Thursday, January 23, 2025

ఇన్నోవేషన్ల మాగాణం తెలంగాణ

- Advertisement -
- Advertisement -

సుస్థిర, సమ్మిళిత వృద్ధి సాధించాలి అంటే వ్యవస్ధలో నూతన ఆవిష్కరణలు అత్యంత ఆవశ్యకం. అంతర్జాతీయ పోటీని తట్టుకుని ముందుకు పోవాలి అంటే నవకల్పనలు ఎంతగానో దోహదపడతాయి. దీని ద్వారా దేశం ఎదుర్కొంటున్న ఎన్నో పెద్ద సవాళ్ళను చాక చక్యంగా ఎదుర్కోవచ్చు. ఈ తరహా ఆవిష్కరణలు మిలియన్ల కొద్దీ నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. దీని వలన ఎంతో మంది పేదరికం నుండి బయట పడటానికి ఆవిష్కరణలు ఎంతగానో సహకరిస్తాయని చెప్పవచ్చు. భాగ్యవంత దేశాల విజయ రహస్యంలో నూతన ఆవిష్కరణలు ప్రధాన పాత్ర వహించాయి.

Telangana development model
మన దేశంలో కూడా ఈ తరహా నూతన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూ దేశంలో గల వివిధ రాష్ట్రాలను పోటీ పడి నవకల్పనల దిశగా ముందుకు పోవడానికి నీతి ఆయోగ్ ఓ నూతన వ్యూహాన్ని ముందుకు తీసుకు వచ్చింది. అదే భారత ఆవిష్కరణల సూచిక (ఇన్నోవేషన్ ఇండెక్స్) దీనిని ప్రతి సంవత్సరం నీతి ఆయోగ్, ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ కలిసి సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. ఈ ఇండెక్స్ దేశంలో నవ కల్పనలు, నూతన ఆవిష్కరణలో వివిధ రాష్ట్రాల పని తీరును తెలియజేస్తుంది. ఈ సూచీని బట్టి ఆయా ప్రాంతాల్లో కొత్త ఆవిష్కరణలకు ఉన్న అనుకూలతలు, సవాళ్లను తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. రాష్ట్రాల మధ్య పోటీతత్వాన్ని పెంచి నూతన ఆవిష్కరణలు రావడానికి దీని ద్వారా అవకాశం కలుగుతుంది.

ఫలితంగా జాతీయ స్థాయిలో ఆవిష్కరణల విషయంలో సమగ్ర విధానాల రూపకల్పనకు అవకాశం ఏర్పడుతుంది. దీని కోసం రాష్ట్రాలు, ఇతర వాటాదారుల భాగస్వామ్యంతో దేశ వ్యాప్తంగా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా నీతి ఆయోగ్ పని చేస్తుంది. ఈ ప్రక్రియలో నూతన ఆవిష్కరణలు చేసిన రాష్ట్రాలను ప్రశంసిస్తూ వెనుకబడిన రాష్ట్రాలకు మార్గదర్శకాలు సూచించే అవకాశం ఏర్పడుతుంది. కాలక్రమంలో ఈ ప్రక్రియ దేశంలో ఆవిష్కరణలు వేగం పుంజుకోవడానికి వీలు కల్పించి రానున్న రోజుల్లో స్వయం సమృద్ధ భారత్‌కు బాటలు పడతాయని నీతి ఆయోగ్ ఆశయం. దీని కోసం ఆవిష్కరణ సామర్థ్యాలు, పర్యావరణ వ్యవస్థలను పరిశీలించడం ద్వారా ఈ ఇండిక్స్‌ను నీతి ఆయోగ్ ప్రతి ఏడాది ప్రకటిస్తోంది.

