Friday, January 31, 2025

7న అసెంబ్లీ?

- Advertisement -
- Advertisement -

కులగణన నివేదికపై ప్రత్యేక చర్చ
ఫిబ్రవరి 2న మంత్రివర్గ ఉపసంఘానికి
కులగణన తుది నివేదిక ఫిబ్రవరి
5న కేబినెట్ భేటీలో చర్చ అసెంబ్లీలో
చర్చించి ఆమోదం పొందనున్న
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో
బిసి రిజర్వేషన్లపైనా చర్చించే ఛాన్స్
42శాతానికి పెంచే అవకాశం
కేబినెట్ భేటీకి ఇసి అనుమతి
తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ స మావేశాలకు ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 7వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వేకు సంబంధించి అధికారులు తుది నివేదికను తయారు చేశారు. ఈ తుది నివేదికను ఫిబ్రవరి 2వ తేదీన కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించనున్నారు. కుల గణన సర్వే రిపోర్టుపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించి తుది నివేదిక ఆమోదం కో సం కేబినెట్‌కు  పంపనుంది.ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 5వ తేదీన కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అయి కులగణన సర్వే రిపోర్టుపై చర్చించి దానికి ఆమోద ముద్ర వేయనున్నట్టుగా తెలిసింది. ఫిబ్రవరి 7వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి కులగణన నివేదికపై సభలో చర్చించి అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీన రాజ్ భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో గవర్నర్‌తో సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయి ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహణపై ఇప్పటికే చర్చించినట్లుగా సమాచారం. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రత్యేక సెషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమయినట్టుగా తెలిసింది.

అలాగే ఫిబ్రవరి 5వ తేదీన జరుగనున్న కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల అంశంపైన కేబినెట్ చర్చించనున్నట్లుగా తెలిసింది. ఈ భేటీలోనే బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసి అనంతరం లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే కేబినెట్ భేటీకి సంబంధించి ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం. మార్చి 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మార్చి రెండో వారం లోపే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయొచ్చా? అని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీసినట్టు తెలిసింది. వార్డుల వారీగా బిసి కులాల డేటాను ఎన్ని రోజుల్లో ఫైనల్ చేయొచ్చు? రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్ కమిషన్‌కు ఎన్ని రోజులు పడుతుంది? కమిషన్ రిపోర్టు ఇచ్చిన తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించి, ఫలితాలు వెల్లడించడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చని అధికారులను సిఎం రేవంత్ వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News