Saturday, January 11, 2025

సరిలేరు మీకెవ్వరూ.. సార్

- Advertisement -
- Advertisement -

‘దీనులారా… హీనులారా.. కూడులేని, గూడులేని పక్షులారా, భిక్షులారా.. హతాశులై ఏడవకండేడవకండి పతితులా రా భ్రష్టులార ఏడవకండేడవకండి వస్తున్నాయొస్తున్నాయి జగన్నాథ… జగన్నాథ రథ చక్రాల్..’ అని విప్లవ కవి శ్రీశ్రీ పేదలకు, దీనులకు మరో ప్రపంచం చూపినట్టుగా చంద్రోదయంతో తెలంగాణ ప్రజల జీవితాల్లో మరో సరి కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. దేశ రాజకీయాల్లో విప్లవం…. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనొక యోధుడు. జనహోరుని చూసి మైమరచిపోయి తొడగొట్టే హీరో కాదాయన. సినిమాల్లో విలన్ల ముందు తిప్పినట్టు జనం ముందు మీసాలు మెలేసే పాత కాలపు కథానాయకుడు అసలే కాదు. ఇచ్చిన మాట మీద నిలబడే నిజమైన నాయకుడు.

తెలంగాణ గడ్డ మీద పడి దోచుకుంటున్న నాయకులను చూసి సహించలేకపోయిన ఉద్యమనేత. పదేళ్ళపాటు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి సాధించుకున్న ధీరుడు. ఆయన తొమ్మిదేళ్ళ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతిని చూసి దేశమే నివ్వెరపోయింది. అందుకే ఇపుడాయన హీరో. దేశంలోని కోట్లాది మంది ప్రజలు అభిమానిస్తున్న నిజమైన కథా నాయకుడు. ఈరోజు ఆయన ఒక శక్తి. ఇపుడు ఆయన పేరు తలవనిదే ఆయనను అభిమానించే వారికే కాదు శత్రువులకూ రోజు గడవదు. ఆయనే భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. చెదిరిపోని గుండె బలం.. నాయకత్వానికి నిలువెత్తు రూపం.. మేరునగ ధీరుడు మన కెసిఆర్. ఆ పాదం అడుగిడిన నేలంతా అయింది సస్యశ్యామలం.. అడుగంటిన భూగర్భ జలాలతో కరువుకు నిలయంగా మారిన తెలంగాణ నేడు అన్నపూర్ణగా ప్రసిద్ధికెక్కింది. అన్నదాతల మోముపై చిరునవ్వులు విరబూయించారు. ఆయన జీవితం ఎందరో నాయకులకు పాఠ్యపుస్తకం.

మాట తప్పని తీరు పేదల జీవితాల్లో వెలుగులు నింపింది.ఆయన నైజం ప్రత్యర్ధులకు సింహస్వప్నం అయింది. మనిషిని బట్టి ఆలోచన, ఆలోచనను బట్టి పని, పనిని బట్టి ఫలితం. ఇది రాజకీయ నాయకులకు వర్తిస్తుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు నుంచి గమనిస్తే ఆయా రాష్ట్రాల్లో గాని, దేశ స్ధాయిలో గాని నాయకులను బట్టి మంచో చెడో జరుగుతూ వచ్చాయి. నాయకుడి మనసు మంచిదైతే ప్రజల జీవితాలకు భరోసా దొరుకుతుంది. జీవించే స్వేచ్ఛ లభిస్తుందనడానికి గత తొమ్మిదేళ్ళ కెసిఆర్ పాలనే నిదర్శనం.
ఎందరికో అసాధ్యమైన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథ సారథిగా తెలంగాణ రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిరస్థానం ఏర్పరచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కెసిఆర్) ఓ పాలకుడే కాదు. ప్రజా సేవకుడు కూడా. ఇది కదా యావత్ దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా పాలనలో తనకు సాటిలేరని నిరూపించిన అపర చాణక్యుడు. గత తొమ్మిదేళ్ళ పాలనలో అనేక చరిత్రాత్మక చట్టాలు చేశారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు కెసిఆర్.
తెలంగాణలోని అన్నివర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు.

