ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2గం.కు
పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్‌లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఈ సమావేశంలో దళిత బం ధు పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా దళితవాడల్లోని సమస్యలు, అర్హుల జాబితాను అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు దళిత బీమాపై కూడా చర్చించనున్నారు. దీంతో పాటు త్వరలో 50వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశంపై కూడా మరోసారి కేబినెట్‌లో సమగ్రంగా చర్చించే అవకాశముందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రస్తుతం జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 10వ తేదీవరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు వరద నిర్వహణ బృందం ఏర్పాటుపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులు, పంటల సాగుతో పాటు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై సమగ్రంగా మంత్రివర్గం చర్చించనుంది.మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌పై కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన బెడ్స్, మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా సిద్ధంగా ఉండాలని వైద్య అధికారులకు కేబినెట్ సూచించనుందని తెలుస్తోంది.