Wednesday, January 22, 2025

మళ్లీ కెసిఆర్‌కే పట్టం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం కోసం నాలుగు కోట్ల మంది ఆకాంక్షలను నెరవేర్చేందుకు కెసిఆర్ ప్రారంభించిన ఉద్య మం 13 సంవత్సరాల పాటు ఉవ్వెత్తున ఎగసిపడింది. విద్యార్థులు, యువత, మహిళలు, సబ్బండవర్గాల పోరాట ఫలితంగా ఇరువై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. భారత దేశ చరిత్రలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక అద్భుతంగా పేర్కొనవచ్చు. వాజపేయీ హయాంలో ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల మాదిరిగా తెలంగాణ రాష్ట్రం సునాయాసంగా ఏర్పడలేదు. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం గాంధేయ మార్గంలో ఒక్క రుధిరపు బొట్టు కూడా చిందకుండా సాకారం కావడం గొప్ప విశేషం. కెసిఆర్ నాయకత్వంతో పాటు, పట్టుదల, రాజకీయ చాణక్యం, రాజనీతిజ్ఞత, అందరినీ కలుపుకొనిపోవాలనే విశాల హృదయం, కేంద్రంలోని వివిధ పార్టీలను అనేక సార్లు కలిసి వారిని ఒప్పించి మద్దతు సాధించిన ఘనత కెసిఆర్‌దే. అపారమైన భాషా జ్ఞానం, అన్నింటిని మించి సంకల్ప బలం, అనేక నిందలతో, వందలాది మంది యువకుల బలి దానాలతో తెలంగాణ ఏర్పాటును అంగీకరించక తప్పని పరిస్థితిని తెచ్చిపెట్టారు.

సాధించుకున్న తెలంగాణలో కరెంట్ కోతలు లేవు, తాగునీటి కటకట లేదు, ఎరువుల కోసం పడిగాపులు లేవు, విత్తనాల కోసం విలవిలలు లేవు, పెట్టుబడులకు స్వర్గధామంగా జనజీవనం ప్రశాంతంగా సాగుతున్నది.ప్రతి కుటుంబం ఫలాలను అందుకున్నారు. ఆంధ్ర అధిపత్యవాదులు తెలంగాణ మీద ఇంకా ఆశలు వదులుకోలేదు. బహురూపుల వేషాలతో తెలంగాణలో తమ ఉనికిని చాటుకునేందుకు విఫలయత్నం చేస్తున్నారు. నాడు మహాకూటమి పేరుతో చంద్రబాబు ప్రయత్నిస్తే, కాంగ్రెస్ మోచెయ్యి నీళ్లు తాగేందుకు ఇప్పుడు షర్మిళ, బిజెపికి దోచిపెట్టేందుకు పవన్ కళ్యాణ్ పాగావేయాలని కుట్రలు పన్నుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కొనసాగించిన తెలంగాణ ప్రజల చైతన్య స్ఫూర్తిని మరో మారు కొనసాగించడం తప్పేటట్టులేదు. తెలంగాణ రాష్ట్రం 90 % బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలతో కూడుకున్న సమాజం. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఇక్కడి ప్రజల్లోని చైతన్యానికి ప్రతీక. తెలంగాణ సమాజాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని, సమయ సందర్భాలను బట్టి ఉద్యమాన్ని నడిపించడంలో కెసిఆర్ ఏ విధంగా విజయ తీరాన్ని ముద్దాడినారో తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో కూడా అదే విధంగా ప్రజల హృదయాలను చూరగొన్నారు.

