Wednesday, January 22, 2025

దార్శనికుడు, పాలనాదక్షుడు..

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదల అయింది. ముఖ్యమంత్రి కెసిఆర్ బిఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను ఎంతో ముందు గా ప్రకటించడమే కాకుండా, స్వయంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. మరో వైపు తప్పనిసరి తద్దినం అన్నట్టుగా ప్రతిపక్షాలు కూడా తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే పనిలో ఉన్నా యి. జాతీయ నాయకులను రంగంలోకి దింపి మొక్కుబడిగా ప్రచారం సాగిస్తున్నాయి. కెసిఆర్ ప్రచారానికి, ప్రతిపక్షాల ఆర్భాటానికి తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. కెసిఆర్ పారిపాలనా సరళిలో, ప్రచారం తీరులో ఎంతో స్పష్టత ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రచారంలో డొల్లతనం కనిపిస్తున్నది. ఇటీవలి ఎన్నికల హామీలు ఇందుకు ఒక ఉదాహరణ. తెలంగాణ సమాజం పట్ల, అవసరాల పట్ల ప్రతిపక్షాలకు అవగాహన లేకపోవడమే ప్రతిపక్షాల భావ దారిద్య్రానికి కారణం. బిజెపి, కాంగ్రెస్‌లకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి? ప్రజల అవసరాలు ఏమిటి? ఏ పథకం ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచనే రాదు. ఏదో కెసిఆర్ ఇస్తున్నాడు కనుక మనం కూడా కొన్ని పథకాలు ఏకరువు పెడదాం అనేదే వారి ధోరణి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన కొన్ని హామీలు హాస్యాస్పదంగా ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు ఇంకా బ్రెడ్ అండ్ బట్టర్ ఇష్యూస్ దగ్గరే ఇంకా నిలిచిపోయాయి. వాస్తవానికి కెసిఆర్ తెలంగాణ ప్రజల ఆకలి దప్పులను ఇప్పటికే తీర్చివేశారు.తెలంగాణ ఆ దుస్థితిని ఎప్పుడో అధిగమించింది.ఇప్పుడు కెసిఆర్ ఆలోచనలు తెలంగాణను ఇంతకు మించి ఏవిధంగా అభివృద్ధి చేయాలనే స్థాయి లో ఉన్నాయి. కెసిఆర్ ఆలోచనలు ఎన్నికల కోసమే పరిమితం అయ్యేవి కాదు. అదే కెసిఆర్‌కు ఇతర పార్టీల నాయకులకు తేడా. అందుకే కాంగ్రెస్, బిజెపిలకు చెందిన రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు ఎవరూ కెసిఆర్‌కు సరితూగలేరు. కాంగ్రెస్, బిజెపి నాయకులు ఆయనకు ఎదురు నిలువ లేరు. దీనికి కారణం కెసిఆర్ ఎన్నికల రాజకీయం చుట్టూ తిరుగుతూ ఉండరు. విస్తృతంగా ప్రజాసంక్షేమం కోసం ఆలోచిస్తుంటారు. తెలంగాణ వికాసం కోసం దృష్టి పెడతారు. అది ఇతర పార్టీల నాయకులకు చేత కాదు.

కెసిఆర్ ఒక విజనరీ. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందడమనేది ఆయన స్వప్నం. ఆయన అహర్నిశలు తెలంగాణ సమాజం కోసం తపిస్తూ ఉంటారు. తెలంగాణ ప్రజల కష్టాలు ఏమిటి? వాటిని ఏవిధంగా తొలగించవచ్చు అనేది నిరంతరం అధ్యయనం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలు తిన్నారో లేదో వారి అవసరాలు ఏమిటో అని ఏ విధంగా ఎప్పుడూ ఆలోచిస్తుంటారో, కెసిఆర్ అదే విధంగా తెలంగాణ ప్రజల కోసం మధనపడుతూ ఉంటారు. ఆయన అంతర్మథనం నుంచే అనేక ఆలోచనలు, పథకాలు ఉద్భవిస్తూ ఉంటాయి. తెలంగాణ సమగ్ర దర్శనంలో భాగంగా ఆయనకు అనేక వ్యూహాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. ఆ అభివృద్ధి వ్యూహాలలో భాగంగానే దార్శనికుడైన కెసిఆర్ అనేక పథకాలకు రూపకల్పన చేస్తుంటారు. మనకు కెసిఆర్ ఎన్నికల మానిఫెస్టో కనిపిస్తుంది. కెసిఆర్ చెప్పే కొన్ని హామీలు కనిపిస్తాయి. కానీ వాటి వెనుక కెసిఆర్ సమగ్ర అభివృద్ధి వ్యూహాలు ఉన్నాయనే గొప్ప విషయం చాలామందికి తెలియనిది. కెసిఆర్ అభివృద్ధి వ్యూహంలో ఎన్నికల హామీలు చాలా స్వల్పమైనవి.

