Monday, December 23, 2024

కృష్ణాబోర్డు భేటీని బహిష్కరించిన తెలంగాణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానది జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆగడాలను అడ్డుకోవంటం పట్ల ఉదాసీనత చూపుతున్న కృష్ణానదీ యాజమాన్యబోర్డు వైఖరి పట్ల తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తిని వెలిబుచ్చింది. మంగళవారం జలసౌధలో జరిగిన కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని బహిష్కరించింది. కృష్ణానది ప్రాజెక్టుల్లో ప్రత్యేకించి శ్రీశైలం , నాగార్జున సాగర్ జలాశయాల్లో నిలువ ఉన్న నీటిని ప్రస్తుత అవసరాలకు వినియోగించుకోవటంపై తెలంగాణ , ఏపితో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించింది.

కృష్ణారివర్‌బోర్డు సభ్య కార్యదర్శి రాయపురే కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, అంధప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల శాఖ కార్యదర్శి నారాయణరెడ్డి సభ్యులుగా ఉన్నారు .కన్వీనర్ రాయపురే అధ్యక్షతన జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో ఏపి నుంచి ఆ రాష్ట్ర ఈఎన్సీ నారాయణరెడ్డి ఒక్కరే పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఈఎన్సీ ఈ సమావేశంలో పాల్గొనలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కృష్ణానదీజలాల వినియోగంలో ఏపి దూకుడుకు అడ్డుకట్ట వేయాలని పదే పదే బోర్డుకు విన్నవిస్తూ వస్తోంది. కేంద్ర జలవనరుల సంఘానికి కూడా పలు మార్లు ఇదే అంశాలపైన లేఖలు రాసింది.

ఏపిలో హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరునగరి సుజల స్రవంతి తదితర ప్రాజెక్టుల్లో అక్రమంగా పనులు చేస్తున్నారని , అనుమతి లేని పథకాల ద్వారా కృష్ణానదీజలాలు అక్రమంగా వాడుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోర్డు దృష్టికి తీసుకుపోయినా ఆశించిన స్పదన రాలేదు. ఏపి ప్రభుత్వం తాజాగా నాగార్జున సాగర్‌లో ఉన్న కొద్దిపాటి నిలువ నీటికి టెండర్ పెట్టింది. గుంటూరు జిల్లా తాగునీటి అవసరాలకోసం సాగర్ నుంచి కుడికాలువకు 5టిఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణాబోర్డుకు లేఖ రాసింది.సాగర్‌లో గరిష్టస్థాయి నీటి నిలువ 312టిఎంసీలు కాగా, ప్రస్తుతం ఈ జలాశయంలో 146 టిఎంసీలు మాత్రమే ఉన్నాయి. అందులో డెడ్‌స్టోరేజి స్థాయికి ఎగువన నీటి లభ్యత 13టిఎంసీలే వుంది.
ఈ కొద్దిపాటి నీటితో హైదరాబాద్‌నగర ప్రజల తాగునీటి అవసరాలు, మిషన్ భగీరధ అవరాలను తీర్చాల్సివుంది. ఎగువన వర్షాలు కురిసి సాగర్‌కు వరద నీరు చేరేదాకా ఈ కొద్దిపాటి నిలువ నీటితోనే తాగునీటి అవసరాలు తీర్చుకోవాల్సివుంది. దీంతో ఏపి కోరిన విధంగా సాగర్ నుంచి ఏపికి 5టిఎంసీల నీటివిడుదల ప్రతిపాదన పట్ల తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అంతే కాకుండా గత నీటి సంవత్సరానికి సంబంధించి ఏపి కృష్ణానదీజలాల్లో తన వాటాకు మించి నీటిని వాడుకుంది.

ఈ నేపధ్యంలో సాగర్ నీటి అంశమే ప్రాధాన్యతగా జరిగే ఈ త్రిసభ్యకమిటి సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బోర్డును కోరింది. అంతే కాకుండా మంగళవారం ఇతర ముఖ్యమైన సమావేశాలు ఉన్నందున సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది. అయితే బోర్డు అందుకు ససేమీరా అనటంతో తెలంగాణ ప్రభుత్వం నుంచి త్రిసభ్య కమిటి సమావేశంలో ఏవరూ పాల్గొనలేదు. కమిటి కన్వీనర్ రాయపురేతోపాటు ఏపి ఈఎన్సీ నారాయణరెడ్డ మాత్రమే హాజరయ్యారు. ఇరువురి మధ్య ఏకపక్షంగా చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే తెలంగాణ ప్రభుత్వ ప్రాతినిధ్యం లేకుండానే జరిగిన ఈ సమావేశంలో ఎవిధమైన నిర్ణయాలు తీసుకున్నారన్నది తెలియాల్సివుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News