ఏప్రిల్ 3న కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం నలుగురికి కేబినెట్‌లో చోటు
ఆశావహుల్లో ఉత్కంఠ గవర్నర్‌ను కలిసిన సిఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గ విస్తరణపై చర్చలు?
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులతో కలిసి రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేబినెట్ విస్తరణ గురించే సీఎం రేవంత్ గవర్నర్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో గవర్నర్‌తో సీఎం సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఉగాది తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని గత కొన్ని రోజులుగా స్టేట్ పాలిటిక్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌తో భేటీ కావడం ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.
2025, ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగా నలుగురు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేస్తారని సమాచారం. గవర్నర్‌తో సీఎం రేవంత్ భేటీ కావడంతో కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైందని చర్చ జోరందుకుంది. కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 15 నెలలుగా కేబినెట్ విస్తరణ పెండింగ్‌లో ఉండటంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే విస్తరణ చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం, పార్టీ అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ఇందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో పార్టీ పెద్దలతో రాష్ట్ర నేతలు భేటీ అయ్యి మంత్రి వర్గ విస్తరణపై చర్చించారు. సామాజిక సమీకరణాలు, క్యాస్ట్ ఈక్వేషన్స్ వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతం నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈ జిల్లాలకు కేబినెట్లో అవకాశం కల్పించే అవకాశం ఉంది.
ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం ఎవరూ మంత్రి వర్గంలో లేరు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి దాదాపుగా మంత్రి పదవి ఖరారైపోయిందనే ప్రచారం ఉంది. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి ఈ సారి రెండు మంత్రి పదవులు దక్కుతాయనే ప్రచారం ఉంది. రేసులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి చాలా కాలంగా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ముఖ్యంగా తాను హోంశాఖను కోరుకుంటున్నట్టు పదే పదే మీడియా వద్ద ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఆయనకు బెర్త్ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రులుగా ఎవరూ లేరు.
బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి చాన్స్ వస్తుందనే ప్రచారం ఉంది. ముదిరాజ్ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఫిక్స్ అయినట్లు టాక్. ప్రస్తుతం భర్తీ చేయనున్న నాలుగు మంత్రి పదువుల రేసులో ఈ నలుగురు ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటి వరకు అయితే హైకమాండ్ అధికారికంగా మంత్రి పదవుల జాబితాను ప్రకటించలేదు. దీంతో ఆమాత్య యోగం ఎవరికీ దక్కుతుందోనని కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. మరీ ఈ ఉత్కంఠకు తెరపడాలంటే కాంగ్రెస్ హైకమాండ్ మంత్రి పదవుల జాబితా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.