Monday, December 23, 2024

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. మొదట మాజీ ఎంఎల్‌ఎ లాస్య నందితకు అసెంబ్లీ సంతాపం తెలపనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఆమె ప్రమాదంలో మృతి చెందారు. లాస్య నందితకు సంతాపం తెలిపే తీర్మానాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. సంతాపం అనంతరం అసెంబ్లీని వాయిదా వేయనున్నారు. అనంతరం సభా వ్యవహారాల సలహా సంఘం భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాల పనిదినాలు, అజెండాను ఖరారు చేయనున్నారు.

అసెంబ్లీకి కెసిఆర్…!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీ ప్రవేశపెట్టే రోజున అసెంబ్లీకి కెసిఆర్ వస్తారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. బడ్జెట్ సమావేశంలో పాల్గొనాలని కెసిఆర్ నిర్ణయించారని తెలిసింది. ఇదే జరిగితే ప్రతిపక్ష నేతగా మొట్టమొదటి సారిగా అసెంబ్లీ సమా శాలకు కెసిఆర్ హాజరు అయినట్లు అవుతుంది.

పోలీసుల మూడంచెల భద్రత
మూడంచెల భద్రతతో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. మంగళవారం నుంచి శాసనసభ సమావేశాలు మొదలవుతుండగా, బుధవారం నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా పోలీస్ శాఖ పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది. సమావేశాలు జరిగేటప్పుడు వివిధ వర్గాలు ఆందోళనలు చేసే అవకాశం ఉండటంతో గన్‌పార్క్ వద్ద, అసెంబ్లీ ప్రవేశ ద్వారాల వద్ద, అసెంబ్లీ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సివిల్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తారు. పాస్‌లు లేకుండా ఎవరినీ అనుమతించేది లేదని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. పాస్‌లు ఉన్నా కూడా తనిఖీలు నిర్వహించిన తర్వాతే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఇస్తారని అధికారులు వెల్లడించారు.

ఆగస్టు 2 వరకు సమావేశాలు!
ఈ సమావేశంలో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చ చేపట్టాలి? తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. వచ్చే నెల రెండో తేదీ వరకు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ సమావేశాలు ఎప్పటి వరకు జరుగుతాయన్నది మంగళవారం బిఎసి సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకున్న తర్వాత వెల్లడించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News