ఈ జాబితాను బట్టి సంబంధిత ప్రాంతాల్లో కొత్త ఆవిష్కరణల కోసం మెరుగైన పరిస్థితులు, అనుకూలతలు, సవాళ్లను కనుగొనే లక్ష్యంతో 2019 అక్టోబరులో మొదటి సారిగా ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌ను 2021 జనవరిలో రెండో ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌ను విడుదల చేశారు. తాజాగా మూడవ ఎడిషన్ ఫలితాలు విడుదలయ్యాయి. గతంలో రెండింటినీ 36 సూచికలతో పోలిస్తే, తాజా సూచికలో భారతదేశంలో ఆవిష్కరణ పనితీరును కొలవడానికి సూక్ష్మమైన, సమగ్రమైన దృక్పథాన్ని అందించడానికి ఏడు అంశాల్లో 66 సూచికలు ఆధారంగా మొత్తం స్కోర్ కేటాయించడం జరిగింది. దీని ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి పని తీరును సమర్థవంతంగా పోల్చడం కోసం దేశాన్ని ‘17 ప్రధాన రాష్ట్రాలు’, ‘10 ఈశాన్య, కొండ రాష్ట్రాలు’ , ‘9 కేంద్ర పాలిత ప్రాంతాలు, నగర రాష్ట్రాలు’ గా విభజించి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (Global Innovation Index) తరహాలో ఈ సూచీని రూపొందించారు.

ఈ విధానంలో ర్యాంకుల కోసం తీసుకున్న కొలమానాలను ‘ఎనేబులర్స్, ‘పెర్ఫార్మర్స్’ పేరుతో రెండు గ్రూపులుగా విభజించారు. వాటిలో ‘ఎనేబులర్స్’ విభాగంలో తెలంగాణ నాలుగో స్థానం, ఎపి 8వ స్థానం సాధించాయి. పెర్ఫార్మర్స్ విభాగంలో తెలంగాణ తొలి స్థానం పొందగా.. ఆంధ్రప్రదేశ్ 14తోనే సరిపెట్టుకుంది. నైపుణ్యం ఉన్న కార్మికులు సేఫ్టీ లీగల్ ఎన్విరాన్మెంట్ నాలెడ్జి అవుట్ ఫుట్ వంటి విషయాలలో కూడా ఎపి జాతీయ సగటు కన్నా తక్కువగా ఉన్నప్పటికీ హ్యూమన్ కాపిటల్, వ్యాపార పరిస్ధితులు విషయంలో మాత్రం జాతీయ సగటు కన్నా ఎక్కువుగా ఉంది. ఈ గణాంకాల ప్రకారం వరుసగా మూడవసారి కర్ణాటక రాష్ట్రం 18.01 పాయింట్లతో ప్రధమ స్ధానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. 17.66 పాయింట్లతో తెలంగాణ ద్వితీయ స్ధానాన్ని, 16.35 పాయింట్లతో హర్యానా తృతీయ స్ధానాన్ని దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రం 13.22 పాయింట్లతో 9 వ స్ధానానికి పరిమితం అయ్యింది. ఈశాన్య, కొండప్రాంత రాష్ట్రాల్లో మణిపూర్; కేంద్ర పాలిత ప్రాంతాలు, సిటీ స్టేట్స్ కేటగిరీలో చండీగఢ్ అగ్రస్థానంలో ఉన్నాయి.

ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో దేశంలోని టాప్ 10 రాష్ట్రాలు ఇవే..1. కర్ణాటక, 2. తెలంగాణ, 3. హర్యానా, 4. మహారాష్ట్ర, 5. తమిళనాడు, 6. పంజాబ్, 7. ఉత్తరప్రదేశ్, 8. కేరళ, 9. ఆంధ్రప్రదేశ్, 10. జార్ఖండ్ ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బిహార్ ఈ సూచీలో ప్రధాన రాష్ట్రాల్లో అట్టడుగు స్థానాల్లో నిలిచాయి.

