Tuesday, November 5, 2024

రైతులకు కెసిఆర్ బంధువు: గంగుల

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు, ప్రగతి నివేదిక అందరికి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగ గంగుల ప్రసంగించారు. అమరుల త్యాగాల ఫలితంగా ఆవిర్బవించిన తెలంగాణ రాష్ట్రం పదేళ్ల ప్రాయంలోనే దేశానికే అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఆరితేరింది. మన ఆస్థిత్వం కోసం జరిగిన పోరాటం బహు సుదీర్ఝమైనది. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, సబ్బండ వర్గాలు, సమస్త రాజకీయ పక్షాలు కలిసి చేసిన ఉద్యమ ఫలితం ఇది. రాష్ట్ర ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ఆనాడు తెలంగాణ ఉద్యమ నేతగా చేసిన ఆమరణ దీక్ష చారిత్రాత్మకమైనది. ఆ పోరాట ఫలితం, నాయకత్వ పటిమ వల్ల, ఈరోజు తెలంగాణ సమాజం ఆత్మగౌరవంతో, స్వయం ఆస్తిత్వంతో ఐశ్వర్యవంతంగా నిలదొక్కుకుందని ప్రశంసించారు.

ఈరోజు తెలంగాణ అంటే ప్రవహించే నదులను కలిపిన కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుకు వస్తుంది. మొత్తం సాగునీటి విస్తీర్ణం కోటి ఎకరాలకు చేరుకుందనడంలో సందేహం లేదు. నేడు తెలంగాణలో ప్రతి రైతు తమకు బంధువు దొరికాడని సంతోషిస్తున్నారు. ఇరవై నాలుగు గంటల కరెంటు, నదులన్నీ గలగలా నీళ్ల ప్రవాహంతో తెలంగాణమంతా పచ్చని పర్యావరణం అయింది. పంటదిగుబడులు పెరిగాయి వృద్ధులకు ఆసరా అందుతుంది. డబుల్ బెడ్ రూం ఇండ్లు, కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ లతో తెలంగాణ ముఖచిత్రమే మారింది. తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ గారి నాయకత్వంలో ఒక గొప్ప దార్శనికతతో పనిచేస్తుంది. విద్య వైద్య, ఆరోగ్య సంక్షేమం అన్ని రంగాల్లో స్వయంసిద్ద రాష్ట్రంగా అప్రకటితంగా ముందుకు పోతుంది. హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయిలో విస్తరిస్తున్న ఐటి, ఫార్మా పరిశ్రమలు ఎందరినో ఆశ్చర్యపరుస్తున్నాయి. హైదరాబాద్లో ఇటీవల నిర్మించబడిన ఎతైన డాః బి.ఆర్. అంబేడ్కర్ మహనీయుని విగ్రహం, అతి సుందరమైన సచివాలయం చారిత్రాత్మకమై చార్మినార్, గోల్కోండ వరసన నిలబడుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రం సిద్దించి తొమ్మిదేళ్లుదాటి పదోఏడులో పడ్డాం. అందుకే ఇది దశాబ్ది ఉత్సవ ఆవిర్బావ పండుగ. జూన్ 2 నుండి 22 వరకు వరుసగా రైతుదినోత్సవం, సురక్షా దినోత్సవం, తెలంగాణ విద్యుత్ విజయోత్సవం, తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, సాగునీటి దినోత్సవం, ఊరురా చెరువుల పండుగ, తెలంగాణ సంక్షేమ సంబురాలు, తెలంగాణ సుపరిపాలన దినోత్సవం, తెలంగాణ సాహిత్య దినోత్సవం, తెలంగాణ రన్, తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం, తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం, తెలంగాణ పల్లెప్రగతి దినోత్సవం, తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం, తెలంగాణ గిరిజనోత్సవం, తెలంగాణ మంచినీళ్ల పండుగ, తెలంగాణ హరితోత్సవం, తెలంగాణ విద్యాదినోత్సవం, తెలంగాణ ఆద్యాత్మిక దినోత్సవం, అమరుల సంస్మరణ వంటి కార్యక్రమాలను మనం నిర్వహించుకొబోతున్నాము.

ఇలా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న మహసంబురాల్లో ఆరోజు సకల జనుల సభలో పాల్గోన్న సబ్బండ వర్గాల ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు  తెలంగాణ ప్రజలందరు పాల్గోనాలని మనసార కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం దశాబ్ది కాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది. ప్రజాసంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది. “తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది” అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. మానవీయమైన దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచన, దార్శనికమైన ప్రణాళికా రచన, పారదర్శకమైన పరిపాలన వీటన్నిటి మేలు కలయిక అయిన “తెలంగాణ మోడల్” నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్నది. ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ తట్టుకొని తెలంగాణ బలీయమైన ఆర్ధిక శక్తిగా నిలబడగలిగింది సంక్షోభ సమయాలలోనూ సమర్ధవంతమైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను భారీ ఎత్తున నిరాటంకంగా అమలు చేయగలగడం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సమగ్రాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం.

