హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా ముందుకు సాగుతోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఎల్‌బినగర్ నియోజకవర్గంలో మంత్రి కెటిఆర్ పర్యటిస్తున్నారు. నాగోల్ నుంచి బండ్లగూడ వరకు నిర్మించిన బాక్స్‌డ్రైన్‌ను మంత్రి ప్రారంభించారు. ఎస్‌ఎన్‌డిపిలో భాగంగా నాలాలాను అభివృద్ధి చేశారు. ఫతుళ్లగూడ నుంచి ఫీర్జాదిగూడ వరకు లింక్ రోడ్డును ప్రారంభించారు. ఫతుళ్లగూడలో పెంపుడు జంతువుల శ్మశానవాటికను ప్రారంభించారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని, సంపద సృష్టించి పేదలకు పంచుతున్నామని వివరించారు.
తెలంగాణ ఏర్పడక ముందు తలసరి ఆదాయం రూ.1.20 లక్షల మాత్రమేనని, తెలంగాణ ఏర్పాటు తరువాత ఏడేళ్లలో తలసరి ఆదాయం రూ.2.70 లక్షలకు చేరిందన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో తెలంగాణ నుంచే 20 గ్రామాలు అవార్డులు సొంతం చేసుకున్నాయని ప్రశంసించారు. తెలంగాణలో గ్రీన్ కవర్ 31.7 శాతానికి చేరిందన్నారు. తెలంగాణలో ఏ పల్లె పట్టణానికి పోయినా పచ్చదనమే కనిపిస్తోందని కొనియాడారు. నాలాల పునరుద్ధరణతో ముంపు సమస్య తీరిపోయిందన్నారు. డిసెంబర్ చివరి నాటికి ఎస్‌ఎన్‌డిపి కింద 17 నాలాల పనులు పూర్తి చేస్తామన్నారు. ఎస్‌ఎన్‌డిపి రెండో దశ పనులు కూడా త్వరలో చూపడుతామని, రెండో ఫేజ్ కింద నాగోల్ నుంచి ఎల్‌బి నగర్ మెట్రో విస్తరణ చేపడుతామన్నారు. ఎల్‌బి నగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో రైల్ విస్తరణ చేపడుతామని వివరించారు.