హైదరాబాద్ : తెలంగాణ జనసమితి (టిజెఎస్) ఏ పార్టీలో విలీనం కాదని, స్వతంత్రంగా కొనసాగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం దూరం అయ్యిందని విమర్శించారు. రాజకీయాలు కార్పొరేట్‌గా మారాయని అన్నారు. ప్రజల చుట్టూ రాజకీయం తిప్పాలన్నారు. అందరినీ ఏకతాటిపైకి తెస్తామని, ఉద్యమంలో కలిసివచ్చిన వారిని ఏకం చేస్తామని కోదండరాం చెప్పారు.
హైదరాబాద్ కేంద్రంగా కాకుండా నియోజకవర్గాల కేంద్రంగా ఉద్యమిస్తామని కోదండరామ్ చెప్పారు. ఈ నెల 21 నుండి తెలంగాణ బచావో యాత్రను ప్రొఫెసర్ జయశంకర్ గ్రామం అక్కంపేట నుంచి మేడారం వరకు తెలంగాణ బచావో యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. ధరణి, తెలంగాణ బచావో పేరుతో సదస్సులు నిర్వహించునున్నట్లు వివరించారు. రైతులకు ఇస్తామన్న రూ. 10 వేల నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదని అన్నారు. కొత్త రిజినల్ రింగ్ రోడ్డు అవసరం లేదని ఆయన చెప్పారు. సింగరేణిలో విచ్చలవిడిగా ప్రైవేటీకరణ జరుగుతోందని డబ్బుల వల్ల రాజకీయాలు పతనమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలు పతనమైతే ప్రజల జీవితాలు నాశనమవుతాయని చెప్పారు. ఇంటింటికి వెళ్ళి ప్రజలకు వివరించి చైతన్యపరుస్తామన్నారు. ప్రస్తుత రాజకీయాలు మారకపోతే తెలంగాణకు భవిష్యత్తు లేదన్నారు.