ఆర్థిక వృద్ధి

తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండేళ్లలో జీ ఎస్ డి పి (GSDP) వార్షిక వృద్ధి రేటు 12 శాతం మాత్రమే. ఇది జాతీయ వృద్ధి రేటు అయిన 13.4 శాతం కంటే తక్కువ. రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత  ముఖ్యమంత్రి ఆర్థిక క్రమశిక్షణతో, పటిష్ఠమైన కార్యాచరణ చేపట్టడం వల్ల జీ ఎస్ డి పి (GSDP) క్రమేణా పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వ ఆదాయాన్ని అత్యధికంగా పెట్టుబడి వ్యయానికి వినియోగించటం, అభివృద్ధికి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమివ్వడంతో సమ్మిళిత అభివృద్ధి సాకారమవుతున్నది. ఈ అభివృద్ధి మోడల్ గురించి ఊరువాడ, ప్రతీ రాష్ట్రంలోను విశేషంగా చర్చ జరుగుతున్నది. తెలంగాణ మోడల్ అభివృద్ధి యావత్ దేశంలోను రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రధాన రంగాల్లోనూ, ఉప రంగాల్లోనూ గణనీయమైన వృద్ధి రేటు సాధిస్తున్నది. ఉదాహరణకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వచ్చిన అభివృద్ధితో మత్స్య సంపద, పశు సంపద భారీగా పెరిగింది. చేపల ఉత్పత్తి ప్రతికూల వృద్ధిరేటు నుండి రెండంకెల వృద్ధిరేటుకు చేరుకుంది. ఇది రాష్ట్రం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల సాధ్యమయింది. ఇదేవిధంగా ద్వితీయ, తృతీయ రంగంలోని ఐటీ, వాణిజ్యం, విద్యుత్తు, రవాణా, హోటళ్లు తదితర సేవారంగాల్లో అధిక వృద్ధి రేటు నమోదవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఏర్పడినా, దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై అంతగా లేదు. రాష్ట్రంలో వినియోగంతో పాటు, అన్ని రంగాల్లో పెట్టుబడులు పెరగడం వల్లనే ఇది సాధ్యమవుతున్నది.

తలసరి ఆదాయం

రాష్ట్రం సాధించిన ఆర్థికవృద్ధికి మరో కొలమానం తలసరి ఆదాయం. 2013-14 సంవత్సరంలో 1,12,162 రూపాయలు ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం, 2022-23లో 3,08,732 రూపాయల వరకు చేరుకున్నది. ఇది జాతీయ సగటు అయిన 1,72,000 రూపాయల కంటే 79 శాతం ఎక్కువ జాతీయ తలసరి ఆదాయంకన్నా తెలంగాణ తలసరి ఆదాయం 1,36,732 రూపాయలు ఎక్కువగా ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన అపూర్వమైన ప్రగతికి నిదర్శనం.

వ్యవసాయ రంగం

ప్రాథమిక రంగమైన వ్యవసాయ అభివృద్దే, ఇతర రంగాల అభివృద్ధికి ఆధారభూతంగా నిలుస్తుంది. సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణా నేడు దేశానికే దిశా నిర్దేశం చేస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రాలలోనూ అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు.
ఒకప్పుడు సంక్షోభంలో కూరుకొని అల్లాడిన తెలంగాణ వ్యవసాయానికి తిరిగి జవజీవాలను అందించడంలోనూ, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడే రైతుల్లో తిరిగి ధైర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది. ప్రభుత్వం చేసిన అసాధారణ కృషితో నాడు కరువుకాటకాలతో అలమటించిన తెలంగాణ నేడు సుజల, సుఫల, సస్యశ్యామల తెలంగాణగా అవతరించింది. అపూర్వమైన, అద్భుతమైన ఈ పరివర్తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కర్త, కర్మ, క్రియగా నిలిచారు. అందుకే రాష్ట్రంలోని కర్షక సోదరులు వారిని రైతు బాంధవుడిగా భావిస్తున్నారు. నిండు హృదయంతో ఆశీర్వదిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు పదేండ్లలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధాల రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం రూపాయలు 7,994 కోట్ల నిధులు ఖర్చు చేయగా, రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి 2023 జనవరి వరకు తెలంగాణ ప్రభుత్వం 1 లక్షా 91 వేల 612 కోట్ల రూపాయలు, అంటే 20 రెట్లు నిధులు అధికంగా ఖర్చు చేసింది.
నిలువెల్లా రైతు స్వభావాన్ని నింపుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  పాలనలో రైతుల కళ్ళలో దీనత్వం తొలిగి, ధీరత్వం తొణికిసలాడుతున్నది.

గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్తు, రైతురుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తారణాధికారుల నియామకం, రైతు వేదికలు, పంట కల్లాల నిర్మాణం, రైతుబంధు సమితిల ఏర్పాటు ఒకటా.. రెండా.. లెక్కకు మించిన అద్భుతమైన పథకాలను, సంస్కరణలను అమలులోకి తీసుకొచ్చారు. దుక్కి దున్నింది మొదలుకొని పండిన ప్రతిగింజా కొనుగోలు చేసేదాకా అడుగడుగునా రైతన్నకు కొండంత అండగా ప్రభుత్వాన్ని నిలిపారు.
రైతన్నలకు చార్జీలు లేకుండా కరెంటును, పన్నులు లేకుండా సాగునీటినీ అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఈ అద్భుతమైన చర్యల పర్యవసానంగానే నేడు దేశ వ్యవసాయ వృద్ధిరేటు కంటే తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు దాదాపు రెండు రెట్లు అధికంగా ఉంది.

దేశ వ్యవసాయ వృద్ధి రేటు 4 శాతం కాగా తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయ అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనతకు ఇది నిదర్శనం. 2014-15 సంవత్సరం వానాకాలం, యాసంగికి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1,67,483 ఎకరాలు సాగు కాగా, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ అభివృద్ది చర్యల వల్ల సాగు విస్తీర్ణం 2022-23 వానాకాలం, యాసంగికి 6,37,885 ఎకరాల్లో పంటను సాగుచేయడం జరిగినది. ఈ దశాబ్దకాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తులు మూడింతలు పెరిగింది. అదే విధంగా జిల్లాలో విత్తనోత్పత్తుల విలువ రూపాయలు 123.18 కోట్ల నుండి రూపాయలు 539.53 కోట్లకు పెరిగింది.

