రంగారెడ్డి : అధికార పక్షం నుంచి పలువురు బడానేతలు తమ పార్టీలోకి వస్తారని నెలల తరబడి వేచిచూస్తున్న హస్తం పార్టీ నేతల ఆశలు అడియాశలుగా మిగిలాయి. వలసలపై ఆశలు స న్నగిల్లుతుండటంతో పాటు సమయం సమీపిస్తుండటంతో పార్టీ నేతల్లో టె న్షన్ ప్రారంబమైంది. అధికార బిఆర్‌యస్ సిట్టింగ్‌లను రంగంలోకి దించి దూకుడుగా ముందుకు సాగుతుంది. బిఆర్‌యస్ పార్టీ టికెట్‌ల కేటాయింపు అనంతరం పార్టీలో పెద్ద ఎత్తున ఆలజడి చెలరేగుతుందని, టికెట్ దక్కని సిట్టింగ్‌లతో పాటు పలువురు బడానేతలు మాజీమంత్రులు,మాజీ ఎమ్మెల్యేలతో పాటు కీలకనేతలు బిఆర్‌యస్ నుంచి కాంగ్రెస్‌లోకి వస్తారని పిసిసి పెద్దలు చాలా రోజులుగా వేచిచూస్తున్నారు.
సదరు నేతలతో రహస్యసమావేశాలు నిర్వహించి సీట్ల కేటాయింపుతో పాటు ఇతర అంశాలపై భారీగా చర్చలు నిర్వహించారు. బిఆర్‌యస్ సీట్లు సిట్టింగ్‌లకు ఇవ్వడంతో పాటు ఆశావాహూలందరిని ప్రగతిభవన్‌కు పిలిచి వారిని కావలసిన హమీలను ఇచ్చి తమ దారికి తెచ్చుకుని ఎక్కడ ఎలాంటి అసంతృప్తి లేకుండా చేయవలసిన అన్ని చర్యలు పక్కగా చేయడంతో కాంగ్రెస్ నేతలు షాక్ తిన్నారు.
మాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలు ఎవరు కూడ ఇప్పటికిప్పుడు కారు దిగి చేతి పట్టుకుని నడిచే పరిస్థితులు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కనిపించడం లేదు. అసంతృప్తి అన్న పదమే బిఆర్‌యస్ నేతల నుంచి రావడం లేదంటే కెసిఆర్ రాజకీయ చాతుర్యం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిఆర్‌యస్ నుంచి వలసలపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం అలాంటి వాతావరణం కనిపించకపోవడంతో బిజెపిలోని బలమైన నేతలను తమ దారికి తెచ్చుకునే మరో ప్లాన్ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. బిఆర్‌యస్ అసంతృప్తులపై బిజెపి సైతం ఆశలు పెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది.
బలమైన అభ్యర్దులు కరువు: ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్దులు కరువయ్యారు. మహేశ్వరంలో మంత్రి సబితారెడ్డి బరిలోకి దిగారు. డిసిసి అధ్యక్షుడు నర్సింహరెడ్డి, బడంగ్‌పేట్ మేయర్ పారిజాత, మనోహర్‌రెడ్డి, దేపా భాస్కర్‌రెడ్డి, ఎనుగు జంగారెడ్డి ఇలా చాలా మంది కాంగ్రెస్ టికెట్‌లు ఆశీస్తున్న బరిలోకి దిగితే సబితారెడ్డిపై గెలుపు సంగతి పక్కన పెట్టి కనీస పోటి ఇచ్చే పరిస్థితిలో ఎవరు లేరని ప్రచారం జరుగుతుంది. చెవెళ్ల నియోజకవర్గంలో బిఆర్‌యస్ టికెట్ స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యకు దక్కడంతో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్ ఆశీస్తున్న వసంతం, దర్శన్, బీంభరత్ ఎవరు కూడ యాదయ్యతో అర్ధిక, అంగ బలాల్లో కనీస పోటి ఇచ్చే పరిస్థితి లేదు.
తాండూర్‌లో బిఆర్‌యస్ టికెట్ రోహిత్‌రెడ్డికి దక్కగా ఇక్కడ హస్తంలో కనీసం పోటి ఇచ్చే నాయకుడు నియోజకవర్గంలో కనిపించడం లేదు. రాజేంద్రనగర్‌లో ప్రకాష్‌గౌడ్‌తో, శేరిలింగంపల్లిలో అరికేపూడి గాంధీని , ఎల్.బి.నగర్‌లో సుధీర్ రెడ్డితో పోటిపడే నాయకులు దరిదాపుల్లో కనిపించడం లేదు. మేడ్చల్‌లో బలమైన నేత, ఆర్ధిక, అంగబలాల్లో సాటిలేని మల్లారెడ్డిని డికొట్టె నేత కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్,ఉప్పల్,మల్కాజ్‌గిరి నియోజకవర్గాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. బిఆర్‌యస్‌లో అసంతృప్తులు కాంగ్రెస్‌లో చేరతారని ఆశీంచి చాలా చోట్ల వారి రాకకోసం వేచిచూసిన ఫలితం లేకుండా పోయింది.
26 సభ సక్సెస్ ఎలా: చెవెళ్లలో ఈ నెల 26 న కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభకు జనసమీకరణ సైతం నాయకులు చాలా వరకు చేతులేత్తేశారు. చెవెళ్ల నియోజకవర్గంలో పార్టీకి క్యాడర్ ఉన్న మండలానికో ఎమ్మెల్యే అభ్యర్ది ఉండటం….ఎవరికి వారే తమ స్వంత ఎజెండాలతో ముందుకు సాగడం తప్ప పార్టీని నియోజకవర్గ వ్యాప్తంగా సమన్వయం చేసే నాయకులు మాత్రం కరువయ్యారు. ఈ నెల 26 ఎఐసిసి అధ్యక్షుడు ఖార్గే వస్తున్న స్థానికంగా పార్టీలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి దూకుడు…జనసమీకరణ కసరత్తు మాత్రం కనిపించడం లేదు. హైద్రాబాద్ నుంచి భారీ కాన్వాయ్ వచ్చి సభ పూర్తి చేసుకుని వెళ్లడం తప్ప నియోజకవర్గ, జిల్లాలో జనసమీకరణ మాత్రం తూస్‌మనిపించే వాతావరణం కనిపిస్తుంది.
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జల్ పల్లి మున్సిపాలిటీ షాహిన్ నగర్ ఉస్మాన్ నగర్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు సయ్యద్ జావీద్,షేక్ ఫక్రుద్దీన్ , షేక్ సల్మాన్ తదితరులు జల్ పల్లి మున్సిపాలిటీ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ బిన్ ఖలీఫా సీనియర్ నాయకులు అవినాష్ ,యువ నాయకులు ఎం ఏ హుస్సేన్ ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో పార్టీలు చేరారు.వారికి బి ఆర్ ఎస్ కండువా వేసి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. మహేశ్వరం నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సబితా ఇంద్రారెడ్డి గారిని ప్రకటించడంతో వారంతా హర్షిస్తూ, శుభాకాంక్షలు తెలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.