Monday, January 20, 2025

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

హైద్రాబాద్ : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో శాసనసభ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం ఉంది. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా శాసనసభ సమావేశాలలో వివిధ అంశాలలో ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టడం కోసం బిఆర్‌ఎస్ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ గవర్నర్‌కు ప్రభుత్వానికి మధ్య సయోధ్య లేకపోవడంతో అనేక బిల్లులను గవర్నర్ తిప్పి పంపిన వ్యవహారంలో బిజెపిని కేంద్రంగా చేసుకొని తీవ్రస్థాయిలో విరుచుకు పడటం కోసం బిఆర్‌ఎస్ రెడీ అవుతోంది. అలాగే ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ తీరును కూడా కెసిఆర్ సభ ద్వారా ప్రజలకు వివరించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇవే చివరికి సమావేశాలు అయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదించబోతోంది.

ఆర్‌టిసి ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బిఎసి సమావేశంలో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు ఉండటం, సెప్టెంబర్‌లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆగస్టులోనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని కెసిఆర్ సర్కార్ నిర్ణయించింది. ఇక ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఈ ఏడాదికి సంబంధించి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావటంతో అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమైనా ప్రకటనలు చేస్తుందా? అన్న చర్చ మొదలైంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఎన్నికలకు ముందు జరగనున్న ఈ చివరి అసెంబ్లీ సమావేశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో ఆసక్తి నెలకొంది.

ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందని స్పీకర్ అన్నారు. రాష్ట్ర శాసనసభ పనితీరు అద్భుతంగా ఉన్నదని ఢిల్లీలో కూడా మాట్లాడుకుంటున్నారని వెల్లడించారు. ఈ ఘనత అధికార యంత్రాంగం సహకారంతోనే సాధ్యమైందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలి. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా నిర్వహించి, ప్రజలకు అన్ని విషయాలను తెలియజేయాల్సిన అవసరమున్నదన్నారు. మనమందరం ప్రజలకు జవాబుదారీ అని స్పీకర్ పేర్కొన్నారు.

గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగ్‌లో ఉన్న జవాబులను వెంటనే పంపించాలన్నారు. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో ముద్రించి ముందస్తుగా సభ్యులకు అందిస్తే వారు సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుంద్న్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలి. ప్రతి శాఖ తరుపున ఒక నోడల్ అధికారిని నియమించాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు ప్రతిపక్షాలు సైతం ఈ అసెంబ్లీ సమావేశాలను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.

కొత్తగూడెం నుంచి ఎవరు ఎంఎల్‌ఎ?
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుపై రాష్ట్ర హైకోర్టు వేటు వేయడం, జలగం వెంకట్రావును ఎంఎల్‌ఎగా పరిగణించాలంటూ తీర్పు వెలువరించింది. దీంతో గురువారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ఈ ఇద్దరు నేతల్లో ఎవరు హాజరవుతారనే చర్చ జరుగు తోంది. తన ఎన్నిక చెల్లదంటూ వెలువరించిన తీర్పుపై స్టే కోసం వనమా తిరిగి హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో కోర్టు తీర్పును అమలు చేయక తప్పని పరిస్థితి. మరోవైపు, కోర్టు తీర్పు ఆధారంగా తనను ఎంఎల్‌ఎగా గుర్తించాలంటూ జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు.

కానీ ఎలాంటి నిర్ణయంమ తీసుకోలేదు. సమావేశాలకు హాజరవ్వాలంటే జలగం వెంకట్రావు ఎంఎల్‌ఎగా ప్రమాణం చేయాల్సి ఉంటుంది. స్పీకర్ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఎంఎల్‌ఎగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావొచ్చు. ఈ విషయంపై తన నిర్ణయాన్ని స్పీకర్ పెండింగ్‌లో పెడితే మాత్రం ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఇద్దరిలో ఎవరికీ ఉండదని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News