Sunday, January 19, 2025

సర్కార్ ఆర్‌టిసి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టిఎస్‌ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణ యం తీసుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 43, 373 మంది ఆర్‌టిసి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మా రనున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన పలువురు అధికారులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ప్రజారవాణా సామాజిక బాధ్యతగా గుర్తిస్తూ.. అధికారులతో కూడిన సబ్‌కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సబ్ కమిటీలో అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్‌అండ్‌బి, రవాణాశాఖ, జిఎడి శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ స్పెషల్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారన్నారు.

ఈ కమిటీ పూర్తి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తుందని తెలిపారు. ఈ నెల 3వ తేదీన ప్రారంభమ య్యే సమావేశంలోనే ఆర్‌టిసి ఉద్యోగులు, కార్మికులను ప్రభు త్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తూ శాసనసభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనున్నదని అన్నారు. వెంటనే దానికి సంబంధిత కార్యాచరణ ప్రారంభించాలని రవాణాశాఖ, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రికి సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు కెటిఆర్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన సుమారు ఆరు గంటలుగా కేబినెట్ భేటీ జరిగింది. అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి,పువ్వాడ అజయ్,కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లతో కలిసి మంత్రి కెటిఆర్ మీడియాకు వెల్లడించారు. ప్రజా రవాణాను పటిష్టం చేసేందుకు ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు కెటిఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ, అందులో పని చేసే ఉద్యోగులు, కార్మికుల విషయంలో రవాణామంత్రి, ఆర్థికశాఖ మంత్రి సంస్థతో అనుబంధం ఉన్న వారంతా సిఎం కెసిఆర్‌కు విన్నవించారని చెప్పారు.

ఆర్‌టిసి కార్మికులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్తపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నదని అన్నారు.ఆర్‌టిసిని కాపాడేందుకు, ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు, సేవలను మరింత విస్తృత పరిచేందుకు సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. విధివిధానాలు, నిబంధనలను రూపొందించేందుకు అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో ఆర్‌టిసి కార్మికులు ఈ విషయంలో సమ్మె చేవారని, వారి కోరికను మన్నిస్తూ ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

వరద బాధితులకు తక్షణ సాయం కింద రూ.500 కోట్లు
రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి 28 వరకు పెద్ద ఎత్తున వర్షాలు కురిశారని, వర్షాలు, వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైందని మంత్రి కెటిఆర్ తెలిపారు. పది జిల్లాల్లో భారీ వర్షాల వల్ల రైతులు, ప్రజలకు తలెత్తిన తీవ్ర నష్టం మంత్రివర్గ సమావేశంలో చర్చించామన్నారు. వరద బాధితులకు తక్షణ సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించిందని కెటిఆర్ వెల్లడించారు. వరదలకు తెగిన రోడ్లు, కల్వర్టులు మరమ్మతులు చేయాలని కేబినేట్ భేటీలో నిర్ణయించినట్లు తెలిపారు. రైతులకు విత్త్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వరద సమయంలో ప్రభుత్వం చేసిన సహాయక చర్యలు గురించి వివరించారు.

సుమారు 27 వేల మంది ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామని మంత్రి తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు ఉద్యోగ ధర్మాన్ని అద్భుతంగా నిర్వర్తించారని కొనియాడారు. వీరిద్దరికి ఆగస్టు 15వ తేదీన ప్రభుత్వం సత్కారం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే ఆశ్రమ పాఠశాలల్లో 40 మంది పిల్లలను కాపాడిన టీచర్‌ను సన్మానిస్తామని వివరించారు. వరదలకు మృతి చెందిన 40 మందికి పరిహారం అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పొలాల్లో ఇసుక మేటలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.బీడీ కార్మికులతోపాటు బీడీ పింఛన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి తెలిపారు.
రూ.60 వేల కోట్లతో మెట్రో విస్తరణ
హైదరాబాద్ నగరంలో రూ.60వేల కోట్లతో మెట్రోను విస్తరించనున్నట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు. హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాంటిదని, భారతదేశంలోనే అద్భుతమైన నగరంగా ఎదిగిందని వ్యాఖ్యానించారు. అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రభాగాన ఉందని చెప్పారు. పెరుగుతున్న నగరానికి మౌలిక సదుపాయాలు కూడా అదే స్థాయిలో ఉండాలని మెట్రో విస్తరించాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ప్రజారవాణాను విస్తృత పరచడం ద్వారా.. నగరం ఎంత పెరిగినా.. ఎన్ని పరిశ్రమలు వచ్చినా.. లక్షలాది మంది ప్రజలు వచ్చినా తట్టుకునేలా.. విశ్వనగరంగా ఎదగడానికి, అన్నిహంగులతో కూడిన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నదని, అందుకు పురపాలకశాఖ మంత్రిగా తాను సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

ప్యాట్నీ నుంచి కండ్లకోయ దాకా డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్
మూడు, నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో వ్యవస్థను భారీగా విస్తరించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఇప్పటికే రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌కు సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 70 కిలోమీటర్ల మెట్రోకు అదనంగా 31 కిలోమీటర్లు ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ రూపంలో అందుబాటులోకి రాబోతున్నదన్నారు. జూబ్లీ బస్టాండ్ నుంచి తూంకుంట వరకు వరకు డబుల్ డెక్కర్ మెట్రోను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఒక లెవల్‌లో వాహనాలు, మరో లెవల్‌లో మెట్రో ఏర్పాటు చేయడానికి కేబినెట్ తీర్మానించిందని వెల్లడించారు.

