మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31వ తేదీ వరకు (8) రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన బిఏసి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌లు, బిఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి టి.హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, బిజెపి నుంచి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బలాలలు హాజరయ్యారు. ఈ సమావేశాలను ఎనిమిది రోజుల పాటు ఈ నెలాఖరు వరకు నిర్వహించాలని నిర్ణయించారు.
బుధవారం రైతు రుణమాఫీపై చర్చ, 25వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు ఉదయమే బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అనంతరం డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి భట్టి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. ఆదివారం మాత్రం సభకు సెలవు దినంగా ప్రకటించారు. 31వ తేదీన బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం తెలుపనుంది. కాగా, ఈ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ బిల్లును కూడా తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే జాబ్ క్యాలండర్, రైతు భరోసా విధి, విధానాలు, రేషన్ కార్డు విధి, విధానాలపై శాసనసభలో ప్రకటించే చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.