Thursday, January 23, 2025

కమలం అసమ్మతి నేతలకు ఐటీ భయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర భారతీయ జనతా పార్టీలోని అసమ్మతి నాయకులు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తుండగా వారం రోజుల కితం బిఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధుల ఇళ్లలో ఐటీదాడులు, పలువురు నాయకులకు చెందిన మెడికల్ కళాశాల్లో సోదాలు జరపడంతో కమలం పార్టీ వీడి కాంగ్రెస్‌కు జెండా పడితే తమపై ఐటీ, ఈడీ దాడులు తప్పవని జంకుతున్నారు. ముఖ్యంగా ఆర్థికబలమున్న నాయకులంతా పార్టీ మారే నిర్ణయంపై పునరాలోచనలో పడినట్లు వారి అనుచరులు పేర్కొంటున్నారు. కర్నాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ పుంజుకుంటుందనే అంచనాతో ఆపార్టీకి చెందిన కొంతమంది నేతలతో రహస్యంగా సమావేశం జరిపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా సీటు ఇస్తే జూలైలో పార్టీలో చేరుతామని ఒప్పందాలు చేస్తుకున్నారు. దీనిని పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం ముందుగా బిఆర్‌ఎస్‌కు చెందిన నాయకులపై దాడులు చేసి సోదాలు నిర్వహించింది. చివరికి వారంతా అక్రమాలకు పాల్పడలేదని బయటపడింది.

కమలం పార్టీ మారే వారికోసం ముందుగా సంకేతాలు పంపినట్లు ఉందని, ఇప్పడు కాంగ్రెస్‌లోకి వెళ్లితే తమపై దాడులు తప్పవని దీంతో తమ రాజకీయ జీవితం ముగుస్తుందని భావిస్తూ బిజెపిలో కొనసాగేందుకు సిద్దమైన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండు రోజుల కితం కమలంలో సమ్మతినేతలుగా ముద్రపడిన ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ అగ్రనేతలైన జెపి నడ్డా, అమిత్‌షా, జెఎల్ సంతోష్‌తో బేటీ అయిన పార్టీ బలోపేతం గురించి సలహాలు, సూచనలు చేయడంతో పాటు గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలని కోరినట్లు వారి అనుచరులు చెబుతున్నారు. వీరితో పాటు గతంలో కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి వచ్చి ఆర్ధిక వనరులు సమకూర్చుకున్ననేతలు కూడా రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ తగ్గుతుందని , తాము పాత గూటికి వెళ్లుతున్నట్లు లీకులు చేశారు. వారంతా మళ్లీ పార్టీ మారడంపై వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్‌కు వెళ్లితే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొల్సి వస్తుందని ఆలోచిస్తూ కమలం పార్టీలో ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వారి నియోజకవర్గాలకు చెందిన నాయకులతో చెబుతున్నారు.

పలుమార్లు పార్టీ మారితే ప్రజల్లో విశ్వాసం కోల్పోతామని ఇక్కడే ఉండి పార్టీకోసం శ్రమించి అసెంబ్లీ ఎన్నికలో విజయం సాధించేందుకు ప్రయత్నాలు పేర్కొంటున్నారు. అదే విధంగా బిఆర్‌ఎస్‌తో లబ్ది పొంది తిరుగుబాటు చేసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి వంటి సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తర్జనభర్జన పడుతున్నట్లు, కర్నాటక ఎన్నికల ప్రభావం తెలంగాణలో ఎన్ని రోజులు ఉంటుందని బావిస్తూ పార్టీ మారే విషయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో వివిధ పార్టీలు మారి రాజకీయాలను గుప్పిట్లో పెట్టుకున్న నాయకులంతా వ్యాపారవేత్తలు, గుత్తేదార్లేనని వారు తమ ఆర్దిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాల వైపు అడుగులు వేస్తారని పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News