Monday, December 23, 2024

ఈ వేసవిలోనూ నిరంతర విద్యుత్

- Advertisement -
- Advertisement -

* కరెంటు కోతలుండకుండా చూస్తున్న తెలంగాణ సర్కారు
* ఛత్తీస్‌ఘడ్ నుండి నిలుపుదల చేసినా సరే
* జల విద్యుత్ ఉత్పత్తిపై విద్యుత్ శాఖ దృష్టి
* ఉత్పత్తి లక్ష్యాలను చేరుకుంటున్న టిఎస్ జెన్‌కో

మన తెలంగాణ / హైదరాబాద్ : ఫిబ్రవరి నుండే శీతాకాలం ముగిసి వేసవి సీజన్ రానే వస్తోంది. రాత్రిళ్లు కాస్త చలి ఉంటున్నా పగలు మాత్రం అప్పుడే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో.. అప్పుడే అందరూ రానున్నవేసవిని దృష్టిలో ఉంచుకుని ఏసీలు, కూలర్లను బయటకు తీస్తున్నారు. కొందరు ఇప్పటికే వాటి వాడకం కూడా అప్పుడే మొదలు పెట్టడంతో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోంది. కిందటి సంవత్సరం మాదిరే ఈ సారి ఎండాకాలంలోనూ విద్యుత్‌కు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశాలు ఉంటాయని విద్యుత్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎండా కాలంలో సాధరణంగానే విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండేవి. ఇప్పటి మాదిరే వేసవికి విద్యుత్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పాటు జల విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉండడం వల్ల కోతలు అనివార్యమయ్యేది. మరి ఈ సారి తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటుంది? డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా అవుతుందా? లేదంటే ఛత్తీస్‌ఘడ్ నుండి కరెంటు సరఫరా కానందున విద్యుత్ కోతలకు ఛాన్స్ ఉండే అవకాశాలు ఉంటాయా? అన్న ప్రశ్నలు తాజాగా ఉత్పన్నం అవుతున్నాయి. అయితే విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం… ఈ సారి కూడా నిరంతర విద్యుత్‌ను అందజేస్తామని, కోతలకు ఛాన్సే లేదని వారు చెబుతున్నారు. విద్యుత్ సంక్షోభం రాకుండా అవసరానికి సరిపడా విద్యుత్‌ను అందుబాటులో ఉంచుకుంటున్నామని, మన జల విద్యుత్ ఉత్పత్తినే ఇందుకు నిదర్శనమని వారు వివరిస్తున్నారు.

ఎండా కాలం పెరగనున్న గృహ విద్యుత్ వినియోగం

తెలంగాణలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సరాసరిన 30 నుండి 40 శాతం వరకు వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. వరి సాగు విస్తీర్ణం తగ్గించాలని ప్రభుత్వం చెబుతుండడంతో అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. తాము చెబుతున్నట్లు వారు నడుచుకుంటున్న ఈ క్రమంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వేసవిలో ఎప్పటిలాగే కరెంటు కోతలు లేకుండా చూడాలని ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేసింది. ఛత్తీస్‌ఘడ్ నుండి సరఫరా అవుతున్న విద్యుత్ కొన్ని కారణాల వల్ల నిలుపుదల చేయగా ప్రభుత్వం ఇందుకు ప్రత్యామ్నాయాలను చూసుకుంటోంది. తెలంగాణలో ఇప్పటికే వ్యవసాయానికి కరెంటు వాడకం కాస్త తక్కువ అయిందని, వ్యవసాయానికి వాడే కరెంటు ఎంత లేదన్న 30 శాతం వరకు తగ్గిందని విద్యుత్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. వేసవి నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ ,మే మాసాల్లో గృహ విద్యుత్‌ను ఎక్కువగా వాడతారని అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి ఉండేలా చూడాలని
ప్రభుత్వం చెబుతోంది.

ఛత్తీస్‌ఘడ్ కరెంటు బంద్ !

