Monday, December 23, 2024

దేశంపై తెలంగాణ ముద్ర

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు చెందిన పివి గ్రామ రాజకీయాల నుంచి జీవితాన్ని ప్రారంభించి ఆర్ధిక సంస్కరణలతో నేటి ఆధునిక భారత దేశానికి కారణమయ్యారు. పుట్టింది భూస్వామ్య కుటుంబమే అయినా పివి అవకాశం లభించినప్పుడల్లా సంస్కరణలతో తనదైన ముద్ర వేశారు. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా ఉత్తరాది రాజకీయాలకు భిన్నంగా తనదైన ముద్ర వేశారు. సరిగ్గా కెసిఆర్ లోనూ ఇవే లక్షణాలు. అవకాశం లభిస్తే తెలంగాణ బిడ్డ తన సత్తా చాటుతారు అని దేశానికి మూడు దశాబ్దాల క్రితం పివి నరసింహా రావు చూపిస్తే, కెసిఆర్ తెలంగాణ ద్వారా దేశానికి చూపించారు.

దేశంపై తెలంగాణ ముద్ర వేయనున్న కెసిఆర్ స్వతంత్ర స్వర్ణోత్సవ దేశంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది ఓ ప్రత్యేక అధ్యాయం. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, సాధించిన తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చునో దేశానికి చూపించిన నాయకులు కెసిఆర్. స్వాతంత్య్ర పోరాట కాలంలోనూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా దేశంపై ఉత్తరాది ఆలోచనలదే పెద్దరికం. రాష్ట్రపతిగా, కాంగ్రెస్ అధ్యక్షులుగా అప్పుడప్పుడు ఉత్తరాది వారికి అవకాశం లభించినా పగ్గాలు మాత్రం ఉత్తరాది నాయకుల చేతిలోనే.

పది శాతం కూడా సీట్లు లేని దేవెగౌడ లాంటి వారికి అప్పుడప్పుడు అధికారం లభించినా వారి ప్రభావం స్వల్పమే. మైనారిటీ ప్రభుత్వం అయినా పూర్తి స్థాయిలో దేశంపై బలమైన ముద్ర వేయడానికి అవకాశం లభించిన ఏకైక దక్షిణాది నాయకులు పివి నరసింహారావు. తెలంగాణకు చెందిన పివి గ్రామ రాజకీయాల నుంచి జీవితాన్ని ప్రారంభించి ఆర్ధిక సంస్కరణలతో నేటి ఆధునిక భారత దేశానికి కారణమయ్యారు. పుట్టింది భూస్వామ్య కుటుంబమే అయినా పివి అవకాశం లభించినప్పుడల్లా సంస్కరణలతో తనదైన ముద్ర వేశారు. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా ఉత్తరాది రాజకీయాలకు భిన్నంగా తనదైన ముద్ర వేశారు. సరిగ్గా కెసిఆర్ లోనూ ఇవే లక్షణాలు. అవకాశం లభిస్తే తెలంగాణ బిడ్డ తన సత్తా చాటుతారు అని దేశానికి మూడు దశాబ్దాల క్రితం పివి నరసింహా రావు చూపిస్తే, కెసిఆర్ తెలంగాణ ద్వారా కొంత వరకు దేశానికి చూపించారు.
పివి ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పుడు ఢిల్లీలోని ఉత్తరాది లాబీ చాలా చిన్నచూపు చూసింది.

అసలు కాంగ్రెస్ పెద్దలే పివి డమ్మీ అనుకున్నారు. ఉత్తరాది నాయకులే కాదు, అధికారగణం, ఉత్తరాది మీడియా సైతం మొదట్లో పివిని చిన్నచూపు చూసింది. అచ్చంగా తెలంగాణలో కెసిఆర్ ది సైతం ఇదే పరిస్థితి. తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌తో 2001లో కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్ర నాయకత్వం, ఆంధ్ర మీడియానే కాదు చివరకు తెలంగాణ నాయకులు సైతం సీరియస్‌గా తీసుకోలేదు.ఆరు నెలలు ఉద్యమం జరిపితే గొప్ప అనుకున్నారు. ఇంతైవటుడింతై అన్నట్టు వామనుడిగా కనిపించిన కెసిఆర్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించి తెలంగాణను సాకారం చేశారు. చివరకు తెలంగాణ ఏర్పడిన తరువాత సైతం చూద్దాం ఎన్నాళ్ళు ఉంటారో అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కెసిఆర్ ఇంటి వద్ద తన ఇద్దరు పిల్లలు తప్ప కుక్కలు కూడా ఉండవు అని కాంగ్రెస్ కురువృద్దులు వి.హనుమంతరావు జోస్యం చెప్పారు. ఉద్యమ కాలంలోనే ఏళ్ళతరబడి ఎంతో మంది ఎన్నో తిట్లు తిట్టినా పట్టించుకోకుండా కేవలం తన లక్ష్యం పైనే దృష్టి పెట్టిన కెసిఆర్ విజయం సాధించారు.

తెలంగాణ ఏర్పడినప్పుడు తొలి ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి. స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సీరియస్ గానే ప్రయత్నాలు జరిగాయి. ఓటుకు నోటు ద్వారా ప్రజాప్రతి నిధులను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే ప్రయత్నాలు జరిగాయి. కుట్రలు, కుతంత్రాలను ఒకవైపు ఎదుర్కొంటూ మరోవైపు దేశానికే ఆదర్శంగా నిలిపే విధంగా తెలంగాణను అభివృద్ధి చేశారు. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా తెలంగాణ అభివృద్ధి కళ్ళకు కనిపిస్తుంది. కరువు, రైతుల ఆత్మహత్యలు, పేదరికం తాండవించే తెలంగాణ పల్లెలు ఇప్పుడు పచ్చగా కళకళ మాటలు లాడుతున్నాయి. బాబును హైటెక్ సిఎం అంటూ మురిసిపోయే తెలుగు మీడియా కెసిఆర్‌ను మాత్రం మాటల మాంత్రికుడు అంటూ తమ అక్కసు వెళ్లగక్కుతుంది.

