Sunday, January 19, 2025

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, టిపిసిసి అధ్యక్షుడిల మార్పు… ఢిల్లీలో నేతల లాబీయింగ్..!

- Advertisement -
- Advertisement -

రెండు పార్టీల్లో అధ్యక్ష మార్పు నేపథ్యంలో
అధిష్టానాల చుట్టూ తెలంగాణ నేతల ప్రదక్షిణలు
ఢిల్లీలో చక్కర్లు కొడుతున్న ఇరు పార్టీల నాయకులు

మనతెలంగాణ/హైదరాబాద్:  రెండు జాతీయ పార్టీల అధ్యక్షుల ఎంపిక ప్రస్తుతం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి (టిపిసిసి), బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి పదవుల కొత్త వారిని ఎంపిక చేయాలని ఈ రెండు జాతీయ పార్టీల అధిష్టానాలు నిర్ణయించడంతో ఆ పదవుల కోసం లాబీయింగ్ చేయడానికి ఇరు పార్టీలకు చెందిన నేతలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. బిజెపి నుంచి పలువురు ఆశావహులు తమకు అధ్యక్ష పదవిని కేటాయించాలని కోరుతుండగా, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని తమకు టిపిసిసి అధ్యక్ష పదవిని ఇవ్వాలని కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ బిజెపి పార్టీ అధ్యక్షుడిగా సుమారు సంవత్సరం పాటు బాధ్యతలు నిర్వర్తించిన కిషన్‌రెడ్డి ప్రస్తుతం మరోసారి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణకు పూర్తిస్థాయి బిజెపి అధ్యక్షుడి బాధ్యతలను సమర్థుడికి అప్పగించాలని బిజెపి అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలిసింది.
రేవంత్ స్థానంలో టిపిసిసి అధ్యక్షుడిగా మరొకరికి…

ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణకు చెందిన కీలక నేతలు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. టిపిసిసి చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఈనెల 27వ తేదీతో బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి కావస్తుండడం, ఇక నుంచి తెలంగాణలో పాలనను సిఎం రేవంత్‌రెడ్డి పరుగెత్తించాల్సి రావడంతో టిపిసిసి రేవంత్‌రెడ్డి స్థానంలో మరో సమర్ధుడిని నియమించాలని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు జాతీయ పార్టీలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా కొత్తవారు నియమితులయ్యే అవకాశం ఉందని, అందులో భాగంగానే చాలామంది ఈ పోస్టుల కోసం ఢిల్లీలో తమవంతు లాబీయింగ్ చేస్తున్నట్టుగా సమాచారం.
కుల సామాజిక నేపథ్యంలో…

టిపిసిసి చీఫ్ పదవిని తమకే ఇవ్వాలని ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, మల్లు రవి, మంత్రి సీతక్క, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, సంపత్‌కుమార్‌లతో పాటు బిసి కోటాలో మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, సురేశ్ షెట్కార్‌లు ఈ పదవిని ఆశిస్తున్నారు. వీళ్లంతా తమ చానళ్ల ద్వారా లాబీయింగ్ చేసుకుంటున్నట్టుగా సమాచారం. ఎస్టీ కోటాలో ఈ పదవిని మంత్రి సీతక్క, మానుకోట ఎంపి బలరాం నాయక్ ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మాదిగ సామాజికవర్గం కోటాలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. పిసిసి చీఫ్ నియామకం తర్వాతే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. దీంతో ఈ అంశంపై హైకమాండ్ రెండు, మూడు రోజుల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

బిజెపిలో నలుగురు పోటీ…

కిషన్‌రెడ్డి ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన సికింద్రాబాద్ నుంచి ఎంపిగా గెలువడంతో ఆయనకు మంత్రిపదవి పక్కా అనే సంకేతాలొస్తున్నాయి. దీంతో రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తవారిని నియమించడం ఖాయమనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే కొత్త చీఫ్ నియామకం ఈ నెలలోనే ఉంటుందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ఈ పదవి కోసం బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్, మెదక్ ఎంపి రఘునందన్ రావు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పోటీలో ఉన్నారని సమాచారం. బిసి వర్గానికే ఈ పదవిని కట్టబెడుతారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పాయల్ శంకర్ లేదా ఈటల రాజేందర్‌లతో ఎవరో ఒకరికీ అవకాశం వస్తుంది. ఎన్డీఏ పక్ష ఎంపిల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన కిషన్‌రెడ్డి నూతన అధ్యక్షుడి అంశంపై జాతీయ నాయకత్వంతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News