Monday, December 23, 2024

తెలంగాణ అప్పుల చిట్టా విప్పిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.4.33 లక్షల కోట్ల అప్పులు చేసిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర సర్కార్ చెప్పింది. అవిర్భావ సమయంలో అతి తక్కువ అప్పులతో ఉన్న రాష్ట్రం నేడు లక్షల కోట్ల అప్పులు చేసిందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని పేర్కొంది. 2021-22 నాటికి రూ.2.83 లక్షల కోట్లుగా ఉన్న తెలంగాణ అప్పులు… 2022 అక్టోబర్ నాటికి రూ. 4.33 లక్షల కోట్లకు చేరిందని.. కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి.. తెలంగాణ అప్పుల చిట్టాను వివరించారు. 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలే రూ.1.3 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. 2014లో తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్ర అప్పులు రూ.75,577 కోట్లు ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.2.83 లక్షల కోట్లకు పెరిగాయని, 2022 అక్టోబర్ నాటికి రూ.4.33 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పు అని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేస్తోందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీసే పరిస్థితులు తీసుకొస్తోందని బిజెపి, కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మిగులు బడ్జెట్ తో ఏర్పాటైన రాష్ట్రాన్ని నేడు అత్యధిక అప్పులున్న రాష్ట్రాల జాబితాలో చేర్చారని విపక్ష నేతలు బిఆర్‌ఎస్ సర్కార్‌పై విరుచుకుపడుతున్నారు. తెచ్చిన అప్పులను కూడా సరైన రీతిలో వినియోగించడం లేదని, యథేచ్ఛగా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యపడుతున్నారు. ఈ విమర్శలను తెలంగాణ సర్కార్ తిప్పికొడుతోంది. తమ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ వేదికగా సమర్ధించుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్ పై విపక్షాల సందేహలకు సమాధానమిచ్చిన సమయంలో అప్పలు గురించి ఆయన ప్రస్తావించారు. తమ ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఉత్పాదక రంగాల కోసం ఖర్చు చేస్తున్నామని గుర్తు చేశారు. కాళేశ్వరం వంటి భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం అప్పులు తెచ్చి ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఈ అప్పులు రాష్ట్ర అభివృద్దికి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం తెచ్చిన అప్పులను రోజువారీ ఖర్చులకు ఉపయోగిస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంమ చేసిన అప్పులను రాష్ట్రంలో ఉత్పాదక రంగంపై ఖర్చు చేయడం ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుందని వివరించారు. రాష్ట్రంలో ఉత్పాదక రంగం అభివృద్ది చెందితే ప్రజలకు ప్రయోజనమని ఆర్ధిక శాఖ మంత్రి ప్రకటించిన విషయం విదితమే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News