Monday, December 23, 2024

కాంగ్రెస్‌తో పొత్తు.. రెబల్స్ ముప్పు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ఆయా పార్టీలు గెలుపుకోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అధికారం కైవసం చేసుకునేందుకు వ్యుహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా తమతో కలిసి వచ్చే పార్టీలతో జత కట్టి ఎన్నికల సమరంలో తలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అధికార బిఆర్‌ఎస్ పార్టీ నెల రోజుల కితం 115 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించి ఎన్నికల పోరుకు కాలు దువ్వుతుంది. మూడోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్‌రావు అధికార పగ్గాలు చేడుతారని ఆపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో పేర్కొంటున్నారు. ఈసారి 100కు పైగా సీట్లు సాధించి మరో చరిత్ర సృష్టిస్తామని విపక్షాలకు సవాల్ విసురుతున్నారు. బిఆర్‌ఎస్ దాడికి తట్టుకోలేక విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపి,కమ్యూనిస్టులు, బిఎస్పీ వంటి పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తే సింగిల్ సీట్లకే పరిమితమైతామని భావిస్తూ జత కట్టేందుకు చర్చలు జరుపుతున్నారు. పోత్తు కోసం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరాట పడుతున్నారు.

కమ్యూనిస్టులు, బహుజన సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేసి అధికార దక్కించుకునేందుకు తంటాలు పడుతున్నారు. కానీ ఈరెండు పార్టీలకు చెందిన నాయకులు హస్తం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజల్లో ఉన్న ఉనికి కూడా కోల్పోతామని, కలిసి పోటీ చేద్దామని ప్రకటనలు చేసి నామినేషన్ వేసే సమయంలో రెబెల్స్‌ను ప్రోత్సహించి తమ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు చేస్తారని బిఎస్సీకి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జీలు విమర్శిస్తున్నారు. ఈరెండు జాతీయ పార్టీలు కావడంతో ఢిల్లీ నుంచే పొత్తులపై చర్చలు జరుగుతున్నట్లు లీకులు రావడంతో ఆపార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్‌తో పొత్తు కంటే ఒంటరిగా ఎన్నికల బరిలో ఉంటే కనీసం ఐదారు సీట్లు గెలిచి అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాడ వచ్చని పేర్కొంటున్నారు. గతంలో కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల సమరంలో నిలిచిన పార్టీలు ఓటమి చవిచూశారని అలాంటి పరిస్థితులుకు తమ పార్టీకి రావద్దని ఆపార్టీ అధ్యక్షునికి సూచిస్తున్నారు.

2004లో దివంగత సిఎం వైస్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిస్టులు, అప్పటి టిఆర్‌ఎస్ పార్టీలు కలిసి పోటీ చేస్తే పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తిరుగుబాట్లు పోటీ చేసి అభ్యర్థులను ఓడించారని, అదే విధంగా 2014లో కూడా మహాకూటమి పేరుతో కాంగ్రెస్,టిడిపి,కమ్యూనిస్టులు,తెలంగాణ జన సమితి కలిసి పోటీ చేస్తే 20 నియోజకవర్గాల్లో టిడిపి, కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులకు సహాకరించకుండా ఓటమి చెందే విధంగా వ్యతిరేకంగా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీతో జత కడితే ఈవిధంగా ఉంటుందని ఆపార్టీ నాయకులు బహిరంగ విమర్శలు చేశారని గుర్తు చేస్తున్నారు. ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిస్తే ఆశించిన ఫలితాలు రాలేని పరిస్ధితి ఉంటే అధికార గులాబీ పార్టీతో కలిసి పోతే నాలుగైదు సీట్లు గెలుస్తామని పేర్కొంటున్నారు. హస్తం పార్టీతో స్నేహం చేస్తే ఇన్నాళ్లుగా పార్టీని బలోపేతం చేసిదంత శూన్యమైతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోత్తుల ముసుగులో చిన్న పార్టీలను కాంగ్రెస్ కనుమరుగు చేస్తుందని ఆరోపిస్తున్నారు.

మొన్నవరకు అధికార బిఆర్‌ఎస్‌తో ఎన్నికల వెళ్లుతామని పేర్కొన్నా క్రామేడ్లు ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడంతో గులాబీ బాసు వారిని పక్కకు పెట్టాడు. వెంటనే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పంచన చేరేందుకు ఆపార్టీ నేతలతో మంతనాలు మొదలు పెట్టారు. వారు కూడా మీ పార్టీకి ఉన్న బలం చాలా తక్కువని, చెరోకటి అసెంబ్లీ సీట్లు ఇస్తామని, అధికారం చేపడితే రెండు ఎమ్మెల్సీ స్ధానాలు ఇస్తామని దీంతో సర్థుక పోవాలని సూచించారు. కానీ కమ్యూనిస్టు నుంచి పలు నియోజకవర్గాల్లో సీట్లు ఆశించిన నాయకులంతా కాంగ్రెస్ పార్టీతో పోత్తు వద్దని ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటుదామని పేర్కొంటున్నట్లు ఆపార్టీకి చెందిన సీనియర్లు చెబుతున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్మఖ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News