Thursday, December 19, 2024

సోమవారానికి అసెంబ్లీ సమావేశాలు వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. డిప్యూటీ సిఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. భట్టి బడ్జెట్ ప్రసంగం అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీ సమావేశాలను 12వ తేదీకి వాయిదా వేశారు. అటు మండలి సమావేశాలు సైతం అదేరోజుకు వాయిదా పడ్డాయి. సోమవారం సభలో బడ్జెట్ పై చర్చ కొనసాగనుంది. నీటి పారుదల శాఖపై మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. 13వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించనున్నారు. అయితే ఈ సమావేశాలను మరో రెండు రోజుల పాటు పొడిగించి ఈ నెల 15వ తేదీవరకు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా సమాచారం. 14వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, కులగణన, నీటి పారుదల శాఖ అంశాలపై చర్చ జరపాలని ప్రభుత్వం భావిస్తోంది.

నేడు సీఎల్పీ భేటీ
ఈ నేపథ్యంలోనే నేడు (ఆదివారం) సీఎల్పీ భేటీ జరుగనుంది. ఈ భేటీలో నీటి పారుదల శాఖ శ్వేత పత్రం విడుదల అంశంతో పాటు ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వం సాగించిన అవినీతి అంశంపై చర్చించనున్నారు. గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎల్పీ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కాగా, కెసిఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఇప్పటికే రెండు శ్వేత పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం, తాజాగా ప్రాజెక్టుల విషయంలో వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది.
అసెంబ్లీ హాల్‌లో మంత్రివర్గ భేటీ
శనివారం ఉదయం అసెంబ్లీ హాల్‌లో మంత్రివర్గ భేటీ జరిగింది. బడ్జెట్ ఆమోదం కోసం జరిగిన భేటీలో సిఎం, డిప్యూటీ సిఎంలతో పాటు మంత్రులందరూ పాల్గొన్నారు. మంత్రివర్గ భేటీలో బడ్జెట్ ఆమోదం తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క బడ్జెట్ పత్రాలను అందచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News