రైతుబంధు

75 సంవత్సరాల భారత దేశ చరిత్రలో 65 లక్షల మంది రైతులకు 65 వేలకోట్ల రూపాయల భారీ మొత్తాన్ని పంట పెట్టుబడి సాయం కింద అందించిన ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల వెలుగులో ఆవిష్కృతమైన “రైతుబంధు” పథకం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఒకప్పుడు రుణాల ఊబిలో చిక్కి ఆత్మహత్యలకు ఒడిగట్టిన రైతుల హృదయాల్లో ఆశాదీపాలను వెలిగించింది. భరోసాను నింపింది. వారి కన్నీరు తుడిచి కడగండ్లు తీర్చింది. డబ్బులు తమ ఖాతాల్లో జమ అయినట్టు తెలియజేస్తూ ఫోన్ కు మెసేజ్ రాగానే వచ్చే టింగు టింగు శబ్దం వినగానే రైతుల ముఖాలు ప్రకాశిస్తున్నాయి. రైతుబందు పథకం ద్వారా జిల్లాలో 2018 నుండి ఇప్పటి వరకు 1,81,908 మంది రైతులకు 1556.63 కోట్ల రూపాయలను వారి ఖాతాలలో జమచేయడం జరిగింది.

రైతు భీమా పథకం

రైతుభీమా పథకం రైతుల కుటుంబాలకు ఎనలేని ధీమానిస్తున్నది. విధివశాత్తూ ఏ రైతైనా మరణిస్తే, మరణించిన నాటి నుండి 10 రోజులలోగా ఐదు లక్షల భీమా సొమ్మును ప్రభుత్వం అతని కుటుంబానికి అందజేస్తున్నది. ఇందుకోసం నయాపైసా భారం రైతులపై వేయకుండా ప్రీమియం మొత్తాన్ని వందశాతం ప్రభుత్వమే ఎల్.ఐ.సీ (LIC) సంస్థకు చెల్లిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఈ విధమైన రైతు భీమాను ప్రపంచంలో ఏ ప్రభుత్వం అందిస్తున్న దాఖాలా లేదు. భీమా మొత్తం పొందడం కోసం రైతు కుటుంబం దఫ్తర్ కు పోవాల్సిన పనిలేదు, దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేదు. మధ్యవర్తుల ప్రమేయం అస్సలు లేదు.
కరీంనగర్ జిల్లాలో రైతుభీమా పథకం ద్వారా అగస్టు 15, 2018 నుండి ఇప్పటి వరకు 2377 మంది రైతులకు 118.85 కోట్ల రూపాయాలను భీమా రూపంలో అందజేసి రైతు కుటుంబాలకు ఆర్థికంగా చేయుత కల్పించడమైనది.

రైతు వేదికలు

వ్యవసాయ సంబంధమైన సాంకేతిక పరిజ్ఞానం ఇతర అంశాలపై రైతులు పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా ప్రభుత్వం ప్రతి ఐదువేల ఎకరాల క్లస్టర్ కు ఒక రైతు వేదికను అందుబాటులోకి తెచ్చింది. కరీంనగర్ జిల్లాలో 76 రైతువేదికలను మనం నిర్మించుకున్నాం.

నీటిపారుదల రంగం

వేసవిలో సైతం మత్తడి దుంకుతూ అలుగెల్లుతున్న చెరువులు, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా రిజర్వాయర్లకు చేరుతున్న నదీజలాలూ సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాయి.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని అన్యాయం జరిగింది. బాయిలు, బోర్లే దిక్కయిపోయిన రైతాంగం అప్పుల బాధలతో ఆత్మహత్యల పాలయింది. పాడుబడిన ఇండ్లు, బీడుపడిన పొలాలతో తెలంగాణ బిక్కచచ్చిపోయింది. నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా సాక్షాత్కరిస్తున్నది. అన్నపూర్ణగా అవతరించి దేశానికే అన్నం పెడుతున్నది.

మిషన్ కాకతీయ

కాకతీయుల నుండి ఆసఫ్ జాహీల దాకా నిర్మించి, పరిరక్షించిన చెరువులు ఆధునిక ప్రజాస్వామ్య పాలకుల హయాంలో శిథిలమైపోయాయి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సారథిగా పగ్గాలు చేపట్టిన వెనువెంటనే చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకం గొప్ప ఫలితాలను ఇచ్చింది. చెరువులు బాగు పడటంతో నీటి నిల్వ సామర్థ్యం బాగా పెరిగింది. ప్రాజెక్టులతో అనుసంధానం చేయడంతో వేసవిలో సైతం చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. భూగర్భ జలమట్టం పెరిగింది. 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పొందింది.

