మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ మండలి సమావేశాలకు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు జరపనుండగా దానికి గల సాంకేతిక సమస్యలు గవర్నర్ ప్రోరోగ్ తో సమసిపోయాయి. ఈ దఫా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలు కావాలంటే గతంలో వాయిదా పడిన సభలను ప్రోరోగ్ చేయాల్సి ఉంటుంది. అయితే గత డిసెంబర్ లో ఇరు సభలు వాయిదా పడగా వాటిని ప్రోరోగ్ చేయడంతో కొత్త సమావేశాలు జరుపుకునేందుకు వీలు కలిగింది.
ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసన సభ, శాసన మండలి సమావేశాలను ప్రోరోగ్ చేస్తున్నట్టు ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా వచ్చే వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నట్టు సమాచారం. సభలు ప్రోరోగ్ కావడంతో బడ్జెట్ పనులను ప్రభుత్వం మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల అనంతరం బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోద ముద్ర వేయడం కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడాఆ నిర్వహించే అవకాశాలున్నాయి.