వనపర్తి ప్రతినిధి: బిఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం, పెబ్బేరు మండలాల పరిధిలోని పాతపల్లి, పెబ్బేరు, శ్రీరంగాపురం, అయ్యవారిపల్లి, రంగాపూర్, సుగూరు, తిప్పాయిపల్లి, గుమ్మడం, వెంకటాపూర్, బూడిదపాడు, చెల్లిమిల్లలకు చెందిన వివిధ పార్టీల నాయకులు వంద మంది హైదరాబాద్‌లోని మంత్రుల సముదాయంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పాలనలో సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, విద్యుత్ అన్నింటిని సమైక్య పాలకులు తెలంగాణకు దూరం చేశారని అన్నారు. రెండు తరాలు పూర్తిగా నష్టపోగా సిఎం కెసిఆర్ నాయకత్వంలో మూడో తరం చేసిన పోరాటంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుచూపు, పట్టుదల కారణంగా 60 ఏండ్లలో కోల్పోయినవన్ని తొమ్మిదేళ్లలో దక్కించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పాలన, సంక్షేమ పథకాలను దేశం అనుసరిస్తుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సి కసిరెడ్డి నారాయణ రెడ్డి, బిఆర్‌ఎస్ నేత ఎద్దుల సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.