Monday, January 13, 2025

శాసనసభ్యులకూ.. ఉత్తమ అసెంబ్లీ పర్సన్ అవార్డు

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం పరిశీలిస్తోందన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రజాప్రతినిధులు, ప్రజలకు మధ్య దూరం పెరిగింది
అందుకు పిఎలు, పిఆర్‌ఓలు, గన్‌మెన్లే కారణం మండలి చైర్మన్ గుత్తా సంచలన వ్యాఖ్యలు ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డిలో
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు ప్రారంభం

మన తెలంగాణ/హైదరాబాద్: అర్ధవంతమైన చర్చలతో శాసనసభ, మండలి సమావేశాలు జరగాలని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో శాసన సభ, మండలి సభ్యులకు శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసన సభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ పార్లమెంటేరియన్ మాదిరిగా ఉత్తమ అసెంబ్లీ పర్సన్ అవార్డు పరిశీలన చేస్తామని వెల్లడించారు. గతంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వెంకయ్యనాయుడు వంటి గొప్ప వ్యక్తులు బాగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. గతంలో శాసనసభ సమావేశాలు ఉంటే సినిమా రిలీజ్ వాయిదా వేసుకునేవారన్నారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలది క్రియాశీల పాత్ర అని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలను రూపొందించాల్సిన బాధ్యత శాసన సభ్యులపై ఉంటుందన్నారు.

చట్టాల రూపకల్పనతో పాటు వాటి అమలు తీరు, ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయని కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. గతంలో సీనియర్ సభ్యులు శాసనసభలో మాట్లాడుతున్నప్పుడు నూతన సభ్యులకు ఇన్సిపిరేషన్‌గా ఉండేదని, రోశయ్య, రజీబ్ అలీ, బోడేపూడి వెంకటేశ్వరరావు, చెన్నమనేని విద్యాసాగర్ రావు, ఓంకార్, వైయస్ రాజశేఖర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, నర్రా రాఘవ రెడ్డి వంటి వారు గొప్ప వక్తలుగా పేరు తెచ్చుకున్నారన్నారు. సభలో మాట్లాడడానికి సమాచారం, వాగ్ధాటితో పాటుగా సభా వ్యవహారాలు, నిబంధనలపై అవగాహన ఉండాలని వివరించారు. ముఖ్యంగా జీరో అవర్, కొశ్చన్ అవర్, రిజల్యూషన్స్, అడ్జర్న్‌మెంట్ మెన్షన్స్, పాసింగ్ ఆఫ్ బిల్స్, పాసింగ్ ఆఫ్ బడ్జెట్, సభ్యుల మర్యాదలు, ప్రోటోకాల్, వ్యవహారాలు వంటి ముఖ్యమైన కార్యకలాపాలపై సభ్యులకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలని తెలిపారు. ఢిల్లీకి చెందిన పీఆర్‌ఎస్ ఇన్‌స్టిట్యూట్ కు దేశంలోని లెజిస్లేచర్ వ్యవస్థలు, వ్యవహారాలపై పూర్తి స్థాయి పట్టు ఉందని, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ఉన్నారని, ఈ సంస్థ వారు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని శాసనసభ్యులకు ఓరియెంటెడ్ ప్రోగ్రాంలు నిర్వహించారన్నారు. ఈ రెండు రోజుల అవగాహన సదస్సు మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సభ్యులంతా తప్పనిసరిగా పాల్గొని సభ వ్యవహారాలపై అవగాహన తెచ్చుకోవాలని కోరారు.