ప్రజాస్వామ్యంలో తాను చేయబోయేది ప్రజలకు చెబుతూ ఉండాలి కనుక ఆ సంస్కారం కొద్దీ ఆయన ఎన్నికల హామీలు ప్రకటిస్తూ ఉంటారు. అంతేకాని ఆయన పరిపాలన, ఆలోచన ఎన్నికల హామీలకే పరిమితం కాదు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని అనేక పథకాలను కెసిఆర్ తన పరిపాలనా క్రమంగా అమలు చేయడాన్ని మనం గమనించవచ్చు. కెసిఆర్ గత ఎన్నికల మేనిఫెస్టోలలో పేర్కొనని పథకాలను కూడా ఆ తరువాత కాలంలో ప్రవేశపెట్టారు. ఉదాహరణకు రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి-, షాదీముబారక్, కెసిఆర్ కిట్, బతుకమ్మ చీరలు, దళిత బంధు, బిసి బంధు మొదలైనవేవీ ఎన్నికల హామీలు కాదు. ఇటీవల ఎరుకల సాధికారత పథకంగా పందుల పెంపకం ప్రకటించారు. ఆయా సామాజిక వర్గాల అవసరాన్ని గుర్తించి ప్రకటించే పథకాలు ఇవి. వీటికి ఎన్నికలకు సంబంధం లేదు.

హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పెట్టడం కూడా వారు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతోనే. ఇదే విధంగా హాస్టల్ పిల్లలకు ఎంత తింటే అంత పెట్టాలని జోకి పెట్టకూడదని ఆదేశించారు. ఇది కెసిఆర్ మానవీయ ఆలోచనలకు ప్రతిబింబం. ఇటువంటివి ఎన్నికల హామీలు కానవసరం లేదు. ఎరువులు, విత్తనాలు సకాలంలో సమృద్ధిగా సరఫరా చేయాలనే ఆలోచన రైతన్న మీద ఉన్న ఆప్యాయత కొద్ది కెసిఆర్‌కు వచ్చింది. ఇది కాంగ్రెస్ నాయకులకు రాదు. వారికి తమ బొజ్జ నింపుకోవడమే కావాలె. కరోనా కాలంలో వడ్లు కొనాలనే ఆలోచన కెసిఆర్ వంటి నాయకులకే వస్తుంది. ఇవన్నీ సమాజ హితవు కోరుకునే ఏ పాలకుడైనా చేయవలసిన కనీస ధర్మాలు. కెసిఆర్ ధర్మనిరతి గల పాలకుడు కనుక ఆయన ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు.
కెసిఆర్ ఈ నెల 15న హుస్నాబాద్‌లో బిఆర్‌ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో ఇంటింటికీ బీమా,- కెసిఆర్ బీమా కొత్తది. దీని వల్ల బిపిఎల్ కుటుంబాలకు రూ. ఐదు లక్షల బీమా వర్తిస్తుంది.

అన్నపూర్ణ పథకం ద్వారా పిడిఎస్ మార్గంగా సూపర్ ఫైన్ రైస్ సరఫరా చేయాలని భావిస్తున్నారు. క్రమపద్ధతిలో ఆసరా పింఛను నెలకు రూ. ఐదు వేలకు పెంచాలని నిర్ణయించారు. రైతుబంధు పదహారు వేలకు పెంచుతున్నారు. ఆరోగ్య బీమా పరిమితిని రూ. ఐదు లక్షల నుంచి రూ. పదిహేను లక్షలకు పెంచుతున్నారు. పేద మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా నెలకు మూడు వేలు అందించాలని భావిస్తున్నారు. గ్యాస్ సిలిండర్‌ను పేదలకు రూ. 4 వందలకే ఇస్తామని ప్రకటించారు.అగ్రవర్ణ పేదల పిల్లల కోసం నియోజక వర్గానికి ఒక గురుకులం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మైనారిటీ గురుకులాలను డిగ్రీ కళాశాలలుగా ఉన్నతీకరిస్తామని కూడా కెసిఆర్ ప్రకటించారు. ఇవన్నీ ఎన్నికల గెలుపు కోసం హడావుడిగా రూపొందించిన పథకాలు కావు. ఈ ఏడాది ఎన్నికలు లేకున్నా కెసిఆర్ వాటిని ప్రకటించేవారే. ప్రతి ఏటా సమాజ ఎదుగుదలను, అవసరాలను సమీక్షిస్తూ, ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ కెసిఆర్ ఆయా పథకాలను ప్రవేశపెడుతూ ఉంటారు.

వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధి, ప్రజల సంక్షేమంఅన్ని ఆయన దృష్టిలో ఉంటాయి. ఒకరు అడగవలసిన అవసరం కూడా లేదు. కెసిఆర్ అనేక పథకాలను ఎవరూ అడగకుండానే ప్రవేశపెట్టారు. మనం కెసిఆర్ దార్శనికతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ దార్శనిక నాయకుడు ఒక పద్ధతి ప్రకారం సమాజాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపించుకుపోతున్నారనేది అర్థం చేసుకోవాలి. ఆడబిడ్డ తెల్లారగానే బిందె పట్టుకొనిపోయే కష్టం ఉండకూడదు. ఆదిలాబాద్‌లో గిరిజనులు కలుషిత జలాలు తాగి రోగాల పాలు కాకూడదు. నల్లగొండ బిడ్డలు ఫ్లోరోసిస్ బారిన పడకూడదు. ఇటువంటి ఆలోచనలతో ఇంటింటికీ నీళ్ళు వస్తున్నాయి. ఇదే విధంగా చెరువులు నిండాయి. గోదావరి జలాలు బీడులను పచ్చని పొలాలుగా మార్చాయి. అణగారిన ప్రజల బాధలు తీరాయి. వారి పిల్లలు గురుకులాలలో కార్పొరేట్ స్థాయి విద్య పొందుతున్నారు.

ఇవన్నీ కెసిఆర్ విజన్ నుంచి వచ్చినవే. కెసిఆర్ ఇవన్నీ మన ముందు ఏకరువు పెట్టలేదు. వివరించి ప్రతి ఒక్కటి చెప్పలేదు. కానీ అమలు చేసి చూపిస్తున్నారు. పల్లెల్లో సంతోషం వెల్లివిరిసింది. బొంబాయి, దుబాయి పోవడం తప్పింది. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. అటవీ విస్తీర్ణం పెరిగింది. మానవాళి సంక్షేమానికి భరోసా లభిస్తున్నది. ఇదంతా ఒకప్పుడు కెసిఆర్ కల గన్నారు. నా తెలంగాణ ఇంత గొప్పగా ఉండాలని ఆకాంక్షించారు. ఆ ఆకాంక్షను, ఆ స్వప్నాన్ని సాకారం చేసుకున్న తృప్తి ఆయనకు లభించింది. అదే ఆయన కోరుకునేది. కెసిఆర్ ఇప్పుడు రాబోయే తరాల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం కొత్త కలలు కంటున్నారు. సరి కొత్త తెలంగాణను దర్శించుకుంటున్నారు. ఆ దర్శనం నుంచి మనకు కొన్ని పథకాలు ప్రకటించి ఉంటారు. కానీ ఆ పథకాలే కెసిఆర్ భవిష్యత్తు వ్యూహాలు కాదు. ఆయన వ్యూహాలు ఇంకా సమగ్రంగా ఉంటాయి. అందులోంచి కొత్త కొత్త పథకాలు, విధానాలు వస్తుంటాయి. తెలంగాణను సస్యశ్యామలం, సుసంపన్నం చేయడం పూర్తయింది. ఇప్పుడు భవిష్యత్తుకు, భావితరాలకు మరింత భరోసా ఇవ్వబోతున్నారు.

ఉదాహరణకు అనేక వైద్య కళాశాలలు ప్రారంభించారు.ఇది భారత దేశంలోనే ఒక రికార్డు. దీని వల్ల భవిష్యత్తులో ఏటా వేలాది మంది వైద్యులు అందుబాటులోకి వస్తారు. ప్రతి పల్లె ఒక వైద్యుడిని అందుబాటులో పొందగలుగుతుంది. దేశ విదేశాలలో మన వైద్యులు చరిత్ర సృష్టిస్తారు. రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు. పాలనా దక్షుడు రాబోయే తరాల గురించి ఆలోచిస్తాడు. కెసిఆర్ సాధారణ నాయకుడు కాదు. దార్శనికుడు. పరిపాలనా దక్షుడు. ఆయన రాబోయే తరాల కోసం అన్ని రంగాలను తీర్చి దిద్దుతున్నారు. ఆయన అధికారంలో ఉంటే అద్భుతాలను సృష్టిస్తూనే ఉంటారు. కెసిఆర్ అధికారంలో ఉంటే, ప్రతి ఒక్కరూ కడుపు నిండా తింటారు. నిశ్చింతగా కంటి నిండా నిద్ర పోతారు. మా గురించి పట్టించుకునే నాయకుడు ఉన్నాడనే ధీమా చాలు ప్రజలకు. ఇంతకన్నా మనం కోరుకునేది ఏమున్నది? కెసిఆర్ మహోన్నత నాయకుడు. ఆయన ముందు ప్రతిపక్షాల నాయకులు అంగుష్ట మాత్రులు. హనుమంతుడి ముందు కోతి పిల్లల్లా కుప్పిగంతులు వేస్తూ ఉంటారు. ఏవేవో హామీలు కురిపిస్తూ ప్రచారార్భాటం చేసినంత మాత్రాన వారిని ప్రజలు వారిని నమ్మి బొందలో పడరు. కెసిఆర్‌ను మాత్రమే ప్రజలు నమ్ముతారు. ప్రజల దృష్టిలో కెసిఆర్ మాత్రమే నాయకుడు, ముఖ్యమంత్రి పీఠానికి అందం తేగల నిజమైన పాలనాదక్షుడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News