Monday, March 10, 2025

తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవిపై ఎడతెగని ఉత్కంఠ

- Advertisement -
- Advertisement -

రోజు రోజుకీ పెరుగుతున్న ఆశావాహుల సంఖ్య
ఇంకా సుధీర్ఘ కసరత్తులోనే పార్టీ రాష్ట్ర నాయకత్వం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవిపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. గత కొన్ని నెలలుగా అధ్యక్ష నియామకంపై పార్టీ సుధీర్ఘ కసరత్తు చేస్తున్నా ఓ నిర్ణయానికి రాలేకపోయింది. ఇప్పటికే 19 జిల్లాల బిజెపి అధ్యక్ష పదవులకు ఎంపిక చేసిన కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి భర్తీపై దృష్టి సారిస్తోంది. దీంతో ఆశావహులు సైతం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కులాల బేరీజు వేసుకుని అధ్యక్ష పదవికి ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. బిసికి అధిక ప్రాధాన్యత ఇస్తూ మల్కాజ్‌గిరి ఎంపి ఈటల రాజేందర్‌కు అవకాశం వస్తుందని, దాదాపుగా ఖరారైనట్లు సమాచారం పార్టీ వర్గాల నుంచి అనేక సార్లు బయటకు వచ్చింది.

తెలంగాణ కమల దళపతి నియామకం ఈ నెల 15 నాటికి పూర్తి అవుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈటల, అర్వింద్ పేర్లు వినిపించాయి. తాజాగా తెరపైకి కొత్త పేర్లు కూడా వచ్చాయి. పార్టీ జాతీయ నాయకత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావుకు తోడు సీనియర్ నాయకురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరు కూడా వినిపిస్తుండడంతో ఎవరికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్ష పదవి విషయంలో గతంలో పార్టీలో పాత నేతలు, కొత్త నేతలు అనే వివాదం రావడం, దానికి తోడు కొందరు బాహాటంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో విభేదాలు తలెత్తాయి. దీంతో అధిష్ఠానం ఆచితూచి అధ్యక్ష పదవికి తగిన నేతను ఎంపిక చేయాలని అన్వేషిస్తోంది.

మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్న పార్టీ అందుకు అనుగుణంగా పరిశీలన చేస్తోంది. మురళీధర్ రావు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేర్లు వినిపిస్తుండగా ఈ ఇద్దరూ ఓసీలే కావడంతో వీరిలో ఒకరికి అధ్యక్ష పదవి ఇస్తే బీసీ నేతను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు ఒసి వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీఎల్పీ నేతగా కొనసాగుతున్నారు. అధ్యక్ష పదవి, బిజేఎల్పీ నేత పదవి రెండు ఒసిలకు ఇవ్వడం వల్ల పార్టీలో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బిసి నేతకే ఎక్కువ అవకాశం ఉంటుందని, అది ఈటలా..?, అర్విందా..? అనేది తేలాల్సి ఉంది. దీనిపై వీలైనంత త్వరగా కసరత్తు పూర్తి చేసి అధ్యక్ష పదవిని భర్తీ చేసేందుకు పార్టీ నాయకత్వం దృష్టిసారించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News