ప్రస్తుత రాజకీయాలు చూస్తే ఆవేదన కలుగుతోంది :గుత్తా సుఖేందర్ రెడ్డి
ప్రస్తుత రాజకీయాలు చూస్తే ఆవేదన కలుగుతోందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గాలివాటం రాజకీయాలు మొదలయ్యాక కొత్త ఎమ్మెల్యేలే సభలోకి వస్తున్నారని, ఎన్నికలు ఖరీదైనవిగా మారిపోయాయన్నారు. తాము సభాపతిగా ఉన్నా సభ ఎన్ని రోజులు నడపాలనే నిర్ణయం ప్రభుత్వానిదేనని, ప్రభుత్వం ఎక్కువ రోజులు సభ నిర్వహించాలనుకుంటే ఎక్కువ రోజులు నడుస్తుందని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మధ్య దూరం పెరగడానికి, ఎన్నికల్లో ఓడిపోవడానికి వాళ్ల పీఏలు, పీఆర్వోలు ప్రధాన కారణమవుతున్నారని సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడేందుకు ప్రజలు లేక మరెవరైనా ఫోన్ చేస్తే పీఏలు, పీఆర్వోలు దురుసుగా మాట్లాడతారని, తద్వారా వారిపై కోపం ప్రజాప్రతినిధులపై కోపంగా మారిపోతుందన్నారు. గన్ మెన్లతో కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తోందన్నారు.

గెలవగానే పక్కకి వచ్చి చేరే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని, కాబట్టి స్వయంగా ప్రజాప్రతినిధులే ప్రజలతో ఫోన్ లో టచ్‌లో ఉండాలని గుత్తా సూచించారు. ప్రజా ప్రతినిధి పదవి అనేది మహోన్నత పదవి. అందరికీ ఈ పదవి దక్కదు. అదృష్టం ఉన్న వారికి మాత్రమే దక్కుతుందన్నారు. గత పది సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి ఒరియెంటెషన్ కార్యక్రమాలను నిర్వహించలేదని, నేటి ప్రభుత్వ హయాంలో నిర్వహించుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలిచిన తరువాత ప్రమాణస్వీకారం రోజునే ఐడి కార్డ్ తో పాటు రూల్స్ అండ్ రెగులేషన్స్ పుస్తకాలు ఇస్తామని, కానీ వాటిని ఎవరు కూడా చదవడం లేదని, లేజిస్లేచర్ కి సంబంధించిన పుస్తకాలు తప్పకుండా చదవాలన్నారు. ఇప్పుడు ఉన్న 119 ఎమ్మెల్యేల్లో 57 మంది నూతనంగా ఎన్నికైన వారే ఉన్నారని, వారందరూ ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంబీబీఎస్ చదివితే డాక్టరు అవుతారని, ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్ అవుతారని, అలాగే ప్రజల మనస్సు చదివితేనే ప్రజా ప్రతినిధులం అవుతామన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి సభకు రాకుండా దూరంగా ఉండటం రాజ్యాంగ విలువలను అవహేళన చేయడమేనని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

శాసనసభ ఏ ఒక్కరిదో కాదని, ఈ ట్రైనింగ్ సెషన్స్ అందరికీ ఆహ్వానం పంపామని తెలిపారు. శాసనసభ అందరికీ అని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌దో వేరే ఇంకా ఎవరిదో కాదన్నారు. మొదటిసారి ఎన్నికైన శాసనసభ్యులు 57 మంది శాసన సభలో ఉన్నారని, వారికి సీనియర్ సభ్యులు ఆదర్శంగా ఉండాలన్నారు. తాను మొదటిసారి ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉందని, ఎప్పుడు మాట్లాడే అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూసేవాళ్లమన్నారు. తాను నాలుగోసారి సభలో ఉన్నప్పుడు పీఏసీ ప్రతిపక్షానికి ఇవ్వలేదని గుర్తు చేసుకున్నారు. కేటీఆర్ ప్రతీది రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల శిక్షణా తరగతులకు రావొద్దని కేటీఆర్ చెప్పారని దీన్ని బట్టి ఆ పార్టీ మానసిక స్థితి ఏంటో తెలుస్తుందన్నారు.

కేటీఆర్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు : మంత్రి ఉత్తమ్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులను బీఆర్‌ఎస్ బాయ్ కాట్ చేయడం సరికాదన్నారు. అన్నింటికి రాజకీయ రంగు పులమడం మంచిది కాదని దుయ్యబట్టారు.
ఇవాళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతుల సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహం తొలిగించే అవకాశం బీఆర్‌ఎస్ కు రాదన్నారు. ఈ రాష్ట్రంలో మరో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నా గేశ్వరరావు , పొన్నం ప్రభాకర్ , తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డాక్టర్ నరసింహా చార్యులు, 65 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News