కేంద్ర ప్రభుత్వ అమృత్ సరోవర్ పథకానికి మన మిషన్ కాకతీయనే ప్రేరణగా నిలిచింది. వివిధ రాష్ట్రాలు మిషన్ కాకతీయ తరహాలోనే చెరువుల పునరుద్ధరణకు పూనుకోవడం మనందరికీ గర్వకారణం. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా పూర్తిచేసింది. దీంతో 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే అపూర్వ ఘట్టం. ఈ బహుళ దశల భారీ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి గారి కార్యదక్షత వల్ల, నీటిపారుదల శాఖ ఉద్యోగుల నైపుణ్యం వల్ల, వేలాది మంది కార్మికులు రాత్రింబవళ్లు చేసిన శ్రమ వల్ల మూడున్నర ఏళ్ల స్వల్పకాలంలోనే పూర్తిచేయగలిగాం. ఈ ప్రాజెక్టు ద్వారా కోటికి పైగా ఎకరాల ఆయకట్టును సృష్టించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం సంపూర్ణంగా సాకారం అవుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తిఅయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది.. ప్రపంచంలోనే చైనా, సియోల్ తరువాత మన కరీంనగర్ లో ఏర్పాటు చేస్తున్న బిగ్ ఓ వంటి అత్యద్బుతమైన ఏర్పాట్లతో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. అదే విధంగా కరీంనగర్ లోని పద్మనగర్ లో 10 ఎకరాల స్థలంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు అంకురార్పణ జరిగింది.

విద్యుత్తు రంగం

అన్నిరంగాలకూ 24 గంటలపాటు నిరంతరాయంగా, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ కీర్తి నేడు దశదిశలా వ్యాపించింది. తెలంగాణలో కరెంటు కోతలు, పవర్ హాలిడేలకు శాశ్వత ముగింపునిచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర సృష్టించారు.
తెలంగాణ ఆవిర్భవించిన నాడు రాష్ట్రంలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్ధ్యం 7,778 మెగావాట్లు మాత్రమే. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగిన అద్భుతమైన కృషివల్ల నేడు తెలంగాణ స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 18,453 మెగావాట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యుత్తురంగ బలోపేతం కోసం, కరెంటు సరఫరా, పంపిణీ వ్యవస్థలను మెరుగుపర్చడం కోసం ప్రభుత్వం 38 వేల 70 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.

భద్రాద్రిలో 1080 మెగావాట్ల సామర్ధ్యంతో 4 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్తగూడెం విద్యుత్ ప్లాంటులోనూ ఉత్పత్తి ప్రారంభమైంది. మంచిర్యాల జిల్లా జైపూర్ లో 1200 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి నిర్మించిన విద్యుదుత్పత్తి కేంద్రంలోనూ ఉత్పత్తి ప్రారంభమైంది. దీనికి అదనంగా 8,085 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్ జెన్ కో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా ధర్మల్ పవర్ ప్లాంట్ పనులు చివరిదశకు వచ్చాయి. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుదుత్పత్తి చేయడంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడిననాడు సోలార్ పవర్ కేవలం 74 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల నేడు రాష్ట్రంలో 5,741 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతున్నది.

మిషన్ భగీరథ

స్వతంత్ర భారతదేశ చరిత్రను పరిశీలిస్తే, ఇంతకాలం పాలించిన ప్రభుత్వాలు తమ చేతకానితనంతో ప్రజలకు కనీసం తాగేందుకు స్వచ్ఛమైన నీళ్ళను కూడా ఇవ్వలేదు. తాగునీటి కటకటతోపాటు కలుషిత జలాలతో వచ్చే వ్యాధుల బారినపడి ప్రజలు అనుభవించిన బాధలు వర్ణనాతీతం. దేశంలో తాగునీటి కష్టాలను సంపూర్ణంగా అధిగమించిన తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమే
గౌరవ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ మానస పుత్రిక అయిన మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షిత జలాలు సరఫరా అవుతున్నాయి. కలుషిత జలాల ద్వారా సంక్రమించే వ్యాధులను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది. రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడ పూర్తిగా అంతమైంది. ఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని 2020 సెప్టెంబర్ లో పార్లమెంట్ వేదికగా కేంద్రం ప్రకటించింది. మిషన్ భగీరథను ప్రేరణగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం “హర్ ఘర్ జల్ యోజన” కార్యక్రమాన్ని అమలుచేస్తున్నది. దేశానికే రోల్ మోడల్ గా మారిన మిషన్ భగీరథను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. 2022 అక్టోబర్ 2న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జల్ జీవన్ అవార్డుల్లో మిషన్ భగీరథకు ప్రథమ బహుమతి లభించింది.

కరీంనగర్ జిల్లాలొని 494 గ్రామీణ ఆవాసాలకు 3 సెగ్మెంట్ ల ద్వారా మంచినీటిని సరఫరా చేయబడుచున్నది. రూపాయలు 1492 కోట్లుతో 22 కట్టడాలు, 1231.96 కి.మి. పైపులైను పనులు పూర్తిచేయడం జరిగింది. అంతర్గత మంచినీటి పంపిణి వ్యవస్థ నిర్మాణం కొరకు రూపాయలు 231.85 కోట్లు మంజూరు చేయబడి. ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ లు 398 కొత్తవి, 509 పాతవి పురుద్దరించడం జరిగింది. 100% ఇండ్లకు నీటి సరఫరా చేయుటకు 2019.77 కి.మి. పైపులైను పనులు పూర్తిచేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా కరీంనగర్ ఆవాసాలలో 1,95,252 ఇండ్లకు మంచినీటి సరఫరా చేయబడుచున్నది.

