పోటీపై మౌనం
క్రిందిస్థాయి నేతలు పోటాపోటీగా దరఖాస్తులు
కమలం టికెట్ కోసం జోరుగా దరఖాస్తులు
నేడు దరఖాస్తులకు చివరిరోజు
మన తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శాసనసభకు పోటి చేయడానికి కమలదళంలో పోటాపోటిగా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. గతంలో ఎనాడు లేని విదంగా బిజెపి నాయకత్వం శాసనసభకు పోటిచేసే ఆశావాహూల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిర్వహిస్తుండటంతో నేతలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి తామున్నామంటు దరఖాస్తులను అందచేస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి కండిషన్‌లు పెట్టకుండా….ఎలాంటి రుసుము చెల్లించే అవసరం లేకుండా ఉచితంగా దరఖాస్తులను స్వీకరిస్తుండటంతో అన్ని స్థాయిల నేతలు ముందుకు వచ్చి తాము సైతం బరిలో ఉంటాం…టికెట్ ఇవ్వండి అంటు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌లో నేతలకు తమ దరఖాస్తులను అందచేస్తున్నారు.
కొన్ని నియోజకవర్గాల నుంచి నేతలు భారీ హంగామాతో కొంత మంది వస్తుండగా మరికొంత మంది ఒక్కరిద్దరు వచ్చి సాదాసీదాగా తమకు టికెట్ కేటాయించాలంటు దరఖాస్తులను అందచేసి వెలుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3223 దరఖాస్తులు రాగా శనివారం ఒక్కరోజు 1603 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 17 నియోజకవర్గాలకు ఇప్పటికే మూడు వందలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుండటంతో చివరిరోజు భారీగా టికెట్ కోసం దరఖాస్తులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దరఖాస్తులు సమర్పిస్తున్న వారిలో చాలా మంది టికెట్ దక్కితే కనీసం పోటి ఇచ్చే స్థాయిలో లేని వారు సైతం ఉన్నారు.
ఒక్కో నియోజకవర్గంకు పదుల సంఖ్యలో….
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బిజెపి టికెట్‌లకు పుల్ డిమాండ్ కనిపిస్తుంది. నియోజకవర్గాలలో కనీసం పట్టులేని నాయకులతో పాటు అంతా టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలోని గ్రామీణ నియోజకవర్గాలలో పది లోపు దరఖాస్తులు వస్తుండగా శివారు నియోజకవర్గాలలో మాత్రం ఒక్కో సీటుకు పాతిక వరకు దరఖాస్తులు వచ్చే చాన్స్ ఉందని బిజెపి సీనియర్ నేత ఒకరు పెర్కొన్నారు. రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం దరఖాస్తులకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొంత మంది నేతలు స్వయంగా భారీ అనుచరగణంతో వెళ్లి టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటుండగా సీనియర్‌లు మాత్రం తమ దరఖాస్తు పత్రాలను తమ అనుచరులతో పంపిస్తున్నారు. మాజీ ఎంపి కొండ విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు పలువురు సీనియర్‌లు ఇప్పటివరకు బహిరంగంగా తాము ఎక్కడ నుంచి పోటి చేయడానికి దరఖాస్తులు సమర్పించారో బయటకు వెల్లడించకపోవడంపై పలు రకాల చర్చలు సాగుతున్నాయి.
శనివారం నాడు రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, బుక్క వేణుగోపాల్, బొక్క బాల్ రెడ్డి, జిల్లా మాజీ అద్యక్షుడు అంజన్‌కుమార్ గౌడ్, నాయకులు వై శ్రీదర్ తదితరులు తమ దరఖాస్తులను అందచేశారు. మహేశ్వరం టికెట్ కోసం జిల్లా పార్టీ అధ్యక్షుడు బొక్క నర్సింహరెడ్డి, కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, అందెల శ్రీరాములు, శంకర్‌రెడ్డి తదితరులు దరఖాస్తులు సమర్పించారు. షాద్‌నగర్ టికెట్ కోసం మాజీ పార్లమెంట్ సభ్యుడు ఎ.పి.జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డితో పాటు గతంలో పోటిచేసి పరాజయం పాలైన శ్రీవర్దన్‌రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి తదితరులు పోటిపడుతున్నారు. చెవెళ్ల టికెట్ కోసం విజయ్‌కుమార్, ప్రకాష్ తదితరులు తమ దరఖాస్తులను సమర్పించారు.