జఫర్‌గడ్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణా రాష్ట్రంలో అధికారం చేతపట్టిన సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తెచ్చాడని స్థానిక ఎమ్మెల్యే డా తాటికొండ రాజయ్య అన్నారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మండలంలోని సూరారం, తీగారం, లక్ష్మీనాయక్, తిమ్మపేట్, తమ్మడపల్లి (ఐ), ఉపుగల్లులో ఎమ్మెల్యే ప్రగతి నివేదన యాత్ర నిర్వహించారు. ఉప్పుగల్లు రైతు వేదిక భవనంలో రాత్రి పల్లె నిద్ర చేశారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించారు. ఆయా గ్రామాల్లో మాట్లాడారు.
అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు, దేశంలో మరెక్కడా తెలంగాణా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని చెప్పారు. ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆరోగ్యలక్ష్మీ, కెసిఆర్ కిట్, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు వంటి కార్యక్రమాలు కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఆయా గ్రామాల్లో మహిళలు, పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
అంబేద్కర్‌తోనే అందరికి రాజ్యాంగ ఫలాలు…
అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే దేశంలోని అన్ని వర్గాల వారికి నేడు రాజ్యాంగ ఫలాలు దక్కుతున్నాయని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మంపేట్‌లో స్థానిక జడ్పిటిసి సభ్యురాలు ఇల్లందుల బేబి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. అంటరాని తనం, అస్పృశ్యత రూపు మాపడానికి అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు అన్నీ అంబేద్కర్ అందించిన రాజ్యాంగంతోనే తొలగిపోయాయని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అంతా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాలో స్థానిక ఎంపిపి రడపాక సుదర్శన్, జడ్పిటిసి సభ్యురాలు ఇల్లందుల బేబి శ్రీనివాస్, మార్కెట్ ఛైర్మన్ గుజ్జరి రాజు, వైస్ ఎంపిపి కొడారి కనుకయ్య, తహసీల్దార్ స్వప్న, ఎంపిడివో శ్రీధర్ స్వామి ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు. భారాస నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.