Monday, December 23, 2024

ఐఐఐతోనే నెంబర్ 1

- Advertisement -
- Advertisement -

ఇన్నోవేషన్.. ఇన్‌ఫ్రా స్ట్రక్చర్.. ఇన్‌క్లూజివ్‌నెస్
తెలంగాణ ప్రగతి మంత్రం
ఈ త్రీసూత్రం

దేశాభివృద్ధికీ ఇదే సూత్రం

మన పథకాలు కావాలంటూ పొరుగు రాష్ట్రాల్లో ప్రజల ధర్నాలు రాష్ట్ర
ప్రగతికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? తలసారి ఆదాయం జిడిపిలో
గణనీయ పెరుగుదల కాళేశ్వరంతో వ్యవసాయంలో 19శాతానికి పైగా
వృద్ధి ఐటి ఉద్యోగాల కల్పనలో కర్నాటకను అధిగమించాం పెట్టుబడులకు
రాష్ట్రం స్వర్గధామం స్నేహపూరిత వాతావరణం, పారదర్శకమైన ప్రభుత్వ
పాలసీలు, అత్యుత్తమ ఇకో సిస్టం తెలంగాణ సొంతం డిప్లొమాటిక్
ఔట్ రీచ్ కార్యక్రమంలో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్

ఎనిమిదేళ్లలోనే రాష్ట్రం అనితర సాధ్యమైన ప్రగతిని సాధించి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రధానంగా రాష్ట్రం అమలు చేస్తున్న మంత్రతోనే ఇది సాధ్యమైంది. ఫలితంగా దేశంలోనే అనేక సంస్కరణలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది.ప్రపంచ దేశాల్లో భారత్ నంబర్ వన్‌గా నిలవాలంటే ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్‌నెస్ (త్రీ ఐ) సూత్రాలు పాటించాల్సిన అవసరముంది.

                                                                                           మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచం భారత్ వైపు చూస్తోంటే … దేశంలోని రాష్ట్రాలన్ని మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఎనిమిదేళ్లలోనే రాష్ట్రం అనితర సాధ్యమైన ప్రగతిని సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రధానంగా రాష్ట్రం అమలు చేస్తున్న ‘త్రి ఐ’ మంత్రతోనే ఇది సాధ్యమైందన్నారు. ఫలితంగా దేశంలోనే అనేక సంస్కరణలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ నిలుస్తోందన్నారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్న టి…-హబ్‌లో శుక్రవారం జరిగిన డిప్లొమాటిక్ ఔట్‌రీచ్ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ, ప్రపంచ దేశాల్లో భారత్ నంబర్ వన్ గా నిలవాలంటే ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్‌నెస్ (త్రీ ఐ) సూత్రాలు పాటించాల్సిన అవసరముందని ఉద్ఘాటించారు. ఈ సూత్రాన్ని రాష్ట్రం పక్కాగా అమలు చేస్తోందన్నారు. పాలనలోనే అనేక సంస్కరణలను అమలు చేస్తున్నామన్నారు.

ఫలితంగా సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో దూసుకపోతోందన్నారు. దీనిపై బయటకు కొందరు విమర్శలు చేసినప్పటికీ….వారి రాష్ట్రంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజలు కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చే స్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. తెలంగాణ అమలు చేస్తు న్న పథకాలైనా ఇక్కడ అమలు చేయండి.. లేకపోతే మా ప్రాంతాలనైనా తెలంగాణలో కలపాలని బహిరంగంగానే ప్రజలు ప్రకటలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల సరిహద్దులో నిరసనలు కూడా చేస్తున్నారని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. మన రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి ఇంతకన్న నిదర్శనం మరోటి లేదన్నారు. సాధిస్తున్న ప్రగతి తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. 2014 లో రాష్ట్ర జిఎస్‌డిపి రూ.5.6 లక్షల కోట్లుగా ఉండేదన్నారు.

ప్రస్తుతం(2022) రాష్ట్ర జిఎస్‌డిపి రూ.11.55 లక్షల కోట్లకు చేరిందన్నారు. దేశంలోనే అతిపిన్న రాష్ట్రమైన తెలంగాణ అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతుండడం మనందరికి గర్వకారణమన్నారు. వ్యవసాయ రంగం, ఐటి, పారిశ్రామిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కాళేశ్వరం నిర్మాణంతో వ్యవసాయంలో గణనీయమని ప్రగతి సాధించామన్నారు. ఇందులో 19 శాతానికిపైగా వృద్ధిరేటును సాధించామన్నారు. ఇక ఐటి రంగంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని చూసి ఇతర రాష్ట్రాలు ఆశ్చర్యం చెందుతున్నాయన్నారు. ఐటి ఎగుమతుల్లోనూ, ఉద్యోగాల కల్పనలోనే దేశం కంటే మన రాష్ట్రమే మిన్నగా ఉందని ఈ సందర్భంగా కెటిఆర్ వివరించారు. ఐటి ఉద్యోగాల్లో ఇటీవలే కర్నాటక రాష్ట్రాన్ని అధిగమించి తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలా ఒకటేంటి….చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో తెలంగాణ అధ్భుతమైన అభివృద్ధిని సాధిస్తోందన్నారు.