ప్రజల అవసరాలు తీర్చడంలో విజయం సాధించారు. ప్రజలు కెసిఆర్‌ను సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణపై చెదలుపట్టిన ఫ్యూడల్ భావజాలాన్ని కెసిఆర్ పాలనపై అడుగడుగునా రుద్దడానికి ప్రయత్నం చేశారు. కెసిఆర్ రాజనీతిజ్ఞత, సుదీర్ఘమైన పాలన అనుభవం ముందు కుట్రలు, కుతంత్రాలు మోకరిల్లక తప్పలేదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అహరహం దశాబ్దం పాటు చేస్తున్న అభివృద్ధిపై అధికారానికి దూరం ఉన్న శక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నానాయాగీ చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడేసరికి విశృంఖలంగా విరుచుకుపడుతున్నారు. కెసిఆర్‌పై చాలదన్నట్టుగా అయన కుటుంబంపైన చవకబారు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అబద్ధాలకు ఆజ్యంపోసి మేధావులను సైతం నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కెసిఆర్ పైన ఎవరెన్ని విమర్శలు చేసినా 2014 ఎన్నికల్లో ఉద్యమ పార్టీకి పట్టం కట్టినారు. పాలనా రంగంలో తెచ్చిన అనేక సంస్కరణల ఫలితంగా 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ విజయ దుందుభి మోగించింది. కెసిఆర్ కలలు కన్న బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి ఆగకుండా నిర్విరామంగా కొనసాగాలంటే 2023 ఎన్నికల్లో మళ్ళీ కెసిఆర్‌కే పట్టం కట్టాలి. బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇందులో ఇసుమంతైనా అనుమానం అవసరం లేదు.

దశాబ్ద కాలంగా గుండె గుండెకు పరిమళాలు పంచుతూ, ప్రగతి ఫలాలను ప్రతి ఒక్కరికీ అందిస్తూ తిరుగులేని ప్రజాభిమానంతో దూసుకుపోతున్నది కెసిఆర్ ప్రభుత్వం. నాడు ఉద్యమాన్ని విజయ తీరం చేర్చిన నాయకుడుగా, నేడు స్వరాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న పరిపాలనాదక్షకుడిగా కెసిఆర్ స్థానం చరిత్రలో సుస్థిరం. అనేక ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్ర ప్రస్థానం ప్రారంభమైంది. ఒక సంక్లిష్ట సందర్భంలో కెసిఆర్ పరిపాలనా పగ్గాలు అందుకున్నారు. అగమ్యగోచరంగా, అస్తవ్యస్తంగా వున్న స్థితి నుండి మొదలై, సునిశితంగా సమస్యలను అవగాహన చేసుకుంటూ, చాకచక్యంగా చిక్కుముడులు విప్పుకుంటూ, ప్రతిపక్షాల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ వెనుదిరుగకుండా వ్యవస్థలను గాడిలోపెట్టి సబ్బండ వర్గాల సంక్షే మం, 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా, రైతురుణ మాఫీ చేసి రైతురాజ్యం కోసం నిర్మించి గాంధేయ మార్గంలో సృజనాత్మక పాలన సాగిస్తూ ప్రపంచ దేశాల మన్ననలు పొందుతున్నారు.

తొమ్మిది ఏండ్ల తర్వాత కూడా బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఆదరణ, కెసిఆర్ పట్ల సానుకూల వాతావరణం ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయంగా ఆశావహ దృక్పథం ప్రజలలో కనిపిస్తున్నది. ఉద్యమానంతరం జరిగిన పార్టీ బలోపేతం అవసరమని భావించడం మూలాన అందరికీ అవకాశాలు రాలేదు. అయ్యో ఇందుకోసమేనా ఉద్యమించిందని సణగడం సర్వసాధారణం. అందరినీ సంతృప్తి పర్చడం ఏ పాలకుడుకీ సాధ్యం కాదు. అయినా తొమ్మిదేండ్ల కాలంలో విశ్వసనీయత కోల్పోకుండా నమ్ముకొని ఉన్నవారిని గట్టెక్కించి కెసిఆర్ అధిగమించారనే చెప్పాలి. అంటే విమర్శలు లేనేలేవని కాదు. మెజారిటీ తెలంగాణ సమాజం కెసిఆర్‌కే నీరాజనాలు పట్టుతున్నారనేది మాత్రం అక్షరసత్యం.

సంగని మల్లేశ్వర్- 9866255355

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News