Friday, November 22, 2024

రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -
Telangana CM KCR to hold Cabinet meeting tomorrow
సిఎం కెసిఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్‌లో ప్రారంభం
కొత్త వేరియెంట్, ధాన్యం కొనుగోళ్లు, యాసంగ పంటల సాగుపై ప్రధాన చర్చ
దీనిపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా ముంచుకొస్తున్న కొత్త కోవిడ్ వేరియెంట్ ఒమిక్రాన్ (థర్డ్ వేవ్)పై కూలంకషంగా చర్చించే అవకాశముందని తెలుస్తోంది. ఈ వేరియంట్‌పై కేంద్రం కూడా అప్రమత్తమైంది. దాని వ్యాప్తిని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలను అలర్ట్‌గా ఉండాలని స్పష్టమైన హెచ్చరికలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒమిక్రాన్‌పై పూర్తిస్థాయిలో అలర్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వేరియంట్ ప్రభావం, రాష్ట్రంలో పరిస్థితులు, నియంత్రణ చర్యలు, వైద్యారోగ్యశాఖ సన్నద్ధత వంటి అంశాలను మంత్రివర్గంలో కూలంకషంగా చర్చించనున్నారు. గతంలో కరోనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందుగానే ఆంక్షలు విధించే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. పారా బాయిల్ బియ్యం కొనబోమని కేంద్రం మరోమారు స్పష్టం చేసిన నేపథ్యంలో యాసంగిలో సాగు చేయాల్సిన పంటలపై సమావేశంలో చర్చించనున్నారు. యాసంగి పంటల సాగుకు సంబంధించి ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. గత కొంతకాలంగా వరి ధాన్యం కొనుగోళ్లపై ఉన్న అనిశ్చితి పరిస్థితి నెలకొనన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ రెండు రోజుల క్రితం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకునే వారు సొంత రిస్క్‌తో వరిసాగు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్న ఆయన.. అవసరమైన చోట కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనిపై మంత్రి మండలి సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. అలాగే ఆర్‌టిసి ఛార్జీల పెంపు, విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర కేబినెట్ కీలకంగా చర్చించనుంది. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి వచ్చిన సిఎం కెసిఆర్… పర్యటన పరిణామాలను కూడా వివరించనున్నట్లు సమాచారం.
వీటితో పాటు పోడు భూముల సమస్య పరిష్కారం, ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించేలా సాయం కోరుతున్న ఎల్ అండ్ టి మెట్రో తదితర అంశాలపైనా చర్చ జరగనుందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ మంజూరు, జోనల్ విధానం ప్రకారం వర్గీకరణ, ఉద్యోగ నియమాకాల అంశాలూ చర్చకు వచ్చే అవకాశముందని వినిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News