కొత్త రేషన్ కార్డులు
రైతుభరోసా, రైతు
కూలీలకు ఆర్థికసాయంపై
చర్చించే అవకాశం
ఏజెండాలో హ్యామ్‌రోడ్లు,
200 కొత్త గ్రామ పంచాయితీలు
మన తెలంగాణ /హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులకు సమాచారం అందించారు. అవసరమైన సమాచారం సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. కొత్త రేషన్ కార్డులు, రైతుభరోసా, రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12వేల సాయం, గ్రామాల్లో హ్యామ్ రోడ్లు, కొత్తగా 200 గ్రామ పంచాయితీలకు అనుమతి, పంచాయతీ రాజ్ శాఖలో కారుణ్య నియామకాలు, కొత్త మండలాలు ఏర్పాటు, స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ల కోసం ప్రత్యేక కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, పలు పురపాలక సంఘాల్లో గ్రామాల విలీనం, పర్యాటక పాలసీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు, గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా గ్రామ స్థాయి అధికారుల నియామక ప్రక్రియతో పాటు అన్ని శాఖల్లో ఉన్న ఇతర పెండింగ్ అంశాలపై చర్చించే అవకాశం ఉంది.