ప్రజాపంపిణీ వ్యవస్థ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే పేదలకు రేషన్ బియ్యం పంపిణీపై గత ప్రభుత్వాలు విధించిన పరిమితులను ఎత్తివేసింది. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందజేస్తున్నది.
జిల్లాలో 33,720 మంది రైతులు పండించిన ప్రతి దాన్యం గింజను కొనుగోళు చేసేలా ఐకెపి, పిఎసిఎస్, డిసియంఎస్, హెచ్ఎసిఎ కేంద్రాలు 336 లను ప్రారంభించడం జరిగింది. కోనుగోలు కేంద్రాల ద్వారా రూపాయలు 440.38 కోట్ల విలువ గల 2,13,777.226 మెట్రిక్ టన్నుల దాన్నాన్ని కొనుగోలు చేయడం జరిగింది.
జిల్లాలో 2,78,411 ఫుడ్ సెక్యూరిటి కార్డులు కలవు. 566 రేషన్ షాపుల ద్వారా ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో 21 ఎల్ పి జి గ్యాస్ ఎజెన్సీలు నుండి సింగిల్, డబుల్, దీపం, సిఎస్ఆర్, ఉజ్వల కనెక్షన్ల ద్వారా 4,10,618 కనెక్షన్లు అందించడం జరిగింది.

ఆసరా పించన్లు

పరిపాలనకు మానవీయ పరిమళాలను అద్దుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి సింహభాగం నిధులను వెచ్చిస్తున్నది. గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా 200 రూపాయల పింఛన్ ఇచ్చినయి. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ కింద ఇచ్చే మొత్తాన్ని 2,016 రూపాయలకు పెంచింది. దివ్యాంగులకు 3,016 రూపాయలకు పెంచింది.
ప్రజల కష్టాలెరిగిన ప్రభుత్వం గనుక మానిఫెస్టోలో పేర్కొనక పోయినా, ఎవరూ డిమాండ్ చేయకపోయినా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, పైలేరియా బాధితులకు, డయాలసిస్ పేషంట్లకు సైతం 2,016 రూపాయల పింఛన్ నెలనెలా అందజేస్తున్నది. కరీంనగర్ జిల్లాలో ఎప్రిల్ 2023 వరకు 1,41,344 మంది లబ్దిదారులకు రూపాయలు 3086.60 కోట్లు చెల్లించడం జరుగుతుంది.

దళితబంధు

స్వతంత్ర భారతదేశంలో దళితజాతి నేటికీ అంతులేని వివక్షకు, దాడులకు గురవుతూనే ఉన్నది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ కృషి ఫలితంగా దళితుల జీవితాల్లో కొంతమేరకు వెలుతురు ప్రసరించింది. కానీ, ఆ ప్రయత్నాన్ని దేశ పాలకులు ముందుకు తీసుకుపోలేదు. ఫలితంగా నేటికీ దళితవాడలు వెనుకబాటుతనానికీ, పేదరికానికీ చిరునామాలుగానే ఉండిపోతున్నాయి.

అణగారిన దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన పథకమే ఈ దళితబంధు. దళితజాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి ఈ పథకానికి రూపుదిద్దారు.

చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. దళితబంధు సాయం వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా. ఆ సంపద సామాజిక పెట్టుబడిగా మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడటానికి తోడ్పడుతుంది.
కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 18,231 ఎస్సీ కుటుంబాలకు దళితబందు ద్వారా 1823 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది.

ఎస్.సి. (S.C.) సంక్షేమం

దళిత సోదరులు వ్యాపార రంగంలోనూ ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వ లైసెన్సుల ద్వారా చేసుకునే లాభదాయక వ్యాపారాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్నది.
షెడ్యూలు కులాలు, తెగల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్నది. ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషాను అనుసరించి నిధుల కేటాయింపుకు చట్టబద్ధత కల్పించింది.
దళిత విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి అంబేడ్కర్ ఓవర్సిస్ స్కాలర్ షిప్ క్రింద 20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది.
జిల్లాలో 22 వసతి గృహాలు, 9 కళాశాల వసతి గృహలను నిర్వహించడం జరుగుతుంది. దళితులకు గృహావసరాల కోసం 101 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నది.

బీసీ వర్గాల సంక్షేమం

వృత్తిపనులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వృత్తి పనుల వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నది. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొల్ల కురుమలకు చేయూతనివ్వడం కోసం.. తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టింది. 11వేల కోట్ల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నది.

జిల్లాలో గొర్రెల పంపిణి పథకం ద్వారా 2017-18, 2021-22 ఆర్థిక సంవత్సరాలలో 16724 మంది లబ్దిదారులకు గోర్రెలను పంపిణి చేయడం జరిగింది. పాడిపశువుల పంపిణి పథకం ద్వారా 2017-18, 2020-21, 2023-24 లలో 4800 మంది లబ్దిదారులకు పాడిపశువులను పంపిణి చేయడం జరిగింది. దళితబందు క్రింద హుజురాబాద్ నియోజక వర్గంలో 4 మండలాల పరిదిలో 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1286 మంది లబ్దిదారులకు 5144 పాడి గెదెలను అందించడం జరిగింది. అదే విధంగా గడ్డి కత్తిరించే యంత్రాలు, గడ్డి విత్తనాలు, పెరటి కోళ్ల పెంపకానికి ప్రోత్సహం ఇవ్వడం జరుగుతుంది.

