స్త్రీలకు సేవలు అందిస్తున్నాయని అభినందించారు.
కిడ్నీ సమస్యలు ఉన్న వారికి ఉచిత డయాసిస్ కేంద్రాలు వరంగా మారాయని ఇందుకోసం ఏటా వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. కంటి వెలుగు పథకం అంధత్వ రహిత తెలంగాణ దిశగా దూసుకుపోతుందని అన్నారు. బస్తీ దవఖానాలు విస్తృతమైన సేవలు అందిస్తున్నాయని, కేసిఆర్ న్యూట్రీషన్ కిట్ ద్వారా పోషకాహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్‌సి, సబ్ సెంటర్లు ఏర్పాటు చేసి వైద్య విభాగాన్ని బలోపేతం చేశామని మరో 1239 నూతన భవనాలు నిర్మాణంలో ఉన్నట్లు ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కేసిఆర్ దార్శినికత వల్ల కారణంగా మారుమూల ఏజెన్సీ విద్యార్ధులకు సైతం మెడికల్ విద్య ఉచితంగా అందుబాటులోకి వచ్చిందని అన్నారు.