తెలంగాణ ముందంజ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉంటూ వస్తోన్న తెలంగాణ రాష్ట్రం ఇన్నోవేషన్లలో గతంలో 4వ స్ధానంలో ఉండగా ఇప్పుడు తాజాగా ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 2 వ స్ధానం దక్కించుకుని టాప్ పొజీషన్‌కు చేరుకుంది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలను సైతం అధిగమించి ఇన్నోవేషన్ తెలంగాణ అనిపించుకుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ మాత్రం గతంలో 7 వ స్ధానం కలిగి ఉండగా, ప్రస్తుతం 9వ స్ధానానికి దిగజారింది. అంతే కాదు ఆవిష్కరణ సూచీలో ద్వితీయ స్ధానాన్ని దక్కించుకున్న తెలంగాణకు పెర్ఫార్మర్ విభాగంలో మొదటి ర్యాంకు లభించింది. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్‌కు 14వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.
పెద్ద బహుళ జాతి సంస్ధలు ఏర్పాటులో కాని స్టార్ట్ అప్‌లో మెరుగైన పనితీరులో కానీ తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రత్యేకించి స్టార్ట్ అప్‌లకు తెలంగాణ నిలయంగా మారింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఎందుకంటే స్టార్టప్‌ల సంఖ్య గతేడాదితో పోలిస్తే తెలంగాణలో 4,900 నుంచి 9 వేలకు చేరింది. ‘ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి)’ ప్రయోగశాలలను కలిగి ఉన్న పాఠశాలల విషయాన్ని తీసుకుంటే.. తెలంగాణలో వాటి సంఖ్య 17 నుంచి 35 శాతానికి పెరిగింది. ఉన్నత విద్య చదువుతున్నవారి శాతం 9.7% నుంచి 15.7 శాతానికి చేరింది. నైపుణ్యం గల మానవ వనరుల సృష్టి కోసం ఏర్పాటు చేసిన ప్రైవేటు పరిశోధన, అభివృద్ధి సంస్థలు కూడా 0.3 నుంచి 1.4 శాతానికి చేరాయి. పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, ఇండస్ట్రియల్ డిజైన్‌ల్లో తెలంగాణ ఉత్తమ పనితీరును కనబరుస్తోంది.

తెలంగాణ రాష్ట్రం బహుముఖ అభివృద్ధిని సాధించడానికి ఇన్నోవేషన్ (ఆవిష్కరణలు), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక వసతులు), ఇంక్లూసివ్ గ్రోత్ (సమగ్రాభివృద్ధి)ని ‘3 ఐ మంత్రంగా పాటించి అమలులో దార్శనికత పాటించడమే కారణం అని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎన్నో అంశాలలో ముందజలో ఉన్న తెలంగాణ నాలెడ్జ్ డిఫ్యూజన్’ అంశంలో మాత్రం పనితీ రును మెరుగుపర్చుకోలేక పోయింది. పరిజ్ఞానం సృష్టించడం, అమలు చేయడంలో తెలంగాణ ముందంజలో ఉన్నా.. ఉత్పత్తులు, సేవల్లో మాత్రం ఆశించిన స్థాయిలో లేదని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. సృష్టిస్తున్న పరిజ్ఞానాన్ని ఉత్పత్తులు, సేవల రూపంలోకి మార్చగలిగినప్పుడే నాలెడ్జ్ డిఫ్యూజన్’ లో కూడా మంచి ఫలితాలు సాధించవచ్చునని తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ విషయంలో దృష్టి సారించాలని నీతి ఆయోగ్ సూచించింది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

ఆవిష్కరణలో జాబితాలోనే కాదు ఎఫ్‌డిఐలను అత్యధికంగా ఆకర్షిస్తున్న రాష్ట్రాల జాబితాలోనూ కర్ణాటక తొలి స్థానంలో నిలిచింది. దేశంలోకి ఎఫ్‌డిఐ మార్గాన వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 38 శాతం ఈ రాష్ట్రానికే వెళుతున్నాయి. కర్ణాటక తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (26%), ఢిల్లీ (14%) ఉన్నాయి.

పట్టణీకరణ: దేశంలో పట్టణీకరణ చాలా నెమ్మదిగా సాగుతున్నట్లు సూచీ తెలిపింది. అయితే, ఢిల్లీ (2.5 కోట్లు), ముంబై (2.1 కోట్లు), కోల్‌కతా (1.5 కోట్లు) ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల జాబితాలో ఉన్నట్లు పేర్కొంది. దేశ జిడిపిలో నగర జనాభా వాటా 63 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. దేశంలో ఏ రాష్ట్రమైనా తమకున్న పరిమిత వనరులలో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూనే నూతన ఆవిష్కరణలు దిశ గా అడుగులు వేయాలి. ఆనాడే దిగుమతులపై ఆధారపడే పరిస్ధితి తగ్గి స్వయం సమృద్ధి సాధించగలుగుతాం. అలా కాకుండా అధికారమే పరమావిధిగా ఓటు బ్యాంకు రాజకీయాలతో ఉచితాలు ప్రకటించుకుంటూపోతే ఎప్పటికీ నవకల్పనలు సృష్టి సాధ్యం కాదు. సుస్ధిర అభివృద్ధి అనేది ఒక కలగానే మిగిలి పోతుంది.

ఆర్ శ్రీనివాసరాజు
9441239578

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News