ప్యాట్నీ నుంచి కండ్లకోయ దాకా డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. హైదరాబాద్‌లో మరో ముఖ్యమైన మార్గం ఇస్నాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోను విస్తరించాలని, మియాపూర్ నుంచి లక్డీకపూల్ వరకు, విజయవాడ మార్గంలో ప్రస్తుతం ఉన్న మెట్రోను ఎల్‌బి నగర్ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు విస్తరించాలని, వరంగల్ రూట్‌లో ఉప్పల్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ వరకు, మహబూబ్‌నగర్ మార్గంలో భవిష్యత్తులో కొత్తూరు నుంచి షాద్‌నగర్ వరకు విస్తరించాలని నిర్ణయించిందని చెప్పారు. అలాగే ఉప్పల్ నుంచి ఇసిఐఎల్ క్రాస్ రోడ్డు వరకు విస్తరించడంతోపాటు ఓల్డ్ సిటీ మెట్రోను పూర్తి చేస్తామని తెలిపారు. ఓఆర్‌ఆర్ చుట్టూ ఎయిర్‌పోర్టు నుంచి కందుకూరు వరకు మొత్తం రూ.60వేల కోట్లతో మెట్రోను విస్తరించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని అన్నారు.

కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నాం
నాలుగైదేళ్లలో డబుల్ డెక్కర్ ఫై ఓవర్‌ను ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పురపాలకశాఖను ఆదేశించారని మంత్రి కెటిఆర్ తెలిపారు. వీటిపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసి, వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని సిఎం మెట్రో రైల్ అథారిటీ, మున్సిపల్ శాఖను ఆదేశించారన్నారు. హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజా రవాణాను భారత్‌లోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దాలన్న సిఎం కెసిఆర్ సంకల్పం మేరకు పెద్ద ప్రాజెక్టును తీసుకురాబోతున్నామన్నారు. ఇందుకు కేంద్రం ప్రభుత్వం సైతం సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని తెలిపారు. 2024 తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, అందులో బిఆర్‌ఎస్‌ది కీలక పాత్ర ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో వచ్చే కొత్త ప్రభుత్వంలోనైనా సాధించుకుంటామనే విశ్వాసం ఉందన్నారు.

హైదరాబాద్‌కు మరో ఎయిర్‌పోర్టు అవసరం
వరంగల్ పట్టణంలో ఎయిర్ పోర్టుకు అదనపు భూమి 253 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని కెటిఆఱ్ తెలిపారు. హైదరాబాద్‌కు మరో ఎయిర్‌పోర్టు అవసరం ఉంది కాబట్టి, నగరంలోని హాకింపేట ఎయిర్‌పోర్టులో గోవా తరహాలో పౌర విమానయాన సేవలు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.అలాగే హైదరాబాద్ నగరం నలువైపులా హైబ్రీడ్ విధానంలో నాలుగు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మహబూబ్‌నగర్‌లో ఉద్యాన కళాశాల ఏర్పాటుకు, నిమ్స్‌లో రూ.1,800 కోట్లతో మరో 2 వేల పడకల ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. వర్షాలు, వరదలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంటనష్టంపై పూర్తి నివేదిక అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలని కేబినెట్ ఆదేశించిందని కెటిఆర్ వివరించారు.

గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను మళ్లీ ఆమోదించి పంపుతాం
గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కేంద్రం రాజకీయాలు చేస్తోందని మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన మూడు బిల్లులను గవర్నర్ ఆమోదించలేదని అన్నారు. గవర్నర్ తిప్పి పంపిన మూడు బిల్లులను వచ్చే అసెంబ్లీ సమావేశాలలో తిరిగి తీర్మానం చేసి గవర్నర్‌కు పంపుతామని మంత్రి కెటిఆర్ తెలిపారు. గవర్నర్‌గా ఎవరు ఉన్నా శాసనసభ రెండోసారి తీర్మానం చేసి పంపిన బిల్లులను ఆమోదించక తప్పదని వ్యాఖ్యానించారు.
అనాథ పిల్లలు ప్రభుత్వ బిడ్డలే
రాష్ట్రంలో అనాథలైన బిడ్డల సంరక్షణను ప్రభుత్వమే తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి కెటిఆర్ ప్రకటించారు. అనాథలను రాష్ట్ర బిడ్డలుగా గుర్తిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం త్వరలో ఓ పాలసీ తీసుకొస్తామని తెలిపారు. మానవీయ కోణంలో పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం అనాథలకు తల్లి, తండ్రిగా ఉంటుందని అన్నారు. అనాథ పిల్లలకు ఒక కుటుంబం ఏర్పడి ప్రయోజకులు అయ్యేంత వరకు, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటవుతుందని మంత్రి కెటిఆర్ వెల్లడించారు.

మున్నేరు వరదకు శాశ్వత పరిష్కారం
మున్నేరు వరదకు శాశ్వత పరిష్కారం చూపే కార్యక్రమంలో భాగంగా సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మున్నేరు కాంక్రీట్ వాల్ నిర్మాణానికి రూ. 150 కోట్లు కేటాయిస్తు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు కట్టనిర్మాణం చేపడితే చాలా మంది ఇళ్ళు కోల్పోవాల్సి వస్తుందని సిఎంకు మంత్రి పువ్వాడ అజయ్ వివరణ ఇచ్చారు. మంత్రి ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన క్యాబినెట్ ఆమోదం తెలిపింది మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు, ఖమ్మం నగర ప్రజల తరుపున ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కృతజ్ఞతలు తెలిపారు. కాంక్రీట్ వాల్ నిర్మాణంతోమున్నేరు బాధితుల కష్టాలు శాశ్వతంగా దూరం అవుతాయన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News