రాష్ట్రానికి ఛత్తీస్‌ఘడ్ నుంచి సరఫరా అవుతున్న కరెంట్ బంద్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటోంది. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఒక్క యూనిట్ కూడా చత్తీస్‌ఘడ్ రాష్ట్రం తెలంగాణకు సరఫరా చేయాలేదు. ధరతో పాటు బకాయిలను ఛత్తీస్‌ఘడ్ భారీగానే పెంచేయగా, తెలంగాణ డిస్కంలు ఇందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు చేస్తున్న విజ్ఞప్తులను చత్తీస్‌ఘడ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సిఎస్‌పిడిసిఎల్ నిరాకరిస్తోందంటున్నారు. తెలంగాణ డిస్కంలు సిఎస్‌పిడిసిఎల్ మధ్య జరిగిన దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పిపిఏ) ప్రకారం రాష్ట్రానికి సుమారుగా 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కావాల్సి ఉంది. 2020-21లో 39.65 శాతం, అలాగే 2021-22లో కేవలం 1.630 మిలియన్ యూనిట్లు ( 19 శాతం) విద్యుత్ మాత్రమే ఛత్తీస్‌ఘడ్ సరఫరా చేసింది. 2022-23లో పూర్తిగా నిలిపివేసింది. తాజాగా ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు, తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టిఎస్‌ఈఆర్‌సి)కి నివేదించాయి. ఒక వేళ చత్తీస్‌ఘడ్‌తో వివాదాలు గనుక సద్దుమణిగితే 2022-23 రెండో ఆర్థిక సంవత్సరంలో 2,713 ఎంయూల (31శాతం ) విద్యుత్ సరఫరా జరగవచ్చని అంచనా వేస్తున్నామంటున్నాయి.

జోరందుకుంటున్న జల విద్యుత్ ఉత్పత్తి

వేసవిలో కోతలు లేకుండా చేసేందుకు విద్యత్ శాఖ రాష్ట్రంలో విండ్ పవర్‌తో పాటు జల విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారిస్తోంది. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా చూసుకోవాలని, ఏ సమస్య ఉన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యుత్ శాఖను ఆదేశించడంతో వారు జల విద్యుత్ ఉత్పత్తి నిరాటంకంగా సాగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని జల విద్యుత్ కేంద్రాల వద్ద విద్యుత్ ఉత్పత్తి జోరుగా సాగుతోంది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి హైడల్ పవర్ ప్లాంట్లు రికార్డు స్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో శనివారం నాటికి 5,670 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరిగింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో 5,445 మిలియన్ యూనిట్ల లక్షాన్ని పెట్టుకోగా మరో రెండు నెలలు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని దాటేశారు. 2019-20లో 3,963 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగగా 2020-21 లో అది 3,665 మిలియన్ యూనిట్లు, 2021-22లో అత్యధికంగా 5,655 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఇప్పటి వరకు జెన్‌కో చర్రితలోనే ఇది రికార్డు అని జెన్ వర్గాలు మన తెలంగాణకు తెలిపాయి. అయితే ఈ సీజన్ ముగిసే నాటికి 6 వేల మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రియ దర్శిని జూరాల ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని మొత్తం తొమ్మిది ప్రాజెక్టుల 11 జలవిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. కాగా పలు కారణాల వల్ల శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో 2020 ఆగస్టు 20న జరిగిన అగ్ని ప్రమాదంలో సంస్థకు భారీగా ఆస్తినష్టం సంభవించింది. దాంతో ఆ కేంద్రంలో ఒక యూనిట్ అయితే ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. 150 మెగావాట్ల సామర్ధం కలిగిన ఆ యునిట్ రెండున్నరేళ్లుగా పని చేయడం లేదు. దీంతో ఏడాదికి సగటున 400 మిలియన్ యూనిట్ల చొప్పున రెండేళ్లలో దాదాపుగా 800 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News