సంక్షేమ రథాన్ని కదిలించి ప్రతిపేదవాడి గడపలో వెలుగులు నింపారు. బంగారు తెలంగాణ చేయాలన్న తన చిరకాల స్వప్నం సాధనకు అనుక్షణం పరిశ్రమిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై అవమానాలతో జీవనం సాగిస్తున్న తెలంగాణ ప్రజలకు కెసిఆర్ వెలుగు దివ్వెట మాదిరిగా నిలిచారు. తెలంగాణ ప్రగతి ప్రస్ధానం దేశానికే నమూనా నిలిపిన మహనీయుడు కెసిఆర్. ఆయన దార్శనిక పాలన, ప్రగతి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజా జీవితాల్లో గుణాత్మక మార్పువచ్చింది. ప్రజాసంక్షేమం అభివృద్ధి ధ్యేయం గా కెసిఆర్ కనబరిచిన రాజనీతికి తెలంగాణ ప్రగతి ఒక కొలమానంగా చెప్పాలి. తెలంగాణలోని సబ్బండ వర్గాల జీవితాల్లో వెల్లివిరుస్తున్న సుఖసంతోషాలే అందుకు నిదర్శనం. సంకేమం కోసం గత తొమ్మిదేళ్ళలోనే రూ. 5 లక్షల కోట్ల వ్యయం చేసి చరిత్రను తిరగరాసిన ధీశాలి కెసిఆర్. అలాగే ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణలోని ప్రాజెక్టులపై చేసిన వ్యయం రూ 38,405, 12 కోట్లు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్ళలోనే కెసిఆర్ సర్కారు చేసిన ఖర్చు ఏకంగా రూ. 1,55,210,86 కోట్లు. అంటే నీటి పారుదల రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి అన్నపూర్ణ రాష్ట్రంగా మార్చిన రైతు బాంధవుడు కెసిఆర్.
సంక్షేమంలో స్వర్ణయుగం సాధించిన కెసిఆర్ అభాగ్యుల ఆవేదనను తీర్చేలా ఆసరా అందించిన ఆపద్బాంధవుడు. కేంద్రం మోకాలొడ్డుతున్నాగాని మొక్కవోని ధైర్యంతో ముందడుగులు వేస్తూ పథకాలను అమలు చేసి విశ్వసనీయతకు మారుపేరుగా పాలన కొనసాగించారు.

అందుకే ఆయన తొమ్మిదేళ్ళపాలన సువర్ణాక్షరాలతో లిఖించబడే విధంగా సాగిందనే చెప్పాలి. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలన్న ఆలోచనకు కెసిఆర్ రాజకీయాలు జోడించలేదు. రాజకీయాల కోసం రాజకీయాలు చేస్తూ పాలనా కాలాన్ని కరిగించని తత్వవేత్త కెసిఆర్. అందుకే దేశంలోని జనం హృదయాల్లో కెసిఆర్ ది సుస్ధిర స్ధానం. తొమ్మిదేళ్ళ పాలనలో తెలంగాణ ప్రజల మనసులను గెలవడమే కాదు దేశంలోని కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా నిలిచారు. శతాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన నాయకులవి కేవలం రాజకీయ కోణపు ఆలోచనలే. వారి ఆలోచనల్లో ప్రజలకు పంచిది కేవలం ‘పప్పు బెల్లాలే’. అవి కూడా గుప్పెడంటే గుప్పెడే అన్న చందంగా పాలించారు. అయితే కెసిఆర్ లాంటి ముందుచూపున్న నేత ఒక్కరు ఉంటే చాలు తమ జీవితాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతాయనే అభిప్రాయం దేశ ప్రజల్లో వ్యక్తమవుతున్నది. ప్రజా సంక్షేమమే పరమావధిగా భావిస్తూ ప్రజా శ్రేయస్సు కోసం క్షణం తీరికలేకుండా ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నమైన కెసిఆర్ కోసం జాతి యావత్ ఆశగా ఎదురుచూడడం గొప్ప విషయం.

మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు తర్వాత దేశంలో ఇంతటి పేరు ప్రఖ్యాతులు సాధించిన రాజకీయ దురంధరుడు కెసిఆర్ ఒక్కరే. అందుకే దేశ ప్రజలు కెసిఆర్‌కు నీరాజనాలు పలుకుతున్నారు. ఆయనకు ఆయనే సాటి. దటీజ్ కెసిఆర్, కెసిఆర్ ఆలోచనల్లో స్పష్టత ఉంది. దేశంలోని వాస్తవ పరిస్ధితులపై సంపూర్ణ అవగాహన ఉంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో భారతదేశ దశ, దిశ మారతాయనే విశ్వాసం ప్రజలకు ఉంది. అలాగే దేశ భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దగలననే నమ్మకం కెసిఆర్‌కు ఉంది. అందుకే దేశ ప్రజలకు ఆయన నాయకత్వం పై భరోసా ఏర్పడింది. చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలకు ఓటమి లేదన్నది చరిత్ర చాటుతున్న సత్యం. రేపటి దేశ చరిత్రలో మరోసారి కెసిఆర్ నాయకత్వంలో సత్యం కాబోతోంది. ప్రస్తుత తరుణంలో టార్చిలైటు వేసి వెతికినా కెసిఆర్‌కు సాటిఎవ్వరూ లేరు. రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించి మరో సరి కొత్త రాజకీయ అధ్యాయానికి నాంది పలకాలన్న కెసిఆర్ లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం…

కోలేటి దామోదర్
(చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ లిమిటెడ్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News