Friday, December 20, 2024

ఆదాయంపై అంతులేని ధీమా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :ఆర్థికపరంగా అప్పులు, నష్టాలను తగ్గించుకొంటూ, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, ఆరు గ్యారెంటీలకు అగ్రతాంబూలం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25వ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కొత్త బడ్జెట్‌కు అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి పక్కా ప్రణాళికతో, ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలను అన్వేషించిన ఆర్థికమంత్రిత్వశాఖ ఆ మేరకు నిధులను సమీకరించుకోలమనే ధీమాతో ఉంది. పేరుకు ఓట్-ఆన్- అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ శాఖలవారీగా కేటాయింపులు, ఆదాయ, వ్యయాలు అన్నీ ఆర్థిక సంవత్సరం మొత్తానికీ లెక్కలువేశారు. కానీ ఓట్-ఆన్- అకౌంట్ బడ్జెట్ కావడంతో కేవలం నా లుగు నెలల ఖర్చులకు సంబంధించిన నిధులను వాడుకునేందుకు అసెంబ్లీలో ఆమో దం పొందేందుకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పూర్తిస్థాయి బడ్జెట్ వచ్చే జూలై నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థికఖ, వి ద్యుత్‌శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆర్థికశాఖ  స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావులు అసెంబ్లీ లాబీల్లో తమను కలిసిన మీడియా ప్రతినిధులకు వివరించారు.

ఈ నాలుగు నెలల కాలానికి సుమారు 79 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని, ఆ నిధులను వ్యయం చేసుకోవడానికి అసెంబ్లీ అనుమతి పొందుతూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు. అప్పుల ఊబిలో నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాకుండా ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని, కొన్నికొన్ని విభాగాల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయని, ఉదాహరణకు భూస్వాములకు కూడా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తూ ప్రభుత్వ ఖజానాను, ప్రజల సొమ్మును గత పాలకులు దుర్వినియోగం చేశారని, ఇప్పు డు అలాంటి పరిస్థితులు ఉండవని, ఆ ఒక్క పథకంలోనే కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుందని వివరించారు. ఇలా ఇంకా చాలా ఉన్నాయని, ఆ నష్టాలను తగ్గించుకొంటూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని, అందుకే ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన 53,196 కోట్ల రూపాయల నిధులను ఖచ్చితంగా ఖర్చు చేస్తామని, ఇందులో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు, సందేహాలు అక్కర్లేదని మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.

అన్ని మార్గాల నుంచి ఆదాయం
ప్రజలపై ఎలాంటి అదనపు పన్నుల భారాన్ని మోపకుండా రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాన్ని పెంచుకొంటూ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు రాబట్టుకొంటూ ‘రెగ్యులర్ మానిటరింగ్’తో నిధులను తెచ్చుకునేందుకు పక్కా ప్రణాళికతో పనిచేసే విధంగా రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సకల ఏర్పాట్లు చేసింది. అందుచేతనే 2024-25వ ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, ద్రవ్యలోటు 30,476 కోట్లు ఉన్నప్పటికీ ఏ మాత్రం వెనుకంజవేయకుండా అన్ని పథకాలను అమలు చేయడమే కాకుండా శాఖల వారీగా కేటాయించిన నిధులను కూడా ఒక్క రూపాయి కూడా తగ్గకుండా ఖర్చు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ‘ఆర్థికపరమైన యాక్షన్‌ప్లాన్’ను సిద్ధం చేసింది. గత పాలకులు 2023-24వ ఆర్థికసంవత్సరానికి 2,90,296 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారేగానీ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రివైజ్డ్ బడ్జెట్‌లో వాస్తవికంగా 2,24,624 కోట్లకు పరిమితమయ్యిందని, అంటే ఏకంగా 65,672 కోట్ల రూపాయలను ఖర్చు చేయలేకపోయారని, ఆ విధంగా అంకెలగారడీ చేశారని అన్నారు.

కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అలాంటి పొరపాట్లు, అంకెలగారడీలు, అవాస్తవాలు, గొప్పలకు పోవడం వంటి అంశాలకు తావులేకుండా పూర్తిస్థాయి వాస్తవాలతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందున, అందుకు తగిన ఆదాయాన్ని కూడా సమకూర్చుకొంటామని ఆర్థికమంత్రిత్వశాఖ పెద్దలు ధీమాగా వివరించారు. ఒకవైపు ఎఫ్‌ఆర్‌బిఎం చట్టానికి లోబడి, ఆ చట్టాన్ని గౌరవించుకొంటూనే, మరో వైపు కార్పోరేషన్ల (ఆఫ్‌సైడ్ లోన్స్) పేరుతో అప్పులు చేయకుండా, ఇప్పటి వరకూ ఉన్న అప్పులకు చెల్లింపులు, వడ్డీల చెల్లింపులన్నీ యధావిధిగా చేసుకొంటూపోతేనే అప్పులు తగ్గి ఆదాయం పెరుగుతుందని, ఇలా రీపేమెంట్లు చేసుకొంటూపోతుంటే ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిలో నిధుల సమీకరణకు అవకాశాలు కూడా మెరుగవుతాయని, అందుచేత ఓపెన్ మార్కెట్‌లో లోన్లు 59,625 కోట్లను రాబట్టుకుంటామని సీనియర్ అధికారులు ధీమాగా చెబుతున్నారు. మొత్తంమీద కేం ద్ర ప్రభుత్వంగానీ, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)గానీ తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ఆర్థిక పరమైన ఆంక్షలు విధించే పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆర్ధికపరమైన ఇబ్బందులన్నింటినీ తొలగించుకోవడానికి ఆర్థికమంత్రిత్వశాఖ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

అంతేగాక కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా రాబట్టుకోవడానికి, కేంద్రం ఇవ్వాల్సిన బకాయిలను కూడా రాబట్టే విధంగా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖతో రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తామని ఆ అధికారులు వివరించారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలనగానే భూములను అమ్ముకోవడం ఒక్కటే మార్గం కాదని, నష్టాలను తగ్గించుకోవడం, దుబారా వ్యయాన్ని పూర్తిగా నియంత్రించుకోవడం, అప్పులు తగ్గించుకోవడం, ప్రాధాన్యతల క్రమంలో నిధులను ఖర్చు చేసే మంత్రాన్ని పాటిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలన్నీ విజయవంతంగా నెరవేరుతాయని అంటున్నారు. కేంద్రం నుంచి సుమారు 35 వేల కోట్ల రూపాయల నిధులు బకాయిలు ఉన్నాయని, వాటిని రాబట్టుకొంటామని, నీతి ఆయోగ్, 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్ధిక సంఘం నిధులను కూడా రాబట్టుకొంటామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News