Monday, January 27, 2025

అసెంబ్లీ సమావేశాలు: సీఎం రేవంత్ రెడ్డి vs హరీష్‌రావు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ప్రవేశ పెట్టి శ్వేత పత్రంపై బుధవారం చర్చ వాడీవేడిగా సాగింది. తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాళేశ్వరంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. కొత్త సిఎంకు విషయం అర్థం కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకున్న అప్పు కేవలం కాళేశ్వరం కోసమే ఖర్చు చేయలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు కూడా ఖర్చు చేశామన్నారు. మీ విజ్ఞతను వినియోగించి సంపదను సమకూర్చుకోండి, కానీ, మా మీద నెపం నెట్టి తప్పించుకోకండి అంటూ హరీష్‌రావు సూచించారు. రాష్ట్ర పరపతిని దిగజార్చకండి. రాష్ట్ర భవిష్యత్‌నును అంధకారం చేయకండి అంటూ హరీష్‌రావు హితవుపలికారు.

హరీష్‌రావు సీనియర్ సభ్యుడు…
దీనిపై సిఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ హరీశ్‌రావు ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్ సభ్యుడని ఫస్ట్ టర్ములోనే హరీశ్‌రావు సాగునీటి మంత్రిగా పని చేశారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తొమ్మిదిన్నర ఏళ్లుగా సాగునీటి శాఖ కెసిఆర్ కుటుంబం చేతిలోనే ఉందన్నారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు లెక్కలపై సంపూర్ణ సమాచారం ఉంటుందని, అంచనాలు రూ.80 వేల కోట్లు అయితే లక్ష కోట్లు అవినీతి జరిగింది ఎలా అయ్యిందని హరీశ్ రావు ప్రశ్నిస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు.

ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.97,449 కోట్లు మంజూరైతే అందులో రుణంగా రూ. 79,287 కోట్లు విడుదలైందన్నారు. ఇంకా చెల్లించాల్సింది రూ. 74,590 కోట్లు అని సిఎం రేవంత్ అన్నారు. ఈ అప్పులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను బడ్జెట్ నుంచి కేటాయించిందని, ఆ లెక్కలను శ్వేతపత్రంలో పేర్కొనలేదన్నారు. వాటిని కూడా త్వరలో సభకు ఇస్తామన్నారు. అంతా కలిపి లక్ష కోట్లు దాటిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారు, ఎన్ని రుణాలు తీసుకొచ్చారో వివరాలను వెలికితీస్తామని రేవంత్ పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి అంచనాలు అడుగుతాం…
కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి అంచనాలు ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులను అడుగుతానని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి చేసిన ఖర్చును కూడా వెల్లడిస్తామన్నారు. అంచనా వ్యయం రూ. 80 వేల కోట్లు కాదు. అప్పులే రూ. 97,449 కోట్లు తీసుకుంటే దాని వ్యయం అంచనా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని సిఎం రేవంత్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీరు రైతులకు, పరిశ్రమలకు అందుతాయన్నారు. ఏటా రూ. 5,199 కోట్లు ఆదాయం వస్తుందని నివేదికలో పేర్కొందని, వీటికి నీళ్లు అమ్ముతామని చెప్పింది. మొత్తం వ్యాపారం చేస్తామని చెప్పింది. దీనిని చెప్పే అప్పులు చేసిందని సిఎం రేవంత్ ఆరోపించారు.

తప్పుడు నివేదికలు ఇచ్చి రుణం తీసుకొని….
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా నీళ్లు ఇస్తున్నామని చెప్పిన ప్రభుత్వం 2014కు ముందు గ్రామాల్లో నీళ్లు తాగలేదన్నట్లు చెబుతోందని సిఎం రేవంత్ ఆరోపించారు. శివుడి తలమీద గంగను భూమి మీదకు తెచ్చి కాళేశ్వరం ద్వారా పంపిణీ చేసి అద్భుతం చేసి జీవితాలను ధన్యం చేసినట్లు, రోల్ మోడల్ రాష్ట్రం అని గొప్పగా చెప్పుకుంటుందని సిఎం ఎద్దేవా చేశారు. సభను మిస్ లీడ్ చేసేలా హరీశ్‌రావు వ్యవహారిస్తున్నారన్నారు. భగీరథ ద్వారా 2019, 20 సంవత్సరంలో గ్రామ పంచాయతీల నుంచి రూ.1,030 కోట్లు, మున్సిపల్ కార్పొరేషన్ల ద్వారా రూ.159 కోట్లు, మున్సిపాలిటీల నుంచి రూ. 369 కోట్లు, పరిశ్రమల నుంచి రూ. 4,145 కోట్లు మొత్తం రూ.5,706 కోట్లు ప్రతి సంవత్సరం ఈ ప్రాజెక్టు ద్వారా ఆదాయం వస్తుందని చెప్పి అప్పులు తీసుకునేటప్పుడు బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చి రుణం తీసుకుందని సిఎం ఆరోపించారు.

ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకొచ్చి…
నిజంగానే ప్రజల నుంచి వసూలు చేసి సాగు, తాగునీటిని వ్యాపారంగా మార్చి ప్రజల సెంటిమెంట్‌ను వాడుకుందా? మొత్తం రూ. 10,905 కోట్లను ప్రజలను ముక్కు పిండి వసూలు చేస్తామని అడ్డగోలుగా అప్పులు తెచ్చింది. ఈ అప్పులకు సంతకాలు చేసిందెవరు? 2015, 16 కాగ్ నివేదికలో ఆఫ్ బడ్జెట్ అప్పులను ఆదాయంగా చూపించి మొత్తం బ్యాంకులను, ప్రభుత్వాన్ని తప్పు పట్టించినట్లు ఉందని సిఎం రేవంత్ ఆరోపించారు.

ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థిక సంస్థలను తప్పుదోవ పట్టించి ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకొచ్చి అప్పుల కుప్పగా మార్చిందని సిఎం అన్నారు. 2018, 19లో బడ్జెట్ తయారీలోనే లోపభూయిష్టంగా ఉందని, విధానాన్ని మార్చుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అక్షింతలు వేసిందన్నారు. ఇవన్నీ వాస్తవాలు. అబద్ధాలతో సభను, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం హరీశ్‌రావు చేస్తున్నారని సిఎం ఫైర్ అయ్యారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రవేశపెడితే శాసన వ్యవహారాల మంత్రి ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నానని సిఎం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News