విద్యా

ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ది పరచాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరు, కొనసాగింపుతోపాటు దశలవారీగా డిజిటల్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు మౌలిక వసతుల ఏర్పాటుకై “మన ఊరు మనబడి” కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 213 పాఠశాలలను గుర్తించి ఆయా పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి వసతి కల్పన, అవసరమైన మరమ్మతులు, విద్యుత్తు సౌకర్యం, ఫర్నీచర్‌, గ్రీన్‌ చాక్‌పీస్‌ బోర్డుల ఏర్పాటు, ప్రహరీగోడలు, అదనపు తరగతి గదులు, డైనింగ్‌హాళ్ల నిర్మాణం, పెయింటింగ్‌, డిజిటల్‌ విద్యకు అవసరమైన ఏర్పాట్లు తదితర మౌళిక వసతులను ఏర్పాటు చేయడం జరుగుచున్నది.
జిల్లాలో గత తోమ్మిది సంవత్సరాలుగా 2214 మంది విద్యార్థులు 10 జిపిఏ (GPA) సాదిస్తే వేయికి పైగా విద్యార్థులు త్రిపుల్ ఐటి (IIIT) లో, మరో వెయికి పైగా విద్యార్థులు ఎన్.ఎమ్.ఎమ్.ఎస్ (NMMS) స్కాలర్ షిప్ లను సాధించారు. ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు సైతం జాతీయ స్థాయిలో నిర్వహించే సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్, ఎన్.సి.ఎస్.సి (NCSC), పలు క్రీడా పోటిల్లో పాల్గోని అద్బుతమై ప్రతిభను కనబరచడంతో పాటు అవార్డులను కూడా గెలుపొందడం జరిగింది.

బీసి, షెడ్యుల్డు కులాలు గిరిజన సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు, మెస్ చార్జీలు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందించడంతో పాటు అంబేడ్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకం ద్వారా పేద విద్యార్థిని/విద్యార్థులకు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి రూపాయలు 20 లక్షలను అందించడం జరుగుతుంది. ఈ శాఖల ద్వారా న్యాయవాద శిక్షణకు ఆర్థిక సహకారాన్ని అందించడం జరుగుతుంది.

కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్

ఆడ పిల్లల పెండ్లి ఖర్చుల భారం భరించలేక నిరుపేద కుటుంబాలు పడుతున్న బాధలను చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి కకెసిఆర్ వారి భారాన్ని తగ్గించాలనే సదుద్దేశంతో మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా కళ్యాణలక్ష్మి /షాదీ ముబారక్ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ పథకం కింద కుల మతాలకతీతంగా పేదింటి ఆడపిల్లల పెండ్లి ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం 1,00,116 రూపాయల ఆర్ధిక సాయం అందిస్తున్నది.
మన జిల్లాలొ కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ పథకం ద్వారా 32,693 మంది లబ్దిదారులకు రూపాయలు 298 కోట్ల 05 లక్షల 95 వేల 857 రూపాయలు అందించడం జరిగింది.

మహిళా శిశు సంక్షేమం

దేశం సంపూర్ణమైన అభివృద్ధిని సాధించాలంటే అన్ని రంగాల్లోనూ మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం లభించాలి. మహిళాభ్యుదయం పట్ల నిబద్దత కలిగిన తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.

ఆరోగ్యలక్ష్మి

తెలంగాణ ఆవిర్భవించేనాటికి కేవలం 56 శాతం అంగన్ వాడీ కేంద్రాల్లో మాత్రమే పౌష్టికాహారం ఇచ్చేవారు. ఇప్పుడు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా నూటికి నూరుశాతం అంగన్ వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్లతో కూడిన పౌష్టికాహారాన్ని అంగన్ వాడీల ద్వారా గర్భిణులకు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్నది. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం అమలుచేస్తున్న ఆరోగ్యలక్ష్మీ పథకం అమలుతీరును నీతి ఆయోగ్ ప్రశంసించింది.

తెలంగాణకు హరితహారం

పర్యావరణ పరిరక్షణ ప్రతి మానవుని విద్యుక్త ధర్మంగా భావించే మన ముఖ్యమంత్రి గారు ‘తెలంగాణాకు హరితహారం’ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీఎత్తున చేపట్టారు. తెలంగాణకు హరితహారం స్థాయిలో మరే రాష్ట్రంలోనూ మొక్కలు నాటి, కాపాడే కార్యక్రమం అమలు కావడం లేదంటే అతిశయోక్తి లేదు.
హరితహారం కార్యక్రమంలో ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు తమ వార్షిక బడ్జెట్లో 10శాతం గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించి, పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలన్న నిబంధనను, నూతన మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాలలో ప్రభుత్వం పొందుపరిచింది స్థానిక సంస్థల కృషితో తెలంగాణ లోని ప్రతి పట్టణం, గ్రామం పచ్చదనంతో పరిఢవిల్లుతున్నది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన ఇండియా ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం తెలంగాణలో మొత్తం గ్రీన్ కవర్ 7.70 శాతం పెరిగింది. ఇది 5.13 లక్షల ఎకరాలకు సమానం
తెలంగాణాకు హరితహారం 8 విడతలు చేపట్టగా, అందులో కరీంనగర్ జిల్లాలో 2014-15 నుండి 2022-23 వరకు మొత్తం 2,02,49,020 మొక్కలు నాటడం జరిగింది.

వైద్యారోగ్య రంగం

దేశంలోకెల్లా అత్యుత్తమ వైద్యసేవలందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించింది. పేద ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి వల్ల 2014 లో 92 గా ఉన్న మాతృ మరణాల రేటు (MMR) 2022 నాటికి గణనీయంగా తగ్గి 43కు చేరింది. ఈరోజు దేశంలో అతి తక్కువ మాతృ మరణాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నది.
జిల్లాలో అరోగ్య కార్యక్రమాలలో ముందుంటు, ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని చూరగోన్నది. రూపాయలు 26 కోట్ల 55 లక్షలతో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియోలజి ల్యాబ్, పాలియేటివ్ బ్లాక్, శిశు సంరక్షణ యూనిట్ మొదలగు మౌళిక వసతుల కొరకు రూపాయలు 7 కోట్ల 86 లక్షలతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ లను నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. రూపాయలు 38 లక్షలతో జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో తెలంగాణ డయెగ్నిస్టిక్ కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. 52 బస్తిదవాఖానాలు, 73 పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది.