ఒట్టి మాటలతోనే ఇవన్నీ సాధ్యం అవుతాయా? మాటలతోనే కరువు నేలలు పచ్చగా కళకళ లాడుతున్నాయా? మాటలతోనే 24 గంటల పాటు నిరంతరం విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నారా? ఎప్పుడో క్రీస్తు పూర్వం నాటి విషయాలు కాదు మొన్న మొన్ననే ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ కోతలు, రైతుల ఆత్మహత్యలు, ఇందిరా పార్క్ వద్ద విద్యుత్ కోసం పారిశ్రామిక వేత్తల ధర్నాలు, విద్యుత్ చార్జీలు పెంచవద్దు అని ఆందోళన చేసినందుకు అసెంబ్లీ ఎదురుగా మన కళ్ళ ముందే కదా రైతులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసింది. తెలంగాణ వచ్చాక ఎనిమిదేళ్ల కాలంలో అలాంటివి చూశామా? అధికారం కోసం కొన్ని పార్టీల నాయకులు, కూల్చేస్తాం, పేల్చేస్తాం అనే పనికిరాని మాటలు వినిపిస్తున్నాయి. కానీ జరిగిన అభివృద్ధిని, కనిపిస్తున్న మార్పును ఎవరూ కాదనలేరు. మంత్రాలు, మాయలేమీ లేవు. తెలంగాణ అవసరాలు ఏమిటీ? వాటిని ఎలా సాధించాలి, ఉన్న వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే కోణంలో ఆలోచన చేయడం, ఆలోచనలు అమలు చేయడంతో ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణ దేశం ముందు సగర్వంగా తలెత్తుకొని నిలిచింది. చేయాల్సినవి ఇంకా ఎన్నో ఉండవచ్చు, అదే సమయంలో చేసినవి ఎన్నో ఉన్నాయి.

తెలంగాణ గురించి సమగ్రంగా అధ్యయనం చేయడం ద్వారానే కెసిఆర్ ఉద్యమాన్ని విజయవంతం గా నిర్వహించారు. అదే విధంగా తెలంగాణలో అభివృద్ధి సాధించారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు, తెలంగాణ సాకారం అయ్యాక మరో రెండు దశాబ్దాలు అయ్యాక కానీ ఆంధ్ర ప్రజలు తెరాసకు అనుకూలంగా స్పందించరు అనిపించింది. కానీ చిత్రంగా కెసిఆర్ ఏడాది కాలంలోనే అది సాధించారు. బ్రహ్మాండమైన శాంతి భద్రతలు, అవసరం అయినంత విద్యుత్, ఉపాధి అవకాశాలు, ఎక్కడా కనిపించని వివక్ష. దీంతో తెలంగాణ ప్రజలు తెరాసను ఎలా ఓన్ చేసుకున్నారో, ఆంధ్ర ప్రజలు కూడా అలానే సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. సానుకూలత ఓటు రూపంలో మారుతుందా? అంటే తెలంగాణలో మారింది కానీ, ఆంధ్రలో అంతఈజీ కాకపోవచ్చు. 47 ఏళ్ళ వయసులో తెలంగాణ జెండాను భుజాన వేసుకొని ఊరూరా తిరిగిన కెసిఆర్ ఇప్పుడు 69 ఏళ్ళ వయసులో భారత జెండాతో దేశానికి అవసరం అయిన రాజకీయ అజెండాతో అన్ని రాష్ట్రాల్లో తిరగడానికి బయలు దేరారు.

వేయి మైళ్ళ ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ప్రత్యర్థి కచ్చితంగా బలవంతుడు. అతని నినాదం మతం అది మరింత బలమైనది. ఈ దేశానికి ఇప్పుడు మతతత్వం కావాలా? అభివృద్ధి కావాలా అనే ప్రశ్న దేశ ప్రజల ముందు ఉంచేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ దగ్గరేమీ లేదు. అలా అని ఒక్క అడుగు కూడా వేయకుండా కూర్చుంటే ప్రయాణం సాగదు. 69 ఏళ్ళ వయసులో ధైర్యంగా ఎన్నో ఆశలతో బయలుదేరిన కెసిఆర్‌కు తెలంగాణ ఆశీస్సులు ఉండి తీరుతాయి. తెలంగాణలో సాధ్యం అయిన అభివృద్ధి దేశంలో ఎందుకు సాధ్యం కాదు అని ప్రశ్నిస్తే తప్పేముంది. ప్రశ్నను దేశం ఎలా స్వీకరిస్తుంది? ఏం సమాధానం చెబుతుంది అనేది దేశం ఇష్టం. ప్రశ్నించే వారిపై కేసులు, దాడులతో నోరు నొక్కేస్తున్నప్పుడు, దేశమంతా మౌనంగా ఉన్నప్పుడు ప్రశ్నించే ఒక్క గొంతును ఎందుకు అడ్డుకోవాలి? దేశానికి మంచే జరుగుతుంది అని ఆశిద్దాం.

బుద్దా మురళి
9849998087

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News