Monday, December 23, 2024

పరిమితుల్లోనే తెలంగాణ అప్పులు

- Advertisement -
- Advertisement -


మన తెలంగాణ / హైదరాబాద్ : డబుల్ ఇంజన్ రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతుందని మైకుల ముందు బీరాలు పలుకుతున్న బిజెపి నాయకుల మాటలు నీటి మూటలేనని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ బిజెపి పరిపాలన సాగుతున్న డబుల్ ఇంజన్ రాష్ట్రాల్లో ఆర్ధిక వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో స్పష్టం చేయడమే కాకుండా ఆ రాష్ట్రాల ఆర్ధిక నిర్వహణ దారుణంగా ఉందని ఆర్.బి.ఐ. నివేదిక పేర్కొంది. “మేడి పండు చూడ మేలిమిగా ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు” అనే సామెత డబుల్ ఇంజన్ రాష్ట్రాలకు కరెక్టుగా సరిపోతుందనే విమర్శలున్నాయి. బి.జె.పి. పాలనలో ఉన్న ఉత్తర ప్రదేశ్ 2022-23వ ఆర్ధిక సంవత్సరంలో గత జూన్ నెలాఖరు వరకూ ఏకంగా 32.5 శాతం వరకూ అప్పులు చేసిందని, అదే విధంగా మరో బిజె.పి. పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ కూడా 33.3 శాతం వరకూ అప్పులు చేసింది. బీహార్ రాష్ట్రమైతే ఏకంగా 38.7శాతం, ఆంధ్రప్రదేశ్ 32.8 శాతం, హర్యానా 33 శాతం, ఛత్తీస్‌గఢ్ 27 శాతం మేరకు అప్పులు చేశాయి. కర్ణాటక రాష్ట్రం 27.5 శాతం, గుజరాత్ 27.5 శాతం, జార్ఖండ్ 27 శాతం వరకూ అప్పులు చేశాయి.

బి.జె.పి.పాలిత రాష్ట్రాలన్నీ ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం పరిధులను దాటాయని, బి.జె.పి.పాలిత రాష్ట్రాలన్నీ భారీగా ద్రవ్యలోటులో కొట్టుమిట్టాడుతున్నాయని, రెవెన్యూ లోటు కూడా బి.జె.పి.పాలిత రాష్ట్రాల్లో అధ్వాన్నంగా ఉందని కూడా ఆర్.బి.ఐ. నివేదిక స్పష్టంచేసింది. తెలంగాణ రాష్ట్రం 25.3 శాతానికే పరిమితమయ్యింది. ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టం మేరకు తెలంగాణ రాష్ట్రంలో 36 శాతం వరకూ అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడానికి వెనుకంజవేస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసేందుకు ఆచీతూచీ అడుగులేస్తుండగా కేంద్రం మాత్రం ఆ కొద్దిపాటి అప్పులకు కూడా కొర్రీలు, అడ్డుపుల్లలు వేస్తూనే ఉందని కొందరు అధికారులు వివరించారు. ఇక మహారాష్ట్ర 18.1, ఒడిషా 18.6 శాతం వరకూ అప్పులు చేశాయి. ఇక చేసిన అప్పులకు వడ్డీల రూపంలో చెల్లింపులు చేస్తున్న రాష్ట్రాల్లో బి.జె.పి.పాలిత డబుల్ ఇంజన్ రాష్ట్రాలే అగ్రస్థానంలో ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రం రెవెన్యూ వసూళ్ళల్లో నుంచి 14.2 శాతం నిధులను వడ్డీల చెల్లింపులకే బడ్జెట్‌ను ఖర్చు చేస్తోంది.

తమతమ బడ్జెట్‌లో నుంచి వడ్డీల రూపంలో చెల్లింపులు చేస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక 14.3 శాతం, హర్యానా 20.9 శాతం, పంజాబ్ 21.3 శాతం, తమిళనాడు 21 శాతం, కేరళ 18.8 శాతం, పశ్చిమ బెంగాల్ 20.8 శాతం, ఒడిషా 21.3 శాతం, ఆంధ్రప్రదేశ్ 14.3 శాతం నిధులను వడ్డీల రూపంలో చెల్లిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 11.3 శాతం మాత్రమే వడ్డీలకు నిధులను చెల్లిస్తోంది. బి.జె.పి.పాలిత రాష్ట్రాలు సగటున 30 శాతంపైగా అప్పులు చేసి 14 శాతానికి పైగా నిధులను వడ్డీల రూపంలో చెల్లిస్తూ భారీగా రెవెన్యూ లోటులో కొనసాగుతూ తీవ్రమైన ద్రవ్యలోటులో కొనసాగుతున్న రాష్ట్రాలు కొత్తగా అప్పులు తెచ్చుకోవడానికి ఎలాంటి ఆంక్షలు విధించకుండా అడిగిందే తడువుగా వేల కోట్ల రూపాయలను అప్పులు తెచ్చుకోవడానికి అనుమతులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక నిర్వహణలో భేషుగ్గా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి అనేక కుంటిసాకులతో నిధుల సమీకరణకు అడ్డుపుల్లలు వేస్తున్న కేంద్రానికి చెంపపెట్టులా ఆర్.బి.ఐ. నివేదిక సారాంశం ఉందని కొందరు సీనియర్ అధికారులు మండిపడుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ నిధులను అత్యంత జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ఆభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎలాంటి ఢోకా లేకుండా పాలన చేస్తూ కూడా రెవెన్యూలోటు కేవలం -0.4 శాతం మాత్రమే ఉందని, మిగతా అన్ని రాష్ట్రాల్లో భారీగా రెవెన్యూలోటు ఉందని ఆర్.బి.ఐ.నివేదిక స్పష్టంచేస్తోంది. బహార్‌లో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా 5.5 శాతం రెవెన్యూలోటు ఉందని, ఒడిషాలో 3.3 శాతం, రాజస్థాన్ 3 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 1.3 శాతం, హర్యానా 1.4 శాతం, కేరళ 2.6 శాతం, మహారాష్ట్ర ఒక్క శాతం, ఆంధ్రప్రదేశ్ 1.6 శాతం, కర్ణాటక 0.4 శాతం, ఛత్తీస్‌గఢ్ 0.3 శాతం రెవెన్యూలోటులో కొనసాగుతున్నాయి.

మధ్యప్రదేశ్, కేరళ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖాండ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్ వంటి పది రాష్ట్రాల్లో సొంత ఆదాయ సమీకరణల్లో వెనుకబడి ఉన్నాయని ఆ నివేదిక వివరించింది. అంతేగాక అభివృద్ధి పధకాలకు నిధులను ఖర్చు చేయడంలో కూడా హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాలు బాగా వెనుకబడి ఉన్నాయని, ఈ రాష్ట్రాల్లో అభివృద్ధికి చేసే ఖర్చు చాలా తక్కువని ఆ నివేదిక పేర్కొంది. కాగా అభివృద్ధి, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేసిన తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను సమీకరించుకోవడానికి మాత్రం కేంద్రం, ఆర్.బి.ఐ. అడ్డుపుల్లలు వేస్తున్నాయని పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయని ఆ సీనియర్ అధికారులు అంటున్నారు. తెలంగాణ, ఒడిషా వంటి బిజెపియేతర రాష్ట్రాల్లో సబ్సిడీలు (సంక్షేమం), ఉచితాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఆ నివేదిక స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News