కంటి వెలుగు:

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని ఆర్యోక్తి. చూపు తగ్గితే జీవితం మసకబారి పోతుంది. రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారి కష్టాలు తీర్చడం కోసం ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నది. తొలిదశ విజయం స్ఫూర్తితో రెండవదశ కంటి వెలుగు నేత్రవైద్య శిబిరాలను భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగినది.
కంటిచూపు సమస్యల నివారణ కోసం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఉచిత కంటి పరీక్షలు జరిపి కళ్లద్దాలను సైతం అందిస్తున్న కంటి వెలుగు పథకం దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచింది. జిల్లాలో రెండు విడతలుగా కంటివెలుగు కార్యక్రమం ద్వారా 1015875 మందికి కంటి పరీక్షలను నిర్వహించడం జరిగింది. రెండవ విడతలొ నిర్వహించిన కంటిపరీక్షలలో 85216 మందికి రీడింగ్ గ్లాసెస్, 53858 మందికి ప్రిస్ర్కైబ్డ్ (Prescribed) కళ్లద్దాలను అందించడం జరిగింది.

జిల్లాకో మెడికల్ కాలేజీ

తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య విద్యను చేరువ చేస్తూ వైద్య సేవలను మరింత విస్తృత పరిచేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కరీంనగర్ జిల్లాకు కూడా ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేయడం జరిగింది.

ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులకు కొత్తపల్లి లో రూపాయలు 7 కోట్లతో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది.

కేసీఆర్ కిట్

గర్భం ధరించిన దశలో శ్రామిక మహిళలు కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వమే అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉదాత్త లక్ష్యంతో 2017 జూన్ 2న కేసీఆర్ కిట్ పథకం ప్రారంభమైంది. ప్రభుత్వ వైద్యశాలల్లో మహిళలు సురక్షితంగా ప్రసవించాలనే లక్ష్యం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
కేసీఆర్ కిట్ లో తల్లీబిడ్డలకు ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్ ను ప్రభుత్వం అందిస్తున్నది. కేసీఆర్ కిట్ పథకం కింద ఇప్పటివరకు 13.91 లక్షల మంది మహిళలు లబ్ది పొందారు.
జిల్లాలో కేసిఆర్ కిట్ పథకం ద్వారా 53001 మంది లబ్దిదారులకు కెసిఆర్ కిట్ లను పంపిణి చేయడం జరిగింది.

కేసీఆర్ న్యూట్రిషన్ కిట్

గర్భవతులలో పోషకాహారలోపం తలెత్తకుండా ఉండేందుకు న్యూట్రిషన్ కిట్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
గుండెపోటుతో జరిగే మరణాలు నివారించడానికి సిపిఆర్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు వయోవృద్దులకు ఫిజియో థెరపి కేంద్రం, మానసిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది.

పల్లె ప్రగతి

గ్రామీణ పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కావాల్సినసాధనాలన్నింటినీ సమకూర్చింది. ప్రతి ఊరికీ ఒక డంప్ యార్డును ఏర్పాటు చేసింది. ట్రాలీతో కూడిన ట్రాక్టర్ ను అందించింది. వీటిద్వారా పరిశుభ్రత పెరగడంతో ప్రజారోగ్యం మెరుగుపడింది. గ్రామాల్లో పచ్చదనాన్ని ప్రభుత్వం పెంచేందుకు నర్సరీలను ఏర్పాటు చేసింది. కోట్ల సంఖ్యలో పల్లెల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నది.

పట్టణ ప్రగతి

రోజురోజుకూ పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వం విశేషంగా దృష్టి సారించింది. ప్రభుత్వ చర్యలతో పురపాలక సంఘాలు ఆర్థికంగా బలపడ్డాయి. పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. పట్టణ ప్రగతి కింద రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు, హైదరాబాద్ సహా ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల కు ఇప్పటివరకు ప్రభుత్వం రూపాయలు 3855 కోట్ల నిధులిచ్చింది. ఈ పథకం ద్వారా పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, మెరుగైన పౌర సేవలు అందించడం జరుగుతున్నది.
అర్బన్ మిషన్ భగీరథ కింద 141 మున్సిపాలిటీల్లో రూపాయలు 6578 కోట్లతో ఇంటింటికీ సురక్షిత తాగునీటి జలాలను అందించే పథకాన్ని చేపట్టి 103 మున్సిపాలిటీల్లో పనులు పూర్తి చేసి తాగు నీరు అందిస్తున్నది. మిగతా మున్సిపాలిటీల్లో పనులు తుది దశకు చేరుకున్నాయి.

