Monday, January 20, 2025

పల్లె బతుకమ్మ పదిలం

- Advertisement -
- Advertisement -

తాంబాలం, తపుకు, శిబ్బి.. తెలంగాణ బతుకమ్మను పేర్చేందుకు ఆడపడుచులకు ఉపయోగపడే వస్తువులు. ఈ బతుకమ్మ పండుగ క్రీస్తుకు పూర్వమే ఆరంభమై తెలంగాణ పల్లెల్లో ఆశ్వయుజ మాసం లో కొలువుదీరి వందలాది ఏళ్లుగా ఆడపడుచుల పండుగగా విలసిల్లుతున్నది. సాంస్కృతిక పునరుజ్జీవన నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి అణచివేతకు గురవుతున్నదని భావించిన ప్రతిసారీ బతుకమ్మను తెలంగాణ యావత్తూ గుండెలకు హత్తుకున్నది. చరిత్ర బతుకమ్మకు ఇస్తున్న ప్రాశస్త్యం దృష్ట్యా బతుకమ్మ పండుగ అన్ని ప్రాంతాల్లోనూ మహిళలు ఆడేందుకు రాష్ట్ర సాధన సందర్భంలో కూడా ఒక అవకాశంగా నిలిచింది. ఇదంతా మనం చూస్తున్న వాస్తవం. ఈ క్రమంలో బతుకమ్మ పాటలు, బతుకమ్మ ఆట ఆడే సందర్భంలో మహిళలు ఎంచుకున్న వినూత్న నృత్య విధానాలు..

సంప్రదాయ బతుకమ్మకు మనం ఒకింత దూరం అవుతున్నామేమోననే వాదనకు తావిచ్చింది. బతుకమ్మ ఆట కోసం మహిళలు, ఆ మాటకొస్తే తెలంగాణ కుటుంబాలు ఎంచుకునే పూలసేకరణ మొదలు ఆయా ప్రాంతాల్లోని వర్షరుతువు చివర్లో ఊరి చెరువులో పేరుకుపోయిన నాచును, మలినాలను తొలగించేందుకు ఉపకరించే ఔషధతత్వమున్న పూలను బతుకమ్మలో పేర్చడం, శాస్త్రీయతకు అద్దంపట్టాయి. నిజానికి పల్లెల్లో ఇప్పటికీ ఈ శాస్త్రీయత, ఈ ఔషధతత్వ ప్రాధాన్యత కొనసాగుతూనే ఉన్నది. ఇదే సందర్భంలో రాజకీయంగా పట్టణ ప్రాంతాల్లో చెరువులను దురాక్రమణ చేసి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న శక్తులపై హైడ్రా రూపంలో తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న పర్యావరణ పరిరక్షణ లక్ష్యం కూడా మనం ఉదహరించాలి.
వాస్తవానికి బతుకమ్మ పండుగ వర్ష రుతువు చివరలో రావడంతో అనేక మలినాలను నింపుకున్న చెరువుల్లో నీటి స్వచ్ఛతకు బతుకమ్మలను నిమజ్జనం చేయడం ద్వారా శాస్త్రీయంగా దారులు వేశారు మన పూర్వీకులు. పూర్వమైనా, ఇప్పుడైనా పల్లె బతుకమ్మ పదిలంగానే ఉంది.

