హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. ఈ బాధ్యతను తనకు అప్పగించిన సిఎం కెసిఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏడేండ్లలో తెలంగాణ అనేక రాష్ట్రాలను ప్రగతిలో అధిగమించిందని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ఆకాంక్షలకు తగ్గట్లుగా బడ్జెట్ ఉంటుందని చెప్పారు. అభివృద్ధిలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందన్నారు. ప్రజల చల్లని దీవెనలతో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని మంత్రి పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ప్రచంచ గతినే మార్చేసింది. లాక్ డౌన్ కేంద్ర రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది.
ప్రతికూల పరిస్థితుల్లోనూ సంక్షేమం అభివృద్ధిపై దృష్టి సారించాం. జాతీయ స్థాయిలో జిఎస్ డిపి వద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ మెరుగ్గా ఉందన్నారు. కరోనా జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన తట్టుకుని నలిబడ్డామని చెప్పారు. పల్లెప్రగతి గ్రామీణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిందన్న మంత్రి దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం 97వేలు ఎక్కువన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ.2,30,825.96 కోట్లు మంత్రి హరీశ్ తెలిపారు. రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు అని, మిగులు రూ.6,743.50 కోట్లు అని చెప్పారు. ఆర్థిక లోటు అంచనా రూ.45,509.60 కోట్లని, మూలధన వ్యయం రూ.29,046.77 కోట్లు అని చెప్పారు.