Monday, December 23, 2024

గ్రేటర్ ఓటర్ సపోర్ట్ ఎవరికో?

- Advertisement -
- Advertisement -

అర్బన్ ఓట్లపై అభ్యర్థుల్లో గుబులు,  ఐదు నియోజకవర్గాలపై ప్రభావం

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం. ఇక్కడ 66 డివిజన్లు, 11 లక్షల మంది జనాభా. ఐదు నియోజకవర్గాల పరిధి ఉంది. రెండు నియోజకవర్గాలు పూర్తిగా ఉండగా, మరో మూడు పాక్షికంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ… గ్రేటర్‌లోని ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికల తీరు ఆసక్తి గొల్పుతున్నది. ఇక్కడ ఎక్కువగా విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఉండడమే ప్రధాన కారణం. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఓరుగల్లులో ప్రజలు… తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు అండగా నిలిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటారు. గతంలో ఎన్నికలు నల్లేరు మీద నడకలా సాగినా…ఈసారి మాత్రం గ్రేటర్ లో ఎన్నికల వాతావరణం హాట్ హాట్ గా నడుస్తున్నది. గ్రేటర్ పరిధిలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. అర్బన్ లో ఓటర్ల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు.

బిఆర్‌ఎస్ ఏకపక్ష విజయాలు
వరంగల్ తూర్పులో 2014, 2018లో జరిగిన రెండు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ ఏకపక్ష విజయాలను సొంతం చేసుకుంది. ఈసారి మూడు పార్టీల మధ్య హోరాహోరీ ఉండడంతో బిఆర్‌ఎస్ కు గుబులు పట్టుకుంది. బిఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి కొండా సురేఖ, బిజెపి అభ్యర్థిగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటీ పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా తూర్పులో త్రిముఖ పోటీ నెలకొనడం, ముగ్గురు కూడా బలమైన అభ్యర్థులు కావడంతో ఎన్నిక ఆసక్తిగా మారింది. ముగ్గురిలో ఎవరికి ఓటర్లు పట్టం కడతారోననే చర్చ జరుగుతున్నది.

పశ్చిమలో త్రిముఖ పోటీ
పశ్చిమ నియోజకవర్గంలో కూడా త్రిముఖ పోటీ నెలకొం ది. బిఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, కాంగ్రెస్ అభ్యర్థిగా నాయిని రాజేందర్ రెడ్డి, బిజెపి అభ్యర్థిగా రావు పద్మ పోటీ చేస్తున్నారు. ముగ్గురి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఇక్కడ ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యావంతులు ఎక్కువగా ఉన్నందున అభ్యర్థుల్లో గుబులు రేగుతున్నది. నాలుగు సార్లు గెలిచిన వినయ్ భాస్కర్‌తో తొలిసారిగా కాంగ్రెస్, బిజెపి అభ్యర్థు లు పోటీ పడుతున్నారు. ఇక్కడి ఓటర్ల పై ఎవరి లెక్కలు వారికి ఉన్నా… గ్రేటర్ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చా యి. ముగ్గురు కూడా బలమైన కేడర్ ను కలిగి ఉన్నారు.

వర్ధన్నపేటలో ముక్కోణం
వర్ధన్నపేట లో కూడా త్రిముఖ పోటీ నెలకొంది. బిఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నాగరాజు, బిజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ బరిలో ఉన్నారు. ముగ్గురి మధ్య హోరాహోరీ పోరు సాగుతున్నది. ఈ నియోజకవర్గ పరిధిలో 42 విలీన గ్రామాలు ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చా యి. మూడు పార్టీలకు ప్రాతినిధ్యం లభించింది. ఈసారి కూడా మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నియోజకవర్గంలో కూడా విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగుల ప్రభావం ఉన్నది. వాళ్లకు సంబంధించిన ఓట్ల పై నేతలు ఆందోళన చెందుతున్నారు.

పరకాలలో సైతం త్రిముఖం
ఇక్కడ కూడా త్రిముఖ పోటీ నెలకొంది. గ్రేటర్ పరిధిలో మూడు డివిజన్లు ఉన్నప్పటికీ కీలకంగా మారాయి. బిఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి, బిజెపి అభ్యర్థిగా కాళీ ప్రసాదరావు పోటీ చేస్తున్నారు. మూడు పార్టీలకు కూడా బలమైన కేడర్ ఉన్నది. మూడు డివిజన్లు నగరంలో ఉండడంతో ప్రభావం ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. పోటీ మాత్రం హోరాహోరీగా సాగుతున్నది.

స్టేషన్ ఘన్‌పూర్‌లో ముఖాముఖి
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సింగపురం ఇందిర, బిజెపి అభ్యర్థిగా మాజీమంత్రి విజయరామారావు పోటీ చేస్తున్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. గ్రేటర్ లోని డివిజన్లు కూడా ఉండడంతో ప్రభావం అధికంగానే ఉన్నది. గ్రేటర్‌లోని ఐదు నియోజకవర్గాల్లో నాలుగింటిలో త్రిముఖ పోటీ నెలకొనగా.. ఒకచోట ముఖాముఖి పోటీ ఉన్నది. అంతా నగరంలోనే ఉన్నందున విద్యాధికులు కలిగి ఉన్నందున ఓటర్లు ఎవరిని కరుణిస్తారో వేచి చూడాలి.

(వల్లాల వెంకటరమణ/వరంగల్ ప్రత్యేక ప్రతినిధి)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News