పట్టణీకరణ, నాగరికత వివిధ రూపాల్లో చొరబడినప్పటికీ పల్లె చెరువులు ఇంకా నిండుకుండల్లా నిలుస్తూనే ఉన్నాయి. కాకతీయుల కాలంలో రాణి రుద్రమ కూడా తన విజయ సంకేతంగా బతుకమ్మ ఆడినట్లు చరిత్ర వివరిస్తున్నది. అనేక గ్రామాల్లో అప్పటి శాతవాహనులైనా, చోళులైనా, కాకతీయులైనా ప్రోత్సహించిన గొలుసుకట్టు చెరువుల ప్రక్రియ వ్యవసాయరంగ విస్తరణకు తోడ్పడుతూ వచ్చింది. వ్యవసాయం సస్యశ్యామలం అయినప్పుడు ఊర్లోని చేలు, చెలకలు పచ్చదనాన్ని పరివ్యాప్తం చేస్తాయి. అలా పరీవ్యాప్తమైన పచ్చదనంలోనే తంగేళ్లు, గునుగులు, కట్ల ఇతర ఔషధ తత్వమున్న పూల చెట్లుకూడా విస్తరిస్తాయి. ఇలా విస్తరించిన పూలచెట్లు బతుకమ్మ నాటికి పర్యావరణ పరిరక్షణ ప్రక్రియలో భాగస్వాములవుతాయి. బంతి పూలు ఇతర ఔషధతత్వాన్ని కలిగిన పూలు కూడా బతుకమ్మను పేర్చడంలో తాంబాలంలో ఒదిగిపోతాయి. గుమ్మడి పూలతో చేసిన గౌరమ్మ, పసుపుతో బతుకమ్మ వద్ద పెట్టే గౌరమ్మ కూడా ఔషధ తత్వ ప్రతీకలే. అలా ఒదిగిన పూ వరుసలు సద్దుల బతుకమ్మ నాడు ఊర చెరువుల్లో ఆట ఆడినతరువాత నీళ్లలో తేలియాడి స్వచ్ఛతను సమకూరుస్తాయి.

బతుకమ్మ సంస్కృతి వేరు. బతుకమ్మ గురించిన చరిత్ర వేరు. ఇప్పుడు రూపాంతరం చెంది వినూత్న సంస్కృతికి ఆలవాలంగా నిలుస్తున్న బతుకమ్మ వీటన్నింటికీ భిన్నమైంది. బతుకమ్మ పాటల్లో చరణాలై ఒదిగిన ధర్మాంగుడనే రాజుకు కూతురుగా నిలిచిన బతుకమ్మ గురించిన చారిత్రక నేపథ్యం వేరు. తదనంతర కాలంలో మహిళలు బతుకమ్మను పర్యావరణ పరిరక్షణకు వినియోగించే రీతిలో ఆ సంస్కృతిని కొనసాగించిన తీరు వేరు. నిజంగా ఆ బతుకమ్మ పల్లెల్లో ఇంకా ఆట చిలకల్లాగా, పాట చిలకల్లాగా, కలికి చిలకల్లాగామన ఆడపడుచులను ఊరి చివరన చెరువొడ్డుకు తీసుకెళ్తున్నది. తాంబాలంలో మాత్రమే ఒదిగే సద్దుల బతుకమ్మ కోసం ఎంగిలిపూల బతుకమ్మనాడు ఎంచుకున్న శిబ్బి, తపుకులు తోడై పల్లె సంస్కృతిని పరిరక్షించేందుకు ఉపకరిస్తున్నాయి.

ఉత్తర భారతపు దాండియా సంస్కృతి కూడా సమ్మిళితం అవుతున్న బతుకమ్మ నృత్యాలు ఇప్పుడు కొత్త రూపం సంతరించుకుంటున్న ఆటకు ఆలవాలంగా నిలుస్తున్నాయి. నగరాలు, పట్టణాల్లో ప్రపంచంలోని అనేక దేశాల్లో తెలంగాణ ఆడపడుచులు పర్యావరణ పరిరక్షణ సంజీవనిగా నిలిచే బతుకమ్మను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. రాజకీయ రూపాలు, రాజకీయుల లక్ష్యాలు కూడా బతుకమ్మ పరిరక్షణకు వివిధ సందర్భాల్లో ఉపకరించాయి. అయితే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఈ సాంస్కృతిక పునరుజ్జీవన ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. పల్లె బతుకమ్మ పదిలంగా ఉన్నది. సద్దుల వేళ ఆడపడుచులను ఆదరిస్తున్నది. ఊరి చివర చెరువొడ్డు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు బతుకమ్మలను ఆహ్వానిస్తున్నది.

డాక్టర్ కడియం కావ్య
ఎంపి, వరంగల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News