నలుగురు కలిస్తే చాలు ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చ
మనతెలంగాణ/జగిత్యాల ప్రతినిధి : అన్నా… ఈ సారి ఎట్లుంటదంటవే… గక్కడ గా పార్టీ అభ్యర్థి గెలుస్తడట… గిక్కడ గాయన ఓడిపోతడట కదా అంటూ చర్చ జోరందుకుంది. నలుగురు కలిస్తే చాలు ఎన్నికలు, అభ్యర్థుల బలాబలాల గురించే మాట్లాడుకుంటున్నారు. తన నియోజకవర్గంతో పాటు ఇతర జిల్లాల్లో పరిస్థితి గురించి ఎవరికి తోచింది వారు మాట్లాడుతూ ఎవరికి వారు హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇలాంటి చర్చలు మరింత జోరందుకుంటుండగా, ఓటర్లు మాత్రం గుంభనంగా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ పిలిస్తే ఆ రాజకీయ పార్టీ సభలు, సమావేశాలు, ప్రచారానికి జనం వెళ్తుండగా, వీరంతా ఎటు వైపు నిలుస్తారనే సందేహం అన్ని పార్టీల్లో నెలకొంది.
నామినేషన్ సమయంలో అన్ని పార్టీల అభ్యర్థులు తమ బలం, బలగాన్ని చూపించేందుకు ఆరాటపడి ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాలు,పట్టణాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించారు. నామినేషన్ల సమయంలో ఫలానా అభ్యర్థికి ఇంత మంది జనం వచ్చారని, మరో పార్టీ అభ్యర్థి అంతకంటే ఎక్కువ జనాన్ని సమీకరించే ప్రయత్నాలు చేశారు. అభ్యర్థుల అవసరాన్ని ఆసరా చేసుకున్న ఓటర్లు ఎవరు పిలిస్తే వారికి వస్తాం… మరి మాకేంటి అన్నట్లుగా మరీ డిమాండ్ చేసి అందినంత గుంజే ప్రయత్నాలు అక్కడక్కడా బహిరంగంగానే జరిగాయి. కొన్ని సందర్బాల్లో అయితే నామినేషన్ కార్యక్రమానికి, ప్రచారానికి తమను ఎందుకు పిలవలేదంటూ ఆయా పార్టీల అభ్యర్థులు, ద్వితీయ శ్రేణులకు అడ్డుపడి దాడి చేసినంత పని చేశారు. దీన్ని బట్టి చూస్తే ఎవరెక్కడ పోతే నాకేంటి… నాకు లాభం జరిగితే చాలన్నట్లుగా సామాన్య ఓటర్లు వ్యవహరిస్తున్నట్లు ఈ సంఘటనలతో స్పష్టమవుతోంది.