ఒకప్పుడు అభివృద్ధిలో గుజరాత్, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల పేర్లు ప్రధానంగా వినిపించేవన్నారు. కానీ ఇప్పుడు అభివృద్ధి అని పేరు చెబితే….. ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది తెలంగాణే అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. కొంత కాలంగా ఆయిల్‌ఫామ్‌లో వెనుకబడిన మన రాష్ట్రం ప్రస్తుతం 20 లక్షల ఎకరాల్లో సాగు చేస్తోందని వెల్లడించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల, సంక్షేమ పథకాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించిందన్నారు. మన రాష్ట్రం ఖర్చు చేసిన విధంగా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంతపెద్దమొత్తంలో సంక్షేమ పథకాలపై ఖర్చు చేస్తున్న దాఖలాలు లేవన్నారు. ఒకవైపు సంక్షేమం….మరోవైపు పురోగతి సాధించడం అనే అంశాలను ప్రభుత్వం రెండు కళ్లుగా పెట్టుకుని పనిచేస్తోందన్నారు. అందుకే తెలంగాణలో అవి రెండు జోడెద్దుల్లా పరుగులు పెడుతున్నాయని కెటిఆర్ వివరించారు.

దేశంలో సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కూడా అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో రాష్ట్రం ఎప్పుడు ముందుంటోందన్నారు. దీని కారణంగానే అనేక రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ , బయోసైన్స్‌లో ప్రధాన హబ్‌గా తెలంగాణ కొనసాగుతోందన్నారు. దీని కారణంగానే మన రాష్ట్రం ఏరోస్పేస్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే హెలికాప్టర్ విడిభాగాలు కూడా మన హైదరాబా నుంచే తయారవుతున్నాయని కెటిఆర్ వెల్లడించారు. ఫలితంగా 15 వందలకుపైగా మల్టీనేషన్ కంపెనీలు ప్రస్తుతం హైదరాబాద్‌లో కొలువుదీరాయన్నారు. ఇందులో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి కంపెనీలు కూడా ఉన్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింతగా దూసుకపోతామని ఈ సందర్భంగా కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు.

పెట్టుబడులను రప్పించడమే లక్షంగా….
అంతకుముందు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి కెటిఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 50 దేశాలకు చెందిన రాయబారులు, డిప్లమాట్స్, కాన్సుల్ జనరల్స్, గౌరవ కాన్సుల్ జనరల్స్, హై కమిషనర్లు, ట్రేడ్ కమిషనర్లు హాజరయ్యారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంపై ఈ సమావేశంలో మంత్రి సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక పాలసీతో పాటు వివిధ రంగాల్లో ఉన్న ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన పలు కంపెనీలకు గత 8 ఏళ్లుగా తెలంగాణ గమ్యస్థానంగా మారడం, ఆయా కంపెనీలు విజయవంతంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న తీరును వివరించారు. స్నేహపూర్వక వాతావరణం, పారదర్శకమైన ప్రభుత్వ పాలసీలతో పాటు దేశంలోనే అత్యుత్తమ ఇకో సిస్టం తెలంగాణ సొంతమని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, ప్రోత్సాహకాలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లోని ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలు తెలంగాణని తమ గమ్యస్థానంగా ఎంచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్ర పెట్టుబడుల సలహాదారు (టిఐఎ)పేరుతో రూపొందించిన వర్చువల్ మస్కట్, చాట్ బొట్‌ను ఆయన ఆవిష్కరించారు. మంత్రి కెటిఆర్ ప్రజెంటేషన్ తర్వాత పలు దేశాలకు చెందిన ప్రతినిధులు వివిధ అంశాలపైన తమ అభిప్రాయాలను తెలియచేశారు. ఆ తరువాత దౌత్యవేత్తలు, దౌత్యాధికారులు టి…హబ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న వివిధ స్టార్టప్ ప్రతినిధులతో సంభాషించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వి..హబ్, టి…వర్క్, టిఎస్‌ఐసి, టాస్క్ సంస్థల లక్ష్యాలు, పనితీరును దౌత్యవేత్తలు ప్రశంసించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక సెక్రెటరీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, టి హబ్ సిఇఒ ఎం శ్రీనివాస్ రావు, పరిశ్రమల శాఖ, ఐటి శాఖకు చెందిన వివిధ విభాగాల డైరెక్టర్లు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News