12 కోట్లతో SRR కళాశాల ఆవరణలో శ్రీ భాష్యం విజయసారథి అమృత వర్షిని కళ వేదిక నిర్మాణ పనులను చేపట్టాం. నగరంలో ఏ మూలన చూసిన అద్బుతమైన రోడ్లు, వీధీ దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, ఓపెన్ జిమ్ లు నిర్మించాం, నగరం ప్రదానకూడళ్లవద్ద ఏర్పాటు చేస్తున్న ఐలాండ్స్ నిర్మాణాలతో హైదరాబాద్ తరువాత రాష్ట్రంలో అభివృద్ది చెందిన నగరం కరీంనగర్ మాత్రమే అని. చేప్పుకుంటుపోతే అభివృద్ది కి కేరాఫ్ అడ్రస్ గా కరీంనగర్ అని చెప్పుకోవడంలొ అతిశయోక్తిలేదు.
పంచాయితిరాజ్ శాఖ ద్వారా 2014-15 నుండి 2022-23 వరకు 144.02 కి.మి. నూతన సిసి రహదారుల నిర్మాణము, 179.68 కి.మి. నూతన తారు రహదారుల నిర్మాణము, 261 సి.డి పనుల నిర్మాణము చేపట్టడం జరింగింది. 2014-23 లో యం జి ఎన్ ఆర్ ఎస్ ద్వారా రూపాయలు 260 కోట్లతో 280 కి.మి. సి.సి రహదారుల నిర్మాణము చేపట్టడం జరిగింది. రూపాయలు 24 కోట్లతో 166 గ్రామ పంచాయితీ భవనములు చేపట్టడం జరిగింది. రూపాయలు 7 కోట్లతో 71 వివో మహిళా సంఘం భవనముల నిర్మాణం చేపట్టడం జరిగింది. రూపాయలు 16.72 కోట్లతో 76 రైతువేదికల నిర్మాణము రూపాయలు 23.68 కోట్లతో 188 వైకుంఠదామములు నిర్మించడం జరిగింది. వివిధ పథకముల క్రింద 1573 కమ్యూనిటి హల్స్, 283 వివో మహిళ భవనములు, 65 దేవాలయాల పనులు చేపట్టడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో రూపాయలు 51 కోట్లతో సమీకృత కలెక్టరేట్ భవనం మంజూరై పనులు ప్రగతిలో ఉన్నాయి.

శాంతిభద్రతలు (పోలీసు)

ప్రభుత్వం ఏర్పరిచిన 100 డయల్, బ్లూ కోర్టు ద్వారా సత్వరమే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. ప్రతి మండల, పట్టణ స్థాయి పోలీస్ స్టేషన్కు రెండు నాలుగు చక్రాల (పెట్రో కారు) వాహనాలు, రెండు ద్విచక్ర (బ్లూకోల్ట్) వాహనాలు అందించి పోలీసులు సత్వరం స్పందించి ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా తోడ్పడుతున్నారు. ఒకప్పుడు Passport పొందడం అనేది చాలా కష్టంతో, నెలల తరబడి సమయంతో కూడుకున్న పని, కానీ నేడు 3 రోజుల్లో పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేసి వారం రోజుల్లోనే పాస్పోర్ట్ పొందే అవకాశం ప్రజలకు కల్పించడం జరిగింది. గత సంవత్సరం 16,365 పాస్పోర్ట్స్ ఎంక్వయిరీలు చేపట్టడం జరిగింది. పోలిస్ ట్రైనింగ్ సెంటర్ లో 2 ఎకరాల స్థలంలో సుమారు 28 వేల మొక్కలు నాటి మియావాకి పద్ధతిలో ఫారెస్ట్ ను సృష్టించడం జరిగింది. పోలీస్ ఆర్చరీ క్లబ్ ద్వారా సుమారు 30 మందికి విలువిద్య నందు శిక్షణ ఇవ్వబడుతుంది నైపుణ్యం కలిగిన ముగ్గురు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన విల్లులు అందజేయడం జరిగింది. కరీంనగర్ లో శిక్షణ పొందిన కుమారి T. చికిత అనే అమ్మాయి గత నెలలో ఉజ్బెకిస్తాన్ లో నిర్వహించినటువంటి ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్నది. ప్రస్తుతం ఒలింపిక్స్ సెలక్షన్ క్యాంప్ లో ఉన్నది. యువతను పెడదారి నుంచి తప్పించి సరైన మార్గంలో పయనించేలా ప్రేరణ అనే ప్రోగ్రాం ద్వారా కౌన్సిలింగ్, కెరియర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కరీంనగర్లో జాతీయ, అంతర్జాతీయ కంపెనీల సహకారంతో జాబు మేళాలు నిర్వహించి సుమారు 3,000 మందికి వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది.

జిల్లాలో ప్రభుత్వ, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలు చేసేందుకు తమ పూర్తి సహకారం అందిస్తున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు గౌరవ బోయినపల్లి వినోద్ కమార్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ నగరపాలక సంస్థ మేయర్, వివిధ కార్పోరేషన్ల గౌరవ చైర్మన్ లు, డైరెక్టర్లు, సభ్యులు, స్థానిక గౌరవ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా శుభాభినందనలు తెలుపుచున్నాను. జిల్లా అభివృద్దికి సహకారం అందిస్తున్న గౌరవ న్యాయమూర్తులకు, వారి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు ప్రత్యేక ప్రణామాలు. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం నిమగ్నమవుతున్న జిల్లా పోలిస్ కమీషనర్ గారికి, ఇతర పోలిస్ అధికారులకు, సిబ్బందికి అభినందనలు. నిరంతరం ప్రజల్లో అవగాహన పెంపోందిస్తూ ప్రజలను చైతన్య పరచడంలో, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు వివరించి, ప్రభుత్వ పథకాల ఫలాలు చివరి గడపకు చేరేలా తమవంతు సహాకారం అందిస్తున్న ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాల, బాలికలకు నా ఆశీస్సులు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News