Sunday, December 22, 2024

ప్యాకేజీ పట్టు.. పార్టీకి జై కొట్టు!

- Advertisement -
- Advertisement -

పలుకుబడి, పరపతిని బట్టి రేటు ఫిక్స్

శాసనసభ ఎన్నికల పుణ్యమా… అని రాజకీయ పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. రకరకాల ఎత్తుగడలను వేస్తున్నాయి. ఓటర్లను అకర్షించేందుకు రాజకీయ పార్టీలు అడ్డగోలుగా చేస్తున్న వాగ్దానాలు ఒక వైపు. ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసేందుకు చోటా మోటా నాయకుల నుండి పెద్ద నాయకుల వరకు తలకు ఇంత రేటుగా కొనుగోళ్ల పర్వానికి తెరతీయడం మరోవైపు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచార పర్వాన్ని స్పీడప్ చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల్లోంచి ప్రజా ప్రతినిధులను, నాయకులను వారి పలుకుబడి, పరపతిని బట్టి రేట్లు ఫిక్స్ చేసి మరీ కొనుగోళ్లు చేస్తూ కండువాలు కప్పుతున్నారు. ఈ వ్యవహారానికి ముద్దుగా, ఆకర్షణీయంగా ప్యాకేజీ అని పేరు పెట్టుకోవడం విశేషం.

ఎక్కడ చూసినా ప్యాకేజీ మాటే…
ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో, ఏ రాజకీయ పార్టీ శిబిరంలో చూసినా, ఏ నలుగురి మధ్య రాజకీయ చర్చ జరుగుతున్నా ‘ప్యాకేజీ’ మాటే ప్రధానంగా వినబడుతోంది. గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుని స్థాయి నుంచి సర్పంచ్, ఎంపిటిసి, మండల స్థాయిలో ఎంపిపి, జడ్పిటిసి ఆపై నియోజకవర్గం, జిల్లా స్థాయి నాయకులపై ప్రధాన పార్టీలు ప్యాకేజీల వల విసురుతున్నాయి. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి నువ్వా నేనా? అన్న రీతిలో పోటీ ఉంది. జనరల్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్యాకేజీలను ఇస్తూ తన పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

రెండు పర్యాయాలు గెలుపొంది మూడవ సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అక్కడి బిఆర్‌ఎస్ అభ్యర్థి మాత్రం ప్యాకేజీలకు దూరంగా ఉన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను చెప్పుకుంటూ ఓటర్లనే నమ్ముకుంటున్నారు. ఇదే జిల్లాలోని ఎస్‌సి రిజర్వుడ్ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. వివిధ రకాల సమీకరణాల రీత్యా ఓట్ల మెజార్టీయే లక్షంగా ఆ తాజా మాజీ ఎంఎల్‌ఏ ప్యాకేజీలను ఇస్తున్నట్లు సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి చిన్న చిన్నగా రాజకీయ పార్టీల నుండి మొదలైన ప్యాకేజీల ఆఫర్లకు చోటా మోటా నా యకులు కూడా బాగా అలవాటు పడిపోయినట్లు తెలుస్తోంది.

తెల్లారేసరికి మారుతున్న కండువా…
ఈ రోజు ఈ పార్టీలో ఉన్న నాయకుడు మరుసటి రోజు కల్లా వేరే పార్టీలో చేరి కండువా కప్పుకుంటున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ నాటికి ప్యాకేజీల ఆఫర్లు ముమ్మరమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వార్డు సభ్యుడికి రూ.20 నుండి రూ.30వేలు, సర్పంచ్, ఎంపిటిసికి రెండు నుండి మూడు లక్షలు, ఎంపిపి, జడ్పిటిసిలకు ఐదు లక్షలు, నియోజకవర్గం, జిల్లా స్థాయి నుండి నాయకుడై ఓటర్లను ప్రభావం చూపే స్థాయిలో ఉంటే పది నుండి 20 లక్షలు ప్యాకేజీగా నిర్ణయించి పార్టీలో చేర్చుకుంటు కండువాలు కప్పుతున్నట్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ పొలిటికల్ పార్టీల ప్యాకేజీల ఆఫర్‌కు ఏ ఒక్క పార్టీ మినహాయింపు కాదనే చెప్పాలి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీల మధ్య నెలకొన్న తీవ్రమైన పోటీని బట్టి గెలుపే లక్షంగా ప్యాకేజీలను ఆఫర్ ఇస్తున్నాయని చెప్పవచ్చు. వరంగల్ జిల్లాలోనే కాకుండా ఈ ప్యాకేజీల ఆఫర్ అంతటా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

(బలేరావు బాబ్జీ/మన తెలంగాణ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News