సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గం.కు
శాసనసభ వర్షాకాల సమావేశాల
తేదీని ఖరారు చేసే అవకాశం
చర్చించి కేబినెట్
ఆమోదముద్ర వేసే సూచన
వరి సేకరణపై కేంద్రం నిర్ణయాన్ని
గురించి చర్చించనున్నట్టు సమాచారం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యవసరంగా ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో జరగనుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే ఈ సమావే శంలో వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించను న్నారు. ప్రధానంగా వర్షాకాల శాసనసభ సమావేశాల తేదీని ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. శాసనసభ, శాసనమండలి సభలు నిబంధనల మేరకు ఈ నెల 25వ తేదీలోగా సమావేశం కావాల్సి ఉంది. ఈ లోగనే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేలా నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే వివిధ బిల్లుల అంశంపై కూడా చర్చ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలను ఈనెల 22 నుంచి నిర్వహించాలని ఇప్పటికే సిఎం కెసిఆర్ సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాలను దాదాపుగా 10 రోజులపాటు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఈ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహం, ప్రతిపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాలి? ప్రధానంగా ఏ అంశాలపై ప్రతిపక్షాలు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది? తదితర అనే విషయాలపై కేబినెట్లో చర్చించనున్నారని తెలుస్తోంది. మరోవైపు యాదాద్రి నిర్మాణ పనులు కూడా పూర్తికావస్తుండడంతో ఆలయ ప్రారంభోత్సవంపై కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.ఇక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు పథకంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఈ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రానికి నాలుగు దిక్కుల్లోని నాలుగు నియోజకవర్గాల్లో ఒక్కొక్క మండలం చొప్పున నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. పంటలసాగు, వరి ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఉద్యోగాల భర్తీ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం జరుగబోతోన్న క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఇక ప్రతి సంవత్సరం రెండు లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు వర్తింప చేయాలని సిఎం భావిస్తున్నారు. ఇతరకులాల్లోని పేదలకు సైతం ఆర్థిక సహాయం అందించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు రెండు రోజుల క్రితం ప్రగతిభవన్‌లో జరిగిన దళితబంధు సన్నాహాక